డెంగీ హైరిస్క్ జిల్లాగా నిజామాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతోనే జిల్లాలో కేసుల నమోదుకు కారణమవుతోంది.జిల్లా కేంద్రంలోనే డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జూన్ నుంచి డిసెంబ ర్ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే అవగాహన కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. మరోవైపు డెంగీ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ కొనసాగుతోంది. వ్యాధి నిర్ధారణకే రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డెంగీ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంది. ఇక్కడ నిర్ధారణ అయితేనే డెంగీ సోకినట్లు అధికారులు గుర్తిస్తారు.
నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో డెంగీ కేసులు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. డెంగీ హైరిస్క్ జిల్లాల్లో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం జరగనుంది. జిల్లాలో ప్రతియేటా డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. క్షే త్రస్థాయిలో వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు అమలు కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
2017 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 212 కేసులు నమోదు అయితే జిల్లా కేంద్రంలోనే 122 కేసులు నమోదు అయ్యాయి. 2018లో 156 కేసులు నమోదు అయితే జిల్లా కేంద్రంలో 17 కేసులు నమోదు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని మాలపల్లి, అర్సపల్లి, వినాయక్‌నగర్, అంబేడ్కర్‌కాలనీ, అబీబ్‌నగర్, మహాలక్ష్మీనగర్, గౌతంనగర్, నాగారం, నిజాంకాలనీ, సంజీవయ్యకాలనీ, ఎల్లమ్మగుట్ట, డ్రైవర్స్‌కాలనీ ప్రాంతాల్లో ఎక్కువగా డెండీ కేసులు నమోదు అవుతున్నాయి.
2017లో వినాయక్‌నగర్‌లో 2,789 మంది జనాభా ఉండగా 13 కేసులు అత్యధికంగా ఇక్కడే నమోదు అయ్యాయి. డిచ్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 24 కేసులు నమోదు అయ్యాయి. బోధన్ ప్రాంతంలో అత్యధికంగా 29 కేసులు నమోదు అయ్యాయి. ఆర్మూర్ ఆరోగ్యకేంద్రం పరిధిలో 16 కేసులు నమోదు అయ్యాయి.
ఒక్కో కేసుకు రూ. 400 ఖర్చు
డెంగీ కేసు నమోదు కాగానే ఒక్కో కేసుకు రూ. 400 ఖర్చు చేస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ అందుబాటులో స్ప్రేమందు లేకుంటే కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక్కో కేసుకు 500 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇదివరకు లక్షలాదిరూపాయలు ఖర్చు చేశారు. అయిన వ్యాధుల నియంత్రణ జరగడం లేదు.
అటకెక్కిన అవగాహన....
ఈ వ్యాధుల నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. సీజనల్ వ్యా ధులు జూన్ నుంచి డిసెంబర్ వరకు వ్యాపిస్తాయి. ఈ కాలంలోనే వ్యాధుల నమోదు అధికంగా ఉం టుంది. ముందస్తు చర్యలు చేపట్టి జాగ్రత్తలు తీ సుకోవాలి. కళాజాత బృందాలచేత గ్రామాల్లో ప్ర చారం చేపట్టాలి. కరపత్రాల పంపిణీ, ఆరోగ్య కేం ద్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇటీవల మలేరియా శాఖ ఆధ్వర్యంలో వ్యాధుల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నిర్వహించారు. వాస్తవానికి గ్రామాల్లో నిర్వహిస్తే ఎంతో ప్రయోజనం చేకూరేది. పాఠశాలల్లో నిర్వహిస్తే నివారణ కార్యక్రమాలు విద్యార్థులు ఎలా చేపడుతారని విమర్శలు వచ్చాయి.
ప్రైవేట్‌లో దోపిడీ..
మరోవైపు డెంగీ వ్యాధి నిర్ధారణపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ కొనసాగుతుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో ఆస్పత్రికి రాగానే రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. డెంగీ వ్యాధి నిర్ధారణ పేరిట రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపై 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వెరసి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బాధితులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. వాస్తవానికి డెంగీ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంది. ఇక్కడ నిర్ధారణ అయితేనే డెంగీ సోకినట్లు అధికారులు గుర్తిస్తారు.
అనంతరం వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందించి రోగి నివాస ప్రాంతంలో నివారణ చర్యలు చేపడుతారు. కాని ఇదీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. డెంగీ వ్యాధి నమోదు అయితే సమాచారం అందించాలని మలేరియా శాఖ ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కేవలం రెండు ఆస్పత్రులు 2 కేసులు నమోదు అయినట్లు సమాచారం ఇచ్చాయి. మిగతా ఆస్పత్రులు స్పందించలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపడితే తప్ప రోగుల నిలువుదోపిడీ, వ్యాధి నివారణ జరగదని పలువురు పేర్కొంటున్నారు.
అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి....
అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే నివారణ చర్యలు చేపడుతాం. వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వైద్యశాఖ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. –డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి
నియంత్రణే మేలు...
డెంగీ నియంత్రణ ఎంతో మేలు. వ్యాధి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఇంటిపరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – డాక్టర్ జలగం తిరుపతిరావు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment