కాటేస్తున్న దోమ
మన్యంలో ప్రబలుతున్న మలేరియా
మంచానపడి ఆదివాసీలు విలవిల
ముంచంగిపుట్టు మండలంలో 20 మంది మృతి: గిరిజన సంఘం
మన్యంలో మలేరియా కసిగా కోరలు చాస్తోంది. వందలాది మంది మంచాన పడి అల్లాడిపోతున్నారు. గతేడాది గుర్తించిన కేసులను తలదన్నేలా ఈ ఏడాది మలేరియా పాజిటివ్ కేసుల నమోదుతో ఆదివాసీలు సతమతమవుతున్నారు. ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఈ మహమ్మారి ప్రబలకుండా చేయడంలో ప్రభుత్వశాఖలు విఫలమవుతున్నాయి. ఇతర కారణాల వల్లే చనిపోతున్నారంటూ పీహెచ్‌సీ అధికారుల నివేదికలతో పరిస్థితి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి వెళ్లడం లేదు.
పాడేరు: మన్యాన్ని రోగాలు చుట్టేస్తున్నాయి. ముఖ్యం గా మలేరియా విజృంభిస్తోంది. ఎపిడమిక్‌కు వర్షాలు తోడవ్వడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీకి చెందిన మూడేళ్ల చిన్నారి సునంద సెరిబ్రల్ మలేరియాతో చనిపోయింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం, బాబుసాల, బుంగాపుట్టు, బరడ పంచాయతీల్లో మూడు నెలల్లో 20 మంది చనిపోయినట్టు తమ పరిశీలనలో వెల్లడయిందని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్శ తెలిపారు. ఏజెన్సీలో ఈ పరిస్థితి దృష్ట్యా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఆల్ఫా సైఫామిథ్రిన్ (ఏసీఎం 5%), యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్న మలేరియా నియంత్రణ సాధ్యపడటం లేదు. ఇప్పటికే ఏజెన్సీలో మలేరియా పాజిటివ్ కేసులు 6 వేలకు పైగా నమోదయ్యాయి. మారుమూలగూడేల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
పరిస్థితి అదుపుతప్పు తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది దానిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం లేదు. గిరిజనుల జీవన పరిస్థితులు కూడా మలేరియా విజృంభించడానికి ఊతమిస్తున్నాయి. ఇళ్లల్లో ఏసీఎం స్ప్రేయింగ్‌కు నిరాకరిస్తుండటంతోపాటు కొండవాగుల నుంచి సేకరించి తెచ్చిన నీటిని నిల్వ ఉంచుకోవడం, పశువులశాలలను గృహ ఆవరణలోనే ఉంచడం, పౌష్టికాహారం కొరత వంటివాటితో గిరిజనులు మలేరియాకు గురై చనిపోతున్నారు. వ్యాధి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రామాల్లో ఇందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మలేరియా జ్వరాల నిర్ధారణ కొరవడుతోంది. మరణాలు సంభవించినా తెలియని దుస్థితి.
డాట్ ప్రోగ్రాం అమలు చేయాలి
మలేరియా నియంత్రణకు ‘డాట్’ (డెరైక్ట్ ఆబ్జర్వేషన్ ట్రీట్‌మెంట్) పటిష్టంగా అమలు చేయాలి. దీనిని మలేరియాశాఖలో కొన్నేళ్ల క్రితం నిర్వహించే వారు. ఏజెన్సీలో ఇది కొరవడింది. జ్వర పీడితులు రెండు మూడు రోజుల్లో అపస్మారక స్థితిలో వెళ్లే పరిస్థితి ఉంటే అనుమానం లేకుండా సెరిబ్రెల్ మలేరియాగా గుర్తించ వచ్చు. మెడికేటెడ్ దోమ తెరలు కచ్చితంగా ప్రతి గిరిజన కుటుంబానికి పంపిణీ చేయాలి.
- పి.రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో, విశాఖపట్నం.