ఆరోగ్యశాఖకు సుస్తి..! | Malaria, typhoid, dengue disease spread in district | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖకు సుస్తి..!

Published Sat, Jul 26 2014 3:08 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Malaria, typhoid, dengue disease spread in district

 జిల్లాలో సీజనల్ విజృంభిస్తున్నాయి. మలేరియా చాపకింద నీరులా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీప్రాంతంలో మలేరియా వ్యాపిస్తుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. మలేరియా పట్ల వారికి అవగాహన కల్పించాల్సిన సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో వ్యాధి నివారణకు మందులు అందుబాటులో ఉండకపోవడంతో మారుమూల గ్రామాల నుంచి ప్రజల పట్టణాలకు వచ్చి డబ్బులు ఖర్చుచేసి వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బం దులు తాళలేక గ్రామాల్లో భూత వైద్యులను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.    

 వచ్చీరానీ వైద్యంతో దోపిడీ...
 జ్వరం తీవ్రత పెరిగినప్పుడు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు స్థానిక ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్‌ఎంపీలు వచ్చీరాని వైద్యం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 ఈ ఏడాది 799 మలేరియా కేసులు...
 జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 799 మలేరి యా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 69 పీహెచ్‌సీలు ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 20పీహెచ్‌సీల పరిధిలో మూడోం తుల మలేరియా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవి కేవలం అధికారిక లెక్కలే. కానీ నమో దు కాని కేసులను బట్టిచూస్తే జిల్లాలో మలేరియా బాధితులు ఎక్కువే ఉండవచ్చు.  

 పొంచిఉన్న డెంగీ...
 మరోపక్క జిల్లాలో డెంగీ వ్యాధి కూడా పొంచి ఉంది. జిల్లాలో గత ఏడాది 57 మందికి డెంగీ వ్యాధి సోకగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. అవి కూడా ఏజెన్సీలోని గుండాల, అశ్వాపురం ప్రాంతాల్లో నమోదు కావడం గమనార్హం.  

 మలేరియా సోకే విధానం..
 మలేరియా వ్యాధి ఆడ ఎనాఫలిస్ దోమ కాటు వల్ల వస్తుంది. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన దోమ ఆరోగ్యవంతుడైన మానవుడిని కుట్టినప్పు డు అతనికి మలేరియా సోకుతుంది. మలేరియా కారక సూక్ష్మజీవులు దోమ ఉదయం 10 నుంచి 14 రోజులపాటు వృద్ధి చెందుతాయి. ఈ విధం గా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

 లక్షణాలు...
 మలేరియా వచ్చిన వారికి చలి, వణుకుతో విపరీమైన జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు చలి, పళ్లు కొరకడం జరుగుతుంది. జ్వరం తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమటలు వస్తాయి. జ్వరం ప్రతీ రోజూ కానీ, రోజు విడిచి రోజు లేదా నాలుగు రోజులకు ఒకసారి వస్తోంది. ఈ విధమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే మలేరియా టెస్టు చేయించకోవాలి.

 డెంగీ సోకే విధానం...
 డెంగీ వ్యాధి‘ ఆర్ధ్రెటిస్’ జాతికి చెందిన సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి ఎడిస్ ఈజిప్టు దోమ కారణం. ఈ రకమైన దోమలు డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. డెంగీ పట్ల అశ్రద్ధగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఈ దోమలు పగటి పూట మాత్రమే కుడతాయి. వీటిని టైగర్ దోమలు అని కూడా అంటారు.

 లక్షణాలు...
 డెంగీ సోకిన వారికి ఒక్కసారిగా తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది, కళ్లు తెరవడం కష్టం అవుతుంది. కదిపితే నొప్పి కూడా వస్తుంది. చర్మంపై దద్దుర్లు రావడం, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహంతో పాటు రక్తపోటు పడిపోతుంది.

 మలేరియా, డెంగీ నివారణకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
 జనావాసాల్లో పారవేసిన కొబ్బరిబోండాలు, పాత టైర్లు, కుండలు, వాటర్ బాటిల్, పగిలిన సిమెంట్ డ్రమ్ములు, వాడని రోళ్ళు, ఖాళీ డబ్బాలు లేకుండా చూసుకోవాలి.

 వారానికి ఒకసారి నీరు నిల్వ ఉండే కుండలు, సిమెంట్ డ్రమ్ములు, ట్యాంకులు, కూలర్లు శుభ్రం చేసుకోవాలి. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

 నీరు నిల్వ ఉంచే పాత్రలు, నీటి తొట్లు, డ్రమ్ములు, నీటి ట్యాంకులపై మూతలు ఉండేలా చూసుకోవాలి.

 కిటీకీలకు మెష్‌లు ఏర్పాటు చేయడంతో పాటు దోమ తెరలను వినియోగించాలి. నిండుగా దుస్తులు ధరించాలి.

 దోమల నివారణకు కాయిల్స్, లిక్విడ్స్ ఓడోమాస్ లాంటివి వాడాలి. ఇంట్లో వేపాకు పొగ కూడా వేసుకోవచ్చు.

 దోమలు కుట్టకుండా వీలైనంత వరకు పగటిపూట పొడుగు చేతుల చొక్కా, పైజమా, ప్యాంటు, పంచె, కాళ్ళకు సాక్సులు వేసుకోవాలి.

 జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు పారాసిటమాల్ మాత్రలు వాడాలి. అలాగే దగ్గరలోని ఏరియా ఆస్పత్రి, పీహెచ్‌సీ, ఆరోగ్య కార్యకర్తను కానీ సంప్రదించాలి.

 మలేరియా నివారణకు చర్యలు  తీసుకుంటున్నాం :  జిల్లా మలేరియా అధికారి రాంబాబు
 జిల్లాలో మలేరియా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మలేరియా ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతంలోని 20 పీహెచ్‌సీల పరిధిలో విస్తరించింది. ఈ పీహెచ్‌సీల పరిధిలో క్యాంప్‌లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ డయాగ్‌స్టిక్ కిట్‌లను సిద్ధంగా ఉంచాం. దీని ద్వారా పది నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ అవుతుంది. అశా వర్కర్లు, పీహెచ్‌సీల్లో ఈ కిట్లు అందుబాటులో ఉంచాం. 104లో కూడా ఆర్‌డీసీ కిట్లను ఉంచాం.

 ఏసీటీ కిట్లను కూడా సిద్ధంగా ఉంచాం. మలేరియా, డెంగీ నివారణకు అగస్టు మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా 155 క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. గంబూషియా చేపలను అన్ని ప్రాంతాల్లోని కాల్వలు, నీటి గుంతల్లో వదిలేందుకు చర్యలు చేపట్టాం. మలేరియా, డెంగీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ జ్వరం వచ్చినా ఎలక్ట్రాల్, ఓఆర్‌ఎస్ పౌడర్‌లు నీటిలో వేసుకొని తాగాలి. అలా చేయటం వల్ల ప్లేట్‌లెట్‌లు పడిపోకుండా ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement