విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం | Nuzivedu Triple IT students affected by fever | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం

Published Thu, Aug 29 2024 6:00 AM | Last Updated on Thu, Aug 29 2024 6:00 AM

Nuzivedu Triple IT students affected by fever

జ్వరాల బారిన నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు 

వాంతులు, విరేచనాలు, కడుపు, కళ్లు, కాళ్లు, తలనొప్పులతో అవస్థ 

మూడు రోజుల్లో 566 మంది ఆరోగ్య ఇబ్బందులతో ఆస్పత్రికి రాక 

వారిలో 216 మంది జ్వర బాధితులు 

నూజివీడు: విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం ఆడుతోంది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు జ్వరాలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. వారికి సరైన చికిత్స అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడు రోజులుగా విద్యార్థులు జ్వరంతో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇక్కడి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో 6,600 మంది విద్యార్థులతో పాటు శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఇంజినీరింగ్‌ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు మరో 2,000 మంది ఉంటున్నారు. 

వీరిలో చాలామంది విద్యార్థులు జ్వరాలు, తలనొప్పి, కళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, డయేరియా లక్షణాలతో హాస్టల్‌ రూముల్లోనే పడుకుంటున్నారు. ఈ నెల 26న 193 మంది విద్యార్థులు ఆస్పత్రికి రాగా.. వారిలో 90 మంది జ్వరాలు బారినపడినట్టు గుర్తించారు. మిగిలిన వారు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. 27న 263 మంది ఆస్పత్రికి రాగా 101 మంది జ్వర బాధితులున్నారు. 

బుధవారం సాయంత్రానికి 110 మంది రాగా వారిలో 25 మంది జ్వర బాధితులు, మిగిలిన వారు ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్టు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 566 మంది ఆసుపత్రికి వచ్చి చూపించుకోగా వారిలో 216 మంది జ్వర బాధితులున్నారు. ఈ నెల 9న నూజివీడులోని శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు విరేచనాలతో ఆస్పత్రి పాలవగా.. చికిత్స అందించడంతో రెండు రోజుల్లో రికవరీ అయ్యారు. 

వారం రోజులుగా విద్యార్థులు  నిత్యం ఆస్పత్రి పాలవుతూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ విద్యార్థుల్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన దాఖలాలు లేవని ట్రిపుల్‌ ఐటీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.  రోజుకు 40 నుంచి 50 మంది జ్వరాల బారినపడి మందులు తీసుకొని వెళ్తున్నారని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ తెలిపారు.  

ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన డీఎంహెచ్‌వో 
జ్వరాల తీవ్రత పెరుగుతుండటంతో డీఎంహెచ్‌వో శరి్మష్ట బుధవారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి వచ్చారు.  మెస్‌లను పరిశీలించారు.  ఆమె మాట్లాడుతూ.. మెస్‌లు ఆరోగ్యకరంగా లేవని, ఆహారం సరిగా ఉండటం లేదన్నారు. విద్యార్థులు సీజనల్‌ జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్యులకు చూపించుకుని మందులు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. ఇన్‌పేòÙంట్లుగా కేవలం ఏడుగురే ఉన్నారన్నారు.  మంచినీటి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు. ఎవరికి ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని పేర్కొన్నారు.

15 మందికి పైగా గురుకుల విద్యార్థులకు అస్వస్థత
నాయుడుపేట బీఆర్‌ అంబేడ్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ ఘటన
ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులకు తీవ్ర అనారోగ్యం
ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాలంటూ పలువురు విద్యార్థులను ఇళ్లకు పంపిన సిబ్బంది  
నాయుడుపేట టౌన్‌: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. గత నెలలో ఇదే గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మరో 15 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం బారినపడ్డారు. 8, 9, 10, ఇంటర్‌ తరగతుల విద్యార్థులు మంగళవారం రాత్రి గురుకులంలో చికెన్‌ తిన్నారు. ఆ వెంటనే వారికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో గురుకుల సిబ్బంది వీరిలో కొందరిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఎల్‌ఏ సాగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. 

మరికొందరు విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకువెళ్లాలని  సలహాలిచ్చి ఇళ్లకు పంపారు.   ఈ ఘటనపై ప్రిన్సిపల్‌ దాదాఫీర్‌ను మీడియా సంప్రదించగా.. పెద్ద ప్రమాదం లేదని.. తొమ్మిది మందికే వాంతులు, విరోచనాలు అయినట్టు తెలిపారు.  అయితే 15 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని..  ట్యాబ్లెట్లు ఇవ్వాలని కోరితే తమను పీటీ మాస్టర్‌ కొట్టారంటూ విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు గీతావాణి, మున్సిపల్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి బుధవారం గురుకులాన్ని సందర్శించారు.   

గురుకులంలోని వంటశాలకు వెళ్లి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రిన్సిపల్‌ను హెచ్చరించారు. నాయుడుపేట అర్బన్‌ సీఐ బాబీ కూడా గురుకుల పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement