సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందోళనకర పరిణామం.
ఇవే నిదర్శనాలు..
∙నగరానికి చెందిన ఒక సూపర్‌స్పెషాలిటీ వైద్యురాలికి తీవ్రమైన జ్వరం వచ్చింది. స్వయాన వైద్యురాలు అయినప్పటికీ ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే కరోనాగా భావించి మందులు వాడేశారు. యాంటీ కోయాగ్యులేషన్(రక్తం పలుచన చేసేవి) మందులు కూడా వినియోగించారు. వారం రోజుల తర్వాత ఓ రోజు వేకువజామున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారణయ్యింది. సహజంగా డెంగీ జ్వరంలో ప్లేట్‌లెట్స్ తగ్గి రక్తం గడ్డకట్టే గుణం కోల్పోతారు. దానికి తోడు ఆమె రక్తం పలుచన చేసే మందులు కూడా వాడటంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు.
∙నగరానికి చెందిన విద్యావంతుడైన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గక పోవడంతో, కరోనాగా భావించి మందులు వాడేశారు. మూడు రోజులకు జ్వరం తీవ్రం కావడంతో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుడు టైఫాయిడ్‌కు మందులు ఇవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.
డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతోంది..
ఇప్పుడు సమాజంలో చాలా మంది చిన్న పాటి జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు వచ్చినా, లక్షణాలను బట్టి కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అది సరైన విధానం కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, ఆ మేరకు మాత్రమే వాడాలంటున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ ‘సీజనల్’ సమయం..
ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే జ్వరం వచ్చిన వెంటనే కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. దానిలో పాజిటివ్ వస్తేనే కరోనాకు మందులు వాడాలి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా జ్వరం తగ్గకుంటే, అప్పుడు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా, డెంగీ నిర్ధారణకు జ్వరం వచ్చిన ఒకటీ, రెండు రోజుల్లో పరీక్ష చేయొచ్చు. కానీ టైఫాయిడ్ నిర్ధారణకు వారం రోజుల తర్వాత చేయాల్సి ఉంటుంది.
లక్షణాలు ఇవీ..
కోవిడ్: జ్వరం, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
టైఫాయిడ్: జ్వరం వచ్చిన రోజు నుంచి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అధికమవుతుంటుంది, జ్వరం వచ్చినప్పుడు చలి, వణుకు రావడం, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది.
డెంగీ: అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన న డుం నొప్పితో పాటు, కీళ్ల నొప్పులు ఉంటాయి.
మలేరియా: విపరీతమైన జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఆకలి మందగిస్తుంది.
కరోనానా? సీజనల్ జ్వరమా?
Published Fri, Aug 27 2021 3:48 PM | Last Updated on Fri, Aug 27 2021 3:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment