ముదురుతున్న ఎర్రబుగ్గ వివాదం
సాక్షి, ముంబై: స్నేహల్ ఆంబేకర్ ముంబై మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులైనా కాలేదు కానీ వివాదాలు మాత్రం ఆమెను ముసురుకుంటున్నాయి. తన కారుపై ఎర్ర బుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. మేయర్ వాహనానికి ఎర్రబుగ్గ అమర్చడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కోర్టును ఆశ్రయిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. దీంతో స్నేహల్ కొత్త వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వారు ఎర్రబుగ్గ వాహనాలను వినియోగించకూడదు. ఇది మేయర్ కూడా వర్తిస్తుంది. అంబేకర్ మాత్రం తన వాహనంపై కచ్చితంగా ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో ఈ వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమంటే న్యాయస్థానాన్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
ఒకవేళ ఆమె తన వాహనంపై ఎర్రబుగ్గ అమర్చుకుంటే, తప్పకుండా కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని విపక్ష నాయకులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేయర్లంతా తమ వాహనాలపై ఎర్రబుగ్గ తొలగించుకోవాల్సిందేనని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు మేయర్‌గా పనిచేసిన సునీల్ ప్రభు మాత్రం ఎర్రబుగ్గను యథావిధిగా కొనసాగించారు. కొత్త మేయర్ స్నేహల్ ఆంబేకర్ కూడా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీవీఐపీలు మాత్రమే ఎర్రబుగ్గలను వాహనాలకు అమర్చుకోవాలి. అంతగా అవసరమనుకుంటే అంబేకర్ పసుపు రంగు బుగ్గ అమర్చుకోవాలి. వీఐపీలకు కేటాయించిన ఎర్రబుగ్గను మేయర్ అమర్చుకోవడం సరికాదు’ అని దేవేంద్ర స్పష్టం చేశారు.
దీనిపై స్నేహల్ ఆంబేకర్ వివరణ ఇస్తూ కారుపై ఎర్రబుగ్గ అమర్చుకోవడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఇతరుల మాదిరిగా తను గొప్పలకు పోవడం లేదని చెప్పారు. ‘దేశ, విదేశాల నుంచి ముంైబె కి వచ్చే వీఐపీలకు స్వాగతం పలకాల్సిన బాధ్యత మేయర్‌ది. ఇలాంటి సందర్భాల్లో వాహనంపై ఎర్రబుగ్గ ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. దీనిపై సీనియర్ నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను’ అని ఆమె స్పష్టం చేశారు.
అంబేకర్ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు బాధ్యతలేంటో అడిగి తెలుసుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. తన క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ ఆమె చాలా సేపు గడిపారు. ఉద్యోగులతో పరిచయాలు అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలుచేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరాబాదరగా వెళ్లిపోయారు.