ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విషజ్వరాలు, మలేరియా, అతిసార, చికున్‌గున్యా, డెంగీ, కంఠసర్పి, మెదడువాపు.. ఇలా ఒకదాన్ని మించింది మరొకటి ఈ సీజన్‌లో అన్ని రకాల వ్యాధులు ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే కంఠసర్పి రెండు ప్రాణాలను బలిగొంది. డెంగీ అనుమానిత మరణం చోటు చేసుకొంది. తాజాగా ఒంగోలుకు సమీపంలోని గుడిమెళ్లపాడులో ఆయేషా అనే మూడేళ్ల బాలిక మెదడువాపు బారిన పడింది. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం గుంటూరు తరలించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ లెక్కలకు, క్షేత్ర స్థాయిలో వాటి బారిన పడుతున్న వారి సంఖ్యకు పొంతన ఉండటం లేదు.
డెంగీ..నో ప్లేట్‌లెట్స్
కొన్నేళ్ల నుంచి జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీని బారినపడి మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా కీలకమైన ప్లేట్‌లెట్స్ మిషన్ ఏర్పాటు చేయడంలో జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవువనా ఎక్కడో ఒకచోట డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ బారిన పడినవారికి ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. సకాలంలో ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తేనే ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడతాయి. డెంగీ లక్షణాలు కనిపించడంతో అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వైద్యులు డెంగీ కేసులను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన అప్పటి వైద్య ఆరోగ్యశాఖామంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జిల్లాలో ప్లేట్‌లెట్స్ మిషన్ లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి మానుగుంట మహీధరరెడ్డి కూడా ప్లేట్‌లెట్స్ మిషన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీలు అమలుకు నోచుకోలేదు.
కంఠసర్పి... రిపోర్టు లేట్
నెలరోజుల నుంచి కంఠసర్పి కేసులు అటు ప్రజలను, ఇటు వైద్య ఆరోగ్యశాఖను కలవరపెడుతున్నాయి. పుల్లలచెరువు మండలంలో అనుమానాస్పద కంఠసర్పితో మొదలైన కేసులు ఒకటొకటిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు పిల్లలను కంఠసర్పి బలిగొంది. మరికొన్ని అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. వాటిని సకాలంలో గుర్తించకపోవడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. కంఠసర్పి లక్షణాలు కూడా సాధారణ జ్వరంతో కూడిన లక్షణాలు కావడంతో వాటిని సకాలంలో గుర్తించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా కంఠసర్పి లక్షణాలు కనిపించిన వెంటనే శ్వాబ్(లాలాజలం) శాంపిల్స్ తీసి మైక్రోబయాలజీ విభాగానికి పంపించాల్సి ఉంటుంది. అయితే శ్వాబ్‌కు సంబంధించిన రిపోర్టులు కూడా సకాలంలో రాకపోవడంతో కేసులను వెంటనే గుర్తించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చికున్ గునియా బారినపడేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి వస్తుండటంతో అనేక మంది మంచాలకే పరిమిత మయ్యారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. దోమకాటువల్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. చీమకుర్తి వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మలేరియా ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో విజృంభిస్తోంది.
ప్రజారోగ్యంపై ‘సమ్మె’ట పోటు:
ప్రజారోగ్యంపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన సిబ్బంది మొత్తం సమ్మె బాట పట్టారు. గతంలో క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా ఇద్దరు లేదా ముగ్గురికి జ్వరాలు వచ్చినా వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ రెగ్యులర్ ఏఎన్‌ఎంలు హెల్త్ సూపర్‌వైజర్లు, హెచ్‌ఈఓలు సమ్మెలో ఉండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో వ్యాధులు వచ్చినప్పుడు కాలనీలు, గ్రామాలు మొత్తం వైద్య సిబ్బంది జల్లెడ పట్టేవారు. ప్రస్తుతం కాంట్రాక్టు సిబ్బంది మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.