![రాష్ట్రానికి జ్వరమొచ్చింది! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41445380127_625x300.jpg.webp?itok=Y221zq08)
రాష్ట్రానికి జ్వరమొచ్చింది!
♦ ఈ ఏడాది ఐదు లక్షల మంది జ్వర బాధితులు
♦ 10 వేల వరకు మలేరియా కేసులు నమోదు
♦ పంజా విసురుతున్న డెంగీ, చికున్‌గున్యా
♦ ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీల గజగజ
♦ హైదరాబాద్‌లోనూ భారీ సంఖ్యలో బాధితులు
♦ కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
♦ జ్వరాలతో వస్తున్న వారికి ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
♦ దోమ తెరల పంపిణీలో సర్కారు విఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనం జ్వరాలతో మంచం పడుతున్నారు.. మలేరియా, డెంగీ, చికున్‌గున్యాల పంజాలో చిక్కి విలవిల్లాడుతున్నారు.. ఎక్కడిక్కడ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరాల బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి.. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి సాధారణ జ్వరాలు సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అందులో 10 వేల మందికిపైగా మలేరియా బారినపడ్డారు. కేవలం గత నెలలోనే 4,822 మందికి మలేరియా సోకింది. ఇక డెంగీ, చికున్‌గున్యాలతో వందలాది మంది బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కించింది. పట్టణాలు, పల్లెల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం, దోమల స్వైర విహారంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. హైదరాబాద్ నగరంతోపాటు ఆదిలాబాద్ గిరిజన పల్లెల వరకూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువగా ఫాల్సిఫారం మలేరియా కేసులు ఉన్నాయి. వైవాక్స్ తరహా మలేరియాతో పోలిస్తే ఇది మరింత ప్రమాదకారి అని వైద్యులు చెబుతున్నారు. ఖమ్మం, వరంగల్ ఏజెన్సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.
భారీ సంఖ్యలో..
ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో లక్ష మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. ఇందులో ఎక్కువగా జూన్, జూలై నెలల్లోనే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో 80 వేల మందికిపైగా జ్వరాల బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మలేరియా పీడిత గ్రామాలు సుమారు 2,000 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 870, వరంగల్‌లో 110, మహబూబ్‌నగర్‌లో 20 గ్రామాలున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా విష జ్వరాలు ఏజెన్సీ గ్రామాలను వణికిస్తున్నాయి. జ్వరాలతో వచ్చే బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. సాధారణ చికిత్సతో తగ్గే అవకాశమున్నా ప్లేట్‌లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. వాటి సంఖ్య 10 వేల కంటే తగ్గితేనే ఎక్కించాలి. కానీ 20 నుంచి 50 వేల వరకు ఉన్న వారికి కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. వేలకువేలు వసూలు చేస్తున్నారు.
దోమ తెరల పంపిణీ గాలికి..
మలేరియా అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వం దోమ తెరలను పంపిణీ చేయాలి. వీటిని ప్రత్యేకమైన దోమల నివారణ మందులో ముంచి తయారుచేస్తారు. తద్వారా మలేరియా వ్యాప్తిని అరికట్టవచ్చు. కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంకు నిధులతో వీటిని కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. ఒకసారి పంపిణీ చేసిన తెరలు రెండేళ్ల వరకు పనిచేస్తాయి. చివరిసారిగా 2012లో దోమ తెరలను పంపిణీ చేశారు. దీంతో రెండేళ్ల పాటు మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో 2,927... 2013లో 3,442 మలేరియా కేసులు నమోదుకాగా... గతేడాది 5,222 కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 10 వేల కేసులు నమోదయ్యాయి. దోమ తెరలను పంపిణీ చేయకపోవడం వల్ల మలేరియా కేసులు పెరిగాయని వైద్యాధికారులు కూడా చెబుతున్నారు. దోమతెరల కోసం గత ఏడాది డిసెంబర్‌లోనే కేంద్రానికి ఇండెంట్ పెట్టామని... వారు ఇంకా సరఫరా చేయలేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మాత్రం మలేరియాతో పాటు విషజ్వరాల బారినపడుతున్నారు.