చైనాలో దోమల ఫ్యాక్టరీ!
బీజింగ్: డెంగీ వ్యాధిపై పోరు కోసం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దోమల ఫ్యాక్టరీని ప్రారంభించింది! దక్షిణ చైనా రాష్ట్రం గ్వాంరలో గల షాజీ ఐల్యాండ్‌లో ఏర్పాటు చేసిన సైన్స్ సిటీ ఫ్యాక్టరీ నుంచి ప్రతివారం స్టెరిలైజ్ చేసిన పది లక్షల దోమల్ని బయటికి వదులుతోంది. దీనివల్ల వ్యాధికారక దోమల జనాభా తగ్గించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. స్టెరిలైజ్ చేసిన దోమలు సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు. అలాగే, ప్రౌఢ దోమలుగా కూడా ఎదగలేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రయోగపూర్వకంగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించామని, దీనివల్ల స్థానికంగా 90 శాతం దోమల జనాభా తగ్గిందని అధికారులు తెలిపారు.
గతేడాది చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ మొత్తంలో ఏకంగా 47 వేల మంది డెంగీ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. సరైన టీకాలు, చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 22 వేల మంది చనిపోతున్నట్లు అంచనా. ఇది సక్సెస్ అయితే గనక.. మలేరియా వంటి ఇతర వ్యాధుల నివారణకోసమూ ప్రత్యేకంగా దోమల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.