డేంజరస్ డెంగీ !
దోమలతోనే వ్యాధి వ్యాప్తి
నేడు జాతీయ డెంగీ దినోత్సవం
దోమతెరలపై అవగాహన అవసరం
ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలి
డెంగీ వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతుంది. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండ టం, పారిశుద్ధ్య సమస్యలు లోపించడం వల్ల వాటిలో దోమ లు స్థావరాలను ఏర్పరచుకుంటాయి. ఇవి కుట్టడం వల్ల వ్యాధి వస్తుంది. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
- అర్వపల్లి
వ్యాధి వ్యాపించే విధానం..
ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బో వైరస్ వల్ల సంక్రమిస్తుంది
ఒకరి నుంచి మరొకరికి ఏడీస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది
ఈ దోమలు పగలేకుడుతాయి.
ఈ రకమైన దోమలు ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి.
ఈ దోమలు గుడ్లు పెట్టి పెరుగుటకు కింద తెలిపిన వస్తువులు, పరిసరాలు అనుకూలమైనవి. ఎయిర్‌కూలర్స్, రిఫ్రిజిరేటర్లు, పూలకుండీలు, బయట పడేసిన టైర్లు, నీరు నిల్వ ఉన్న తొట్లు, కుండీలు, ఖాళీ డ్రమ్ములు, భవనాలపై నిలిచిన వాన నీటిలో పనికిరాని, పగిలిన వస్తువుల్లో ఉంటాయి.
దోమల నివాసాలను తొలగించుట..
నీటినిల్వను, పనికి రాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు, పనికి రాని వాటిని ఇళ్లు, వెలుపల నీటి నిల్వలను పారబోయూలి. నీటి ట్యాంకులకు మూతలు ఉంచాలి. నీటి నిల్వ గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేస్తూ వారంలో ఒక రోజు డ్రైడే(పొడిదినం) విధానం పాటించాలి.
వ్యక్తిగత జాగ్రత్తలు..
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమకాటు నుంచి విముక్తి పొందవచ్చు. శరీరమంతా రక్షణ కలిగే విధంగా దుస్తులు ధరించాలి. ముఖ్యంగా పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయాలి.
చికిత్స..
ఈ వ్యాధికి సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబ్లీఫాం, అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు. డెంగ్యూ వస్తే రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయని భయపడుతూ ఎంతో మంది రక్తనిధులకు పరుగులు తీస్తారు. ఈ ప్లేట్‌లెట్ల గురించి అ వగాహన పెంచుకోవాలి. రక్తంలో తెల్లరక్తకణాలు, ఎర్రరక్త కణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావడానికి దారితీస్తుంది.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి. పనికిరాని, వాడుకలో లేని వస్తువులను తొలగించి వేయాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తొట్లపై మూతలు పెట్టాలి. ప్రతి శుక్రవారం పొడి దినంగా పాటించాలి. సమాజ పరంగా గ్రామాల్లో వీధులు, మురుగు కాల్వల్లో చెత్తా చెదారం తొలగించాలి. వర్షాలకు ముందు తర్వాత మురికి కాలువల్లో పూడికతీత చేపట్టి, నీరు పారేటట్లు చూడాలి. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో డెంగ్యూపై అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రబలంగానే ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి వారి సూచనలు, సలహాలు పాటించాలి.
- ఓం ప్రకాష్, జిల్లా మలేరియా అధికారి