cikun gunya
-
దోమల ఫ్యాక్టరీ
హైదరాబాద్: దోమల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. దోమలద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా మొదలుకొని రకరకాల వ్యాధులు. వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నివారణకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటికితోడు చైనాలో ఓ బృందం ఒక వినూత్నమైన ఆలోచనతో దోమల భరతం పడతామంటోంది. ఇందుకోసం ఓ ఫ్యాక్టరీ నెలకొల్పి ప్రతి వారం రెండు కోట్ల దోమల్ని బయటకు వదులుతామంటోంది. ఉన్న దోమలకు తోడు ఈ కొత్త దోమలెందుకబ్బా? అనేగా మీ సందేహం. చైనాలోని సన్ యాట్సెన్ వర్సిటీ శాస్త్రవేత్త జియాంగ్ జీ, మిషిగన్ స్టేట్ వర్సిటీలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో మగ దోమలను మాత్రమే అభివృద్ధి చేస్తారు. మగవి మనల్ని కుట్టవు... వ్యాధులను వ్యాప్తిచెందించవు. ఈ మగదోమల్లో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మగదోమలు మామూలు ఆడదోమలతో కలిస్తే పుట్టే సంతానం మొత్తానికి వంధ్యత్వం (పిల్లలు పుట్టకపోవడం) వస్తుంది. అవి మళ్లీ సంతానోత్పత్తి చేయలేవు. దీంతో కొన్ని తరాలు గడిస్తే దోమలన్నవి లేకుండా పోతాయి. గత ఏడాది గాంగ్జూలోని ఓ దీవిలో ఈ కొత్త దోమలను ప్రయోగాత్మకంగా వదిలి చూశారు. కొద్దికాలంలోనే దోమల సంఖ్య సగానికి తగ్గిందట. -
రాష్ట్రానికి జ్వరమొచ్చింది!
♦ ఈ ఏడాది ఐదు లక్షల మంది జ్వర బాధితులు ♦ 10 వేల వరకు మలేరియా కేసులు నమోదు ♦ పంజా విసురుతున్న డెంగీ, చికున్‌గున్యా ♦ ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీల గజగజ ♦ హైదరాబాద్‌లోనూ భారీ సంఖ్యలో బాధితులు ♦ కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ♦ జ్వరాలతో వస్తున్న వారికి ప్లేట్లెట్లు ఎక్కిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ♦ దోమ తెరల పంపిణీలో సర్కారు విఫలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనం జ్వరాలతో మంచం పడుతున్నారు.. మలేరియా, డెంగీ, చికున్‌గున్యాల పంజాలో చిక్కి విలవిల్లాడుతున్నారు.. ఎక్కడిక్కడ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరాల బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి.. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి సాధారణ జ్వరాలు సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అందులో 10 వేల మందికిపైగా మలేరియా బారినపడ్డారు. కేవలం గత నెలలోనే 4,822 మందికి మలేరియా సోకింది. ఇక డెంగీ, చికున్‌గున్యాలతో వందలాది మంది బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కించింది. పట్టణాలు, పల్లెల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం, దోమల స్వైర విహారంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. హైదరాబాద్ నగరంతోపాటు ఆదిలాబాద్ గిరిజన పల్లెల వరకూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువగా ఫాల్సిఫారం మలేరియా కేసులు ఉన్నాయి. వైవాక్స్ తరహా మలేరియాతో పోలిస్తే ఇది మరింత ప్రమాదకారి అని వైద్యులు చెబుతున్నారు. ఖమ్మం, వరంగల్ ఏజెన్సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. భారీ సంఖ్యలో.. ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో లక్ష మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. ఇందులో ఎక్కువగా జూన్, జూలై నెలల్లోనే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో 80 వేల మందికిపైగా జ్వరాల బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మలేరియా పీడిత గ్రామాలు సుమారు 2,000 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 870, వరంగల్‌లో 110, మహబూబ్‌నగర్‌లో 20 గ్రామాలున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా విష జ్వరాలు ఏజెన్సీ గ్రామాలను వణికిస్తున్నాయి. జ్వరాలతో వచ్చే బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. సాధారణ చికిత్సతో తగ్గే అవకాశమున్నా ప్లేట్లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. వాటి సంఖ్య 10 వేల కంటే తగ్గితేనే ఎక్కించాలి. కానీ 20 నుంచి 50 వేల వరకు ఉన్న వారికి కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. వేలకువేలు వసూలు చేస్తున్నారు. దోమ తెరల పంపిణీ గాలికి.. మలేరియా అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వం దోమ తెరలను పంపిణీ చేయాలి. వీటిని ప్రత్యేకమైన దోమల నివారణ మందులో ముంచి తయారుచేస్తారు. తద్వారా మలేరియా వ్యాప్తిని అరికట్టవచ్చు. కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంకు నిధులతో వీటిని కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. ఒకసారి పంపిణీ చేసిన తెరలు రెండేళ్ల వరకు పనిచేస్తాయి. చివరిసారిగా 2012లో దోమ తెరలను పంపిణీ చేశారు. దీంతో రెండేళ్ల పాటు మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో 2,927... 2013లో 3,442 మలేరియా కేసులు నమోదుకాగా... గతేడాది 5,222 కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 10 వేల కేసులు నమోదయ్యాయి. దోమ తెరలను పంపిణీ చేయకపోవడం వల్ల మలేరియా కేసులు పెరిగాయని వైద్యాధికారులు కూడా చెబుతున్నారు. దోమతెరల కోసం గత ఏడాది డిసెంబర్లోనే కేంద్రానికి ఇండెంట్ పెట్టామని... వారు ఇంకా సరఫరా చేయలేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మాత్రం మలేరియాతో పాటు విషజ్వరాల బారినపడుతున్నారు. -
విషజ్వరాల విజృంభణ
5,563 మందికి మలేరియా 93 డెంగ్యూ కేసులు నమోదు 40 మందికి చికున్‌గున్యా రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు నర్సీపట్నంటౌన్/బుచ్చెయ్యపేట : వాతావరణంలో మార్పులు, అడపాదడపా వర్షాలతో జిల్లాకు జబ్బు చేసింది. ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా విజృంభిస్తున్నాయి. ఏజెన్సీవాసులు మలేరియాతో విలవిల్లాడుతుండగా మైదానం వాసులు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. వందలాది మంది మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నారు. జిల్లాలో 49,26,800 మంది జ్వరపీడితులకు రక్త పరీక్షలు చేయగా 5,563 మందికి మలేరియా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 93 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 40 మంది చికున్‌గున్యాతో బాధపడుతున్నారు. ఇవన్నీ జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వర్షాలకు గుంటల్లో నీరు చేరి దోమల ఉధృతి పెరిగింది. వాటి రొదతో గ్రామీణులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. పరోక్షంగా వ్యాధులకు గురవుతున్నారు. బుచ్చెయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లోని వారు విషజ్వరాలతో విలవిల్లాడుతున్నారు. పెదమదీన, చినఅప్పనపాలెం, తురకలపూడి, రాజాం, చినమదీన, తైపురం, తదితర గ్రామాల్లో 150 మంది మంచానపడ్డారు. కీళ్లు, ఒళ్లునొప్పులు, తీవ్ర జ్వరం, వాంతులు, విరోచనాలతో నడవలేని స్థితిలో అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నా ఒక పట్టాన నయం కావడం లేదు. రాజాంలో నానిపల్లి ప్రశాంతి, మంత్రి లక్ష్మి, కంఠంరెడ్డి సతీష్, మువ్వల నాయుడు, తురకలపూడిలో కోరుకొండ రాములమ్మ, మంత్రి రామయ్యమ్మ, అలివెల సంతోషి, గంగాభవాని విష జ్వరాలు, వాంతులతో బాధపడుతున్నారు. బుధవారం తురకలపూడి పీహెచ్‌సీకి 150 మందికి పైగా వచ్చి సేవలు పొందారు. వడ్డాది పీహెచ్‌సీకి రోజుకు వందమంది వస్తున్నారు. వడ్డాది, చోడవరం, అనకాపల్లి, రావికమతంల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు రోజూ వందలాది మంది వెళుతున్నారు. చినమదీనలో వైద్య సిబ్బంది బుధవారం శిబిరం నిర్వహించి సేవలు అందించారు. 20మంది నుంచి రక్తపూతలు సేకరించారు. 50 మందికి మందులు పంపిణీ చేశారు. లోపూడి, చినఅప్పనపాలెంల్లో సుమారు 150మందికి 104 సిబ్బంది సేవలు అందించారు. చురుగ్గా రెండో విడత స్ప్రేయింగ్ నాతవరం : జిల్లాలో రెండవ విడత మలేరియా నివారణకు స్పేయింగ్ చురుగ్గా సాగుతోందని జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు చెప్పారు. నర్సీపట్నం, నాతవరం మండలం మర్రిపాలెం, మాసంపల్లిల్లో డెంగ్యూ బాధితులను పరిశీలించారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. అంతకు ముందు వైద్యాధికారి, సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మలేరియా నియంత్రణకు మొడటి విడతగా 3500 గ్రామల్లో ,రెండో విడతగా 1236 గ్రామాల్లో పిచికారీ చేపట్టామన్నారు. వర్షాలు కారణంగా కొంత అటంకం ఏర్పడుతోందన్నారు. ఏజెన్సీలో ఆశ కార్యకర్తలకు మలే రియా కిట్లు ఇచ్చి రక్త పరీక్షలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ముఖ్యంగా దోమకాటు వ్యాధులకు కారణమన్నారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నాతవరంలో కొన్ని ఇళ్లల్లో నీటి నిల్వను, వాటిల్లో దోమలు చేరడాన్ని గమనించారు. ఈ కారణంగానే డెంగ్యూ, చికెన్ గూన్యా జ్వరాలు వ్యాపిస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో నాతవరం వైద్యాధికారి కళ్యాణ చక్రవర్తి, మలేరియా క్లస్టరు అధికారి యాళ్ల కృష్ట ఉన్నారు. -
వ్యాధులతో విలవిల
విశాఖరూరల్: వాతావరణంలో మార్పులతో పరి స్థితి అదుపు తప్పుతోంది. జిల్లా వాసులు వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. విషజ్వరాలు, డెంగ్యూ, చికున్‌గున్యా విజృంభిస్తున్నాయి. మైదా నంలోని వారిని విషజ్వరాలు, చికున్‌గున్యా, డెంగ్యూ పీడిస్తున్నాయి. బుచ్చెయ్యపేట మం డలం మండలం రాజుపాలేనికి చెందిన ఎన్.మరియమ్మ(20),మాడుగుల మండలం జాలంపల్లికి చెందిన జి.వసంతకుమారి(16),రావికమతం మండలం ఎల్.కొత్తూరుకు చెందిన బి. వరలక్ష్మి డెంగ్యూకు గురయ్యారు. బుచ్చెయ్యపేట మండలం పెదమదీనాలో ఎం.మరిడిబాబు(14),ఎం. కనకరాజు, వై.నాగేశ్వరరావు(10),ఎ.అప్పారావు చికున్‌గున్యాతో బాధపడుతున్నారు. ఇవి విశాఖ కేజీహెచ్ వైద్యాధికారులు నిర్ధారించినవే. పాడేరు మండలం మారుమూల జోడుమామిడి గ్రామం లో వారం వ్యవధిలో చిన్నారావు, మంగి అనే ఆదివాసీ యువకులు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. రావికమతం మండలం కన్నంపేటలో మాయదారి జ్వరాలు వారం రోజుల్లో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న విషయం మరువక ముందే ఇదే మండలం గరిణకంలో ఓ యువకుడు డెంగ్యూ లక్షణాలతో ఈ నెల 23న చనిపోయాడు. ఆనందపురం పంచాయతీ పొడుగుపాలేనికి చెందిన బంటుబిల్లి శంకర రావు(29) ఇదే లక్షణాలతో మృతి చెందాడు. హుకుంపేట మండలంలో ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మలేరియాతో చనిపోయిన విషయం తెలిసిందే. చోడవరం మండలం అంకుపాలెం పంచాయతీ గోవిందమ్మ కాలనీలో జ్వరంతో బాధపడుతూ తబ్బి తరుణ్(9) ఈనెల 24న ఉదయం చనిపోయాడు. ఇలా రోజురోజుకు జిల్లాలో ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కశింకోట మండలం నూతన గుంటపాలెంలో 5,రాంబిల్లి మండలం దిమిలిలో 2 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇటీవల 402 మంది అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా 42 మందికి డెంగ్యూ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది పలు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు అదుపులోకి రావడం లేదు. -
వ్యాధుల పంజా
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విషజ్వరాలు, మలేరియా, అతిసార, చికున్‌గున్యా, డెంగీ, కంఠసర్పి, మెదడువాపు.. ఇలా ఒకదాన్ని మించింది మరొకటి ఈ సీజన్లో అన్ని రకాల వ్యాధులు ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే కంఠసర్పి రెండు ప్రాణాలను బలిగొంది. డెంగీ అనుమానిత మరణం చోటు చేసుకొంది. తాజాగా ఒంగోలుకు సమీపంలోని గుడిమెళ్లపాడులో ఆయేషా అనే మూడేళ్ల బాలిక మెదడువాపు బారిన పడింది. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం గుంటూరు తరలించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ లెక్కలకు, క్షేత్ర స్థాయిలో వాటి బారిన పడుతున్న వారి సంఖ్యకు పొంతన ఉండటం లేదు. డెంగీ..నో ప్లేట్లెట్స్ కొన్నేళ్ల నుంచి జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీని బారినపడి మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా కీలకమైన ప్లేట్లెట్స్ మిషన్ ఏర్పాటు చేయడంలో జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవువనా ఎక్కడో ఒకచోట డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ బారిన పడినవారికి ఒక్కసారిగా ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. సకాలంలో ప్లేట్లెట్స్ ఎక్కిస్తేనే ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడతాయి. డెంగీ లక్షణాలు కనిపించడంతో అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వైద్యులు డెంగీ కేసులను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన అప్పటి వైద్య ఆరోగ్యశాఖామంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జిల్లాలో ప్లేట్లెట్స్ మిషన్ లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి మానుగుంట మహీధరరెడ్డి కూడా ప్లేట్లెట్స్ మిషన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. కంఠసర్పి... రిపోర్టు లేట్ నెలరోజుల నుంచి కంఠసర్పి కేసులు అటు ప్రజలను, ఇటు వైద్య ఆరోగ్యశాఖను కలవరపెడుతున్నాయి. పుల్లలచెరువు మండలంలో అనుమానాస్పద కంఠసర్పితో మొదలైన కేసులు ఒకటొకటిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు పిల్లలను కంఠసర్పి బలిగొంది. మరికొన్ని అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. వాటిని సకాలంలో గుర్తించకపోవడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. కంఠసర్పి లక్షణాలు కూడా సాధారణ జ్వరంతో కూడిన లక్షణాలు కావడంతో వాటిని సకాలంలో గుర్తించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా కంఠసర్పి లక్షణాలు కనిపించిన వెంటనే శ్వాబ్(లాలాజలం) శాంపిల్స్ తీసి మైక్రోబయాలజీ విభాగానికి పంపించాల్సి ఉంటుంది. అయితే శ్వాబ్కు సంబంధించిన రిపోర్టులు కూడా సకాలంలో రాకపోవడంతో కేసులను వెంటనే గుర్తించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చికున్ గునియా బారినపడేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి వస్తుండటంతో అనేక మంది మంచాలకే పరిమిత మయ్యారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. దోమకాటువల్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. చీమకుర్తి వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మలేరియా ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో విజృంభిస్తోంది. ప్రజారోగ్యంపై ‘సమ్మె’ట పోటు: ప్రజారోగ్యంపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన సిబ్బంది మొత్తం సమ్మె బాట పట్టారు. గతంలో క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా ఇద్దరు లేదా ముగ్గురికి జ్వరాలు వచ్చినా వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ రెగ్యులర్ ఏఎన్ఎంలు హెల్త్ సూపర్వైజర్లు, హెచ్‌ఈఓలు సమ్మెలో ఉండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో వ్యాధులు వచ్చినప్పుడు కాలనీలు, గ్రామాలు మొత్తం వైద్య సిబ్బంది జల్లెడ పట్టేవారు. ప్రస్తుతం కాంట్రాక్టు సిబ్బంది మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. -
విజృంభిస్తున్న చికున్‌గున్యా
తాడ్వాయి, న్యూస్‌లైన్ : చికున్ గున్యా విజృంభిస్తోంది. దేమికలాన్‌లో 31 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మాత్రం గ్రామాన్ని సందర్శించలేదు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన 12 మంది జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడ్డారు. వారిని కుటుంబ సభ్యులు ఎర్రాపహాడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు చికున్ గున్యా సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వారికి చికిత్స అందించి స్వగ్రామానికి పంపించారు. తాజాగా మరో పందొమ్మిది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. గడ్డ రాజు, దడిగే పోచయ్య, దడిగే భూమవ్వ, లింగవ్వ, చిన్న బాలయ్య, దడిగే గంగాజల, సావిత్రి, పోశవ్వ, నర్సవ్వ, రాజవ్వ, దడిగే ప్రవీణ్, గిద్దె ఆశయ్య, రాపోల్ లక్ష్మి, మెట్టు బాలమణి, ఎర్రోళ్ల నర్సయ్య, ఆశన్నగారి మహీపాల్‌రెడ్డి, బాల సాయిలు, మైశయ్య, మధు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద, డ్రైనేజ్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయిందని, పారిశుధ్య సమస్యను పట్టించుకునేవారు లేరని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. -
ఏజెన్సీలో మరణాలు
సాక్షి, హన్మకొండ : విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, వైరల్ ఫీవర్లతో పల్లెలు మంచం పట్టాయి. వైద్యం కోసం వస్తున్న వారితో ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల కారణంగా మరణాలు సైతం చోటు చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో మంచాలు సరిపోక రోగులను నేలపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా అన్ని పీహెచ్‌సీల్లో ఓపీ పేషెంట్ల సంఖ్య పెరిగింది. అయితే విజృంభిస్తున్న జ్వరాలకు అనుగుణంగా వైద్య శిబిరాల సంఖ్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పెంచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషజ్వరాలకు తోడు.. చికున్‌గున్యా ఏటూరునాగారం మండలం రొయ్యూరు, గంగారం, బుట్టాయిగూడెం గ్రామాలతో పాటు నర్సంపేట మండలం రాజుపల్లి, నెక్కొండ మండలం ఫణికర, నర్మెట మండలం ఆగాపేట ఎస్సీ కాలనీ, రఘునాథపల్లి మండలం ఖిలేషాపురం గ్రామ శివారు దుబ్బతండాలతో పాటు జనగామ మండలం మరిగేడు పంచాయతీ పరిధిలోని తండాల్లో సగానికి పైగా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. విషజ్వరాలకు తోడు చికున్‌గున్యా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. వర్థన్నపేట మండలం కట్య్రాల గ్రామ పరధిలోని కుమ్మరి గూడెంలో చికెన్‌గున్యా లక్షణాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన పదిహేను రోజులుగా ఈ గ్రామంలో జ్వరంతో పాటు కీళ్లు, ఒంటి నొప్పులతో బాధ పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే వైద్యాధికారులు ఈ విషయంపై శ్రద్ధ చూపించకపోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మొక్కుబడిగా ఆరోగ్య శిబిరాలు ఓ వైపు గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో తక్షణం స్పందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ.. మొక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నది. నెల్లికుదరు మండలం నైనాల, నర్సింహులుపేట మండలం మచ్చర్ల గ్రామాల్లో ఇంటికి ఒక్కరిద్దరు వంతున వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది కేవలం ఒకే ఒక్క రోజే హెల్త్‌క్యాంప్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. అరకొర సౌకర్యాలు ఏరియా ఆస్పత్రిల్లో మౌలిక సదుపాయల కొరత రోగులను ఇబ్బంది పెడుతున్నది. రోగులకు సరిపడా మంచాలు లేకపోవడంతో నర్సంపేట సివిల్ ఆస్పత్రిలో ఒకే మంచంలో ఇద్దరిని ఉంచి వైద్య సేవలు అందిస్తుండగా ఎంజీఎం ఆస్పత్రిలో ఏకంగా కిందనే బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక పరకాల, డోర్నకల్ ఆస్పత్రులో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ ఆస్పత్రులో ఉంటే తాము రోగాల బారిన పడతామోమనని రోగుల బంధువులు భయపడుతున్నారు. పట్నాల్లో ఏరియా ఆస్పత్రులు ఇలా ఉంటే వీటికి తక్కువ కాదు అన్నట్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దర్శనం ఇస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ గుంతలమయమైన రోడ్లపై నుంచి ప్రయాణిస్తూ ఆస్పత్రులకు రోగులు చేరుకుంటున్నా వారికి పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందని ద్రాక్షలానే మారుతోంది. జిల్లాలో ఉన్న చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బుధవారం ‘న్యూస్‌లైన్’ విజిట్ చేసినప్పుడు లింగాలఘన్పూర్, ఆత్మకూరులతో పాటు కురవి మండలం బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రాలేదు. అక్కడున్న ఏఎన్ఎంలు రోగులను పరిశీలించి మందులు ఇస్తున్నారు.