కారుపై ఎర్రబుగ్గను తొలగించే ప్రసక్తే లేదు!
ముంబై: తన అధికారిక వాహనంపై ఉన్న ఎర్రబుగ్గ (రెడ్ బీకాన్)ను తొలగించేది లేదంటూ ముంబై నగర్ మేయర్ స్నేహాల్ అంబేకర్ తేల్చిచెప్పారు. ఆమె కొత్తగా మేయర్ గా ఎన్నికైన అనంతరం తన అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను కల్గి ఉండటంతో వివాదం చెలరేగింది. దీంతో స్పందించిన ఆమె.. ముఖ్యమంత్రి వాహనంపై ఎర్రబుగ్గకు అనుమతి ఇచ్చి.. మేయర్ కారుపై తొలగించాలని పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. అంతేకాకుండా మేయర్ పదవి అనేది సీఎం పదవితో సమానం అంటూ ఎద్దేవా చేశారు. 'మేయర్ స్థానం సీఎం స్థానంతో సమానం. సీఎం వాహనంపై రెడ్ బీకాన్ ఉంటుంది. మరి నాకు ఇబ్బంది ఏంటి' అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా అభిప్రాయాన్ని అడిగితే ఇది సమాధానం చెబుతానని ఆమె మొండికేశారు. సీఎం అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను వాడగా అభ్యంతరం లేనిది.. తన వరకూ వచ్చేసరికి ఏమిటిని ప్రశ్నించారు.
దీనిపై మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. ' ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నియమాలు కూడా ఉంటాయ్' అని స్పష్టం చేశారు. తాజా ప్రభుత్వ నియమావళిలో మేయర్ వాహనంపై రెడ్ బీకాన్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని మాజీ మేయర్ సునీల్ ప్రభూ కూడా ఖండించారు. మేయర్ తన అధికారి కారుపై ఎర్రబుగ్గను వాడటం ఒక సాంప్రదాయంగా వస్తుందని అభిప్రాయపడ్డారు.