
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎవరూ ఊహించని పరిణామం. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సమయం. మొదటి వేవ్, సెకండ్ వేవ్‌ల తరహాలోనే విలయం సృష్టిస్తుందనుకున్న కరోనా థర్డ్ వేవ్ ఆరువారాల్లోనే చాప చుట్టేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, భారీగా నష్టం జరుగుతుందని వార్తలొచ్చాయి. కానీ, నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేదు. మూడో వేవ్ కేవలం 6 వారాల్లోనే అంతమైంది. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఎంత ఉధృతంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు భారీగా చర్యలు చేపట్టడంతో నియంత్రణ సాధ్యమైంది.
కేసులూ తక్కువే
మొదటి, సెకండ్ వేవ్‌లతో పోలిస్తే మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్‌లో రమారమి 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. సెకండ్ వేవ్‌లో సైతం 8 లక్షల కేసులొచ్చాయి. థర్డ్‌వేవ్‌లో ఇప్పటివరకు 2 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో కేసులు అదుపులోకి రావడానికి 10 నెలలు పట్టింది. సెకండ్ వేవ్‌లోనూ నాలుగు మాసాలు పట్టింది. కానీ థర్డ్ వేవ్ ఆరు వారాల్లోనే అదుపులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ప్రక్రియ జరగడం వల్లే కేసుల తీవ్రత తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు.
భయాందోళనలు లేవు
థర్డ్ వేవ్‌లోనూ కుర్రాళ్లే ఎక్కువగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల్లో 21–30 ఏళ్ల మధ్య వయస్కులు 26.63 శాతం ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కుర్రాళ్లు థర్డ్‌వేవ్‌లో ఎదురొడ్డి నిలిచినట్టయ్యింది. పైగా ఈసారి భయాందోళనలు కూడా లేవు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో, దీన్నుంచి ఎలా బయట పడాలో అవగాహన ఉండటంతో సులభంగా గట్టెక్కారు. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం బాధితుల్లో మూడు శాతం మంది మాత్రమే ఆస్పత్రులకు వచ్చినట్టు తేలింది. అదే సెకండ్ వేవ్‌లో 17 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment