వర్షాకాలంలో  పసిపాపకు  అన్ని జాగ్రత్తలు చెప్పారు... ఎందుకు? | Family health counciling | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో  పసిపాపకు  అన్ని జాగ్రత్తలు చెప్పారు... ఎందుకు?

Published Mon, Jun 25 2018 1:07 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

Family health counciling - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌
మా పాప వయసు రెండు నెలలు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రవసం తర్వాత మా ఊరికి వచ్చేశాం. ‘వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువ. జాగ్రత్తగా ఉండండి’ అంటూ అక్కడి పెద్ద డాక్టర్లు చాలా జాగ్రత్తలు చెప్పారు. వాళ్లు అంతగా చెప్పడానికి కారణమేమిటి? – మల్లయ్య, ముస్త్యాల (వరంగల్‌ జిల్లా) 
వర్షాకాలంలో అనేక వ్యాధులు విజృంభిస్తాయి. నీళ్లు కలుషితం కావడం వల్ల  డయేరియా, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ఈ సీజన్‌లో మంచినీళ్ల పైపుల పక్కనే ఉండే మురుగునీళ్ల వ్యవస్థలోని కలుషిత జలాలు, మంచినీటితో కలిసిపోవడం జరగవచ్చు. లేదా వరదనీటితో పొంగిపోయే డ్రైనేజీలు మంచినీటి వనరులను కలుషితం చేయవచ్చు. ఇలా నీటికాలుష్యం వల్ల నీళ్లవిరేచనాలు, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు వస్తాయి.  ఇక మరోవైపు ఈ సీజన్‌లో నీళ్లు నిలిచిపోవడం వల్ల దోమలు పెరుగుతాయి. దోమల సంతతి పెరగడానికి వర్షాకాలం చాలా అనువుగా ఉండటం వల్ల వాటి ద్వారా వాపించే వ్యాధులు ఎక్కువవుతాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, చికన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువ. ఇక ఈ సీజన్‌లో  తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఎండ తక్కువగా ఉండటం వల్ల... ఈ వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌లు పెరగడానికి చాలా అనుకూలం.

దాంతో ఈ అనువైన పరిస్థితుల కారణంగా అటు కలుషిత జలాలు, ఇటు దోమలు, మరో పక్క బ్యాక్టీరియా–వైరసులు పెచ్చరిల్లడం వల్ల వాటి కారణంగా వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. పసిపిల్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారు ఈ వ్యాధులబారిన తేలిగ్గా పడుతుంటారు. చాలామంది పిల్లలు ఈ సీజన్‌లోజలుబు, శ్వాససంబంధమైన వ్యాధులతో సతమతమవుతుంటారు. అందువల్ల మీ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు చెప్పిన విధంగా పాప ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి పరిసరాల్లో నీరు మడుగు కట్టకుండా జాగ్రత్త పడాలి. పరిసరాల్లో పూలకుండీలు, కొబ్బరిచిప్పలు వంటి వాటిల్లోనూ నీరు చేరి, అక్కడ దోమలు తమ సంతతిని వృద్ధి చేసుకోకుండా చూసుకోవాలి. ఇంట్లో అందరూ కాచిచల్లార్చిన నీటిని వాడటం చాలా మంచిది. ఇలాంటి జాగ్రత్తల ద్వారా వానాకాలపు వ్యాధులనుంచి మీ పసిపాపనే గాక... మిమ్మల్ని మీరూ రక్షించుకోవచ్చు. 

పిల్లల్లో డెంగ్యూను గుర్తించడం  ఎలా? 
మా బాబు వయసు 11 నెలలు. వర్షాకాలంలో డెంగ్యూవ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని విన్నాను. ఇంట్లో పసిపిల్లాడు ఉండటం వల్ల చాలా ఆందోళన పడుతున్నాము. ఆ వ్యాధిని ఎలా గుర్తించాలి? అది ప్రమాదకరస్థాయికి చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దయచేసి వివరంగా తెలపండి.  – సి. యాదగిరి, మునుగోడు (నల్లగొండ జిల్లా) 
డెంగ్యూ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా వచ్చే ఇతర వైరల్‌ జ్వరాలలాగే ఉంటాయి. అయితే జ్వరం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఈ జ్వరంతో వణుకుతారు. మందులు వాడటం వల్ల తీవ్రత తాత్కాలికంగా తగ్గుతుంది. ఎముకలు, కీళ్లు, కళ్లు నొప్పిగా ఉంటాయి. కళ్లు, ముఖం ఎర్రబారుతాయి. ఒంటిపైన అంతటా దద్దుర్లు కనిపిస్తాయి. ఆయాసంగా ఉండటం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదురుతుంది. అప్పుడు తీవ్రమైన పొట్టనొప్పి, మూత్రం తగ్గిపోవడం, వాంతులు, మలంలో రక్తం పడటం, శరీర భాగాల్లోకి నీరు చేరడం, విపరీతమైన నిస్సత్తువ కనిపిస్తాయి. పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపించనప్పుడు ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యనిపుణుడికి చూపించి, వ్యాధి డెంగ్యూ అవునో కాదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకోసం రక్తపరీక్షలు చేయించినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోవడం, ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోతుండటం కనిపిస్తాయి.  బిడ్డకు సోకింది డెంగ్యూ అని నిర్ధారణ అయితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలా, లేక ఇంటి వద్దనే ఉంచి చికిత్స చేయగలమా అని పిల్లల వైద్యుడు నిర్ణయిస్తాడు. బిడ్డ చురుకుగా ఉండి, మామూలుగానే తింటూ ఉంటే, డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ, వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ ఇంటివద్దనే ఉంచి, పిల్లల వైద్యనిపుణుడి పర్యవేక్షణలో చికిత్స చేయించడం సాధ్యమవుతుంది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి, బిడ్డ మందకొడిగా ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేర్చుకొని, వైద్యుల నిరంతర పర్యవేణలో చికిత్స అందించాల్సి ఉంటుంది.

ప్రతివర్షాకాలంలోనూపాపకు నలత...  పరిష్కారం చెప్పండి 
మా పాప వయసు మూడేళ్లు, ప్రతివర్షాకాలంలోనూ అనారోగ్యానికి గురవుతూ వస్తోంది. కొన్నిసార్లు తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తోంది. వర్షాకాలం వ్యాధుల నుంచి పాపను రక్షించుకోవడం ఎలా? దయచేసి వివరంగా చెప్పండి.  – కె. ప్రమీల, మహబూబ్‌నగర్‌ 
చికిత్స కంటే నివారణ మేలు అన్న సూక్తి పిల్లలతో పాటు అందరికీ వర్తిస్తుంది. అయితే పిల్లల విషయంలో మరీ ముఖ్యం. ఎందుకంటే పిల్లల్లో కొద్దిపాటి నలత కనిపించిన ఇంటిల్లిపాదీ చాలా ఆందోళనకు, మనోవేదనకు గురవుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేదనకు గురికాకుండా ఉండటం సాధ్యమవుతుంది. అందుకోసం ఈ సాధారణ సూచనలు పాటించండి. 
∙మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోండి ∙లోతట్టు ప్రాంతాల్లో, ఖాళీ స్థలాల్లో వాననీరు నిలిపోకుండా చూసుకోండి ∙మీరు నీటిని నిల్వ ఉంచే పాత్రలు, ట్యాంకులు, డ్రమ్ములపై మూతపెట్టి ఉంచండి. 

∙మీ ఇంట్లోని పిల్లలను ఎప్పుడూ దోమతెరలో పడుకోబెడుతుండండి ∙పిల్లల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలనే ధరింపజేయండి ∙అవసరమైతే తాత్కాలికంగా మస్కిటో రిపల్లెంట్‌ క్రీమ్స్‌ వాడవచ్చు ∙బాగా కాచివడబోసిన లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని మాత్రమే తాగడానికి వాడండి. పిల్లలకు ఇలాంటి నీటినే విధిగా ఇవ్వాలి ∙వంటకు వాడే నీరు ఏమాత్రం కలుషితం కాకుండా, పూర్తిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ∙పిల్లలకు బయటనుంచి కొనితెచ్చిన పండ్లరసాలు, ఇతర తినుబండారాలను ఈ సీజన్‌లో అస్సలు ఇవ్వకండి ∙పిల్లల చేతులు (ఆమాటకొస్తే మీ చేతులు కూడా) ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇందుకోసం సబ్బు లేదా లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌తో తరచూ చేతులను శుభ్రం చేస్తుండండి ∙ఇంట్లో పెద్దవారికి జలుబు చేస్తే వారు నోటికి, ముక్కుకు వస్త్రం అడ్డుగా పెట్టుకోవాలి. పొడుగు చేతుల చొక్కలను ధరించాలి. ఎందుకంటే తుమ్మాల్సి వచ్చినప్పుడు మోచేతి మడతలోనే తుమ్మడం వల్ల వ్యాధులను సంక్రమింపజేసే క్రిములు ఇతరులకు... ముఖ్యంగా పసిపిల్లలకూ వ్యాపించకుండా జాగ్రత్తపడటానికి ఇది ఉపకరిస్తుంది ∙పిల్లలను వీలైనంత వరకు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే మార్కెట్లు, సినిమాహాళ్ల వంటి చ్లోకు తీసుకెళ్లవద్దు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో చిన్నారులు ఈ సీజన్‌లో వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.  
డాక్టర్‌ చేతన్‌ ఆర్‌ ముందాడ
సీనియర్‌ పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్, 
యశోద మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఇన్‌స్టిట్యూట్, 
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement