nuziveedu iiit
-
ఆర్జీయూకేటీ యోగా జట్ల ఎంపిక
నూజివీడు: జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీల్లో పాల్గొనే ఆర్జీయూకేటీ జట్లను ఆదివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎంపిక పోటీల్లో నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ప్రారంభించారు. టీం ఈవెంట్, వ్యక్తిగత, రిథమిక్, ఆర్టిస్టిక్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని ఆర్జీయూకేటీ జట్లకు ఎంపిక చేశారు. వీరు డిసెంబర్ 24 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా రాజమహేంద్రవరం శాప్ యోగా కోచ్ నాగేంద్రన్ వ్యవహరించారు. ఎంపికైన విద్యార్థులు.. మహిళల విభాగంలో టీం ఈవెంట్ జట్టుకు ఏవీఎల్ నిఖిల, ఎస్.ప్రమీల, ఎ.అనూష, సీహెచ్ దివ్య, జేహెచ్‌వీఎస్ దుర్గ, సీహెచ్ మేఘశ్రీ, వ్యక్తిగత విభాగంలో ఎ.అశ్విత, ఆర్టిస్టిక్ విభాగంలో పి.మేఘన, రిథమిక్ విభాగంలో బి.హేమ ఎంపికయ్యారు. పురుషుల జట్టులో టీం ఈవెంట్‌కు కె.లక్ష్మణరావు, ఆర్.శేషసురేష్, పి.ఆదిశంకర్‌రెడ్డి, టి.అభిషేక్, టి.అశోక్, పి.సాయిసురే‹Ù, వ్యక్తిగత విభాగంలో పి.భరత్‌కుమార్, ఆర్టిస్టిక్ విభాగంలో ఆర్.సాయిచైతన్య, రిథమిక్ విభాగంలో టి.దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. వీరంతా నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందినవారే కావడం గమనార్హం. -
విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం
నూజివీడు: విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం ఆడుతోంది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు జ్వరాలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. వారికి సరైన చికిత్స అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడు రోజులుగా విద్యార్థులు జ్వరంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇక్కడి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 6,600 మంది విద్యార్థులతో పాటు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు మరో 2,000 మంది ఉంటున్నారు. వీరిలో చాలామంది విద్యార్థులు జ్వరాలు, తలనొప్పి, కళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, డయేరియా లక్షణాలతో హాస్టల్ రూముల్లోనే పడుకుంటున్నారు. ఈ నెల 26న 193 మంది విద్యార్థులు ఆస్పత్రికి రాగా.. వారిలో 90 మంది జ్వరాలు బారినపడినట్టు గుర్తించారు. మిగిలిన వారు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. 27న 263 మంది ఆస్పత్రికి రాగా 101 మంది జ్వర బాధితులున్నారు. బుధవారం సాయంత్రానికి 110 మంది రాగా వారిలో 25 మంది జ్వర బాధితులు, మిగిలిన వారు ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్టు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 566 మంది ఆసుపత్రికి వచ్చి చూపించుకోగా వారిలో 216 మంది జ్వర బాధితులున్నారు. ఈ నెల 9న నూజివీడులోని శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు విరేచనాలతో ఆస్పత్రి పాలవగా.. చికిత్స అందించడంతో రెండు రోజుల్లో రికవరీ అయ్యారు. వారం రోజులుగా విద్యార్థులు నిత్యం ఆస్పత్రి పాలవుతూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ విద్యార్థుల్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన దాఖలాలు లేవని ట్రిపుల్ ఐటీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. రోజుకు 40 నుంచి 50 మంది జ్వరాల బారినపడి మందులు తీసుకొని వెళ్తున్నారని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. ట్రిపుల్ ఐటీని సందర్శించిన డీఎంహెచ్‌వో జ్వరాల తీవ్రత పెరుగుతుండటంతో డీఎంహెచ్‌వో శరి్మష్ట బుధవారం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చారు. మెస్‌లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. మెస్‌లు ఆరోగ్యకరంగా లేవని, ఆహారం సరిగా ఉండటం లేదన్నారు. విద్యార్థులు సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్యులకు చూపించుకుని మందులు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. ఇన్పేòÙంట్లుగా కేవలం ఏడుగురే ఉన్నారన్నారు. మంచినీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు. ఎవరికి ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని పేర్కొన్నారు.15 మందికి పైగా గురుకుల విద్యార్థులకు అస్వస్థతనాయుడుపేట బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ ఘటనఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు తీవ్ర అనారోగ్యంప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాలంటూ పలువురు విద్యార్థులను ఇళ్లకు పంపిన సిబ్బంది నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. గత నెలలో ఇదే గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మరో 15 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం బారినపడ్డారు. 8, 9, 10, ఇంటర్ తరగతుల విద్యార్థులు మంగళవారం రాత్రి గురుకులంలో చికెన్ తిన్నారు. ఆ వెంటనే వారికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో గురుకుల సిబ్బంది వీరిలో కొందరిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఎల్ఏ సాగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మరికొందరు విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకువెళ్లాలని సలహాలిచ్చి ఇళ్లకు పంపారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ దాదాఫీర్‌ను మీడియా సంప్రదించగా.. పెద్ద ప్రమాదం లేదని.. తొమ్మిది మందికే వాంతులు, విరోచనాలు అయినట్టు తెలిపారు. అయితే 15 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని.. ట్యాబ్లెట్లు ఇవ్వాలని కోరితే తమను పీటీ మాస్టర్ కొట్టారంటూ విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు గీతావాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి బుధవారం గురుకులాన్ని సందర్శించారు. గురుకులంలోని వంటశాలకు వెళ్లి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రిన్సిపల్‌ను హెచ్చరించారు. నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ కూడా గురుకుల పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు. -
‘అన్‌లాగ్’లో ఇంటర్న్‌షిప్‌కు ట్రిపుల్ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది అమెరికన్ బహుళజాతి సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్‌లాగ్ డివైజెస్‌కి ఎంపికయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ట్రిపుల్‌ఐటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఆప్టిట్యూడ్, టెక్నికల్ పరీక్షల అనంతరం తొమ్మిది మంది విద్యార్థులను ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఈ విద్యార్థులకు నెలకు రూ.40వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత వారి పనితీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇదే సంస్థ గతేడాది నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి రూ.27లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను ఇచ్చింది. ఈ సందర్భంగా ట్రిపుల్ఐటీ ఈసీఈ హెచ్‌వోడీ పి.శ్యామ్ మాట్లాడుతూ భారతదేశ సెమీ కండక్టర్ పాలసీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా అగ్రశ్రేణి విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సలహాలు, సూచనల మేరకు ట్రిపుల్‌ఐటీలో పాఠ్యాంశాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది రకాల అత్యాధునిక ల్యాబ్‌లతో నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రతిభావంతులు.. పల్లెటూరి పిల్లలు
నూజివీడు: పల్లెటూరి పేద పిల్లలు.. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వారికి తీసిపోని రీతిలో ప్రతిభ కనబరుస్తున్నారు. బడా కంపెనీలకు ఎంపికవుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ ఇది. పల్లెటూళ్లలో పేద కుటుంబాల్లో పుట్టిన వీరంతా పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. సన్నకారు రైతులు, కూలీలు, గుమాస్తాలు వంటి చిరుద్యోగుల పిల్లలైన వీరు పదో తరగతిలో ప్రతిభ కనబరిచి, ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. తామేమిటో నిరూపించుకుని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2016–22 బ్యాచ్ విద్యార్థులు 699 మంది ఇలా పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు ఎంపికయ్యారు. గ్రామీణ పేద వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల ఆశయాన్ని నెరవేర్చారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో క్యాంపస్ సెలక్షన్స్ విద్యార్థులకు ప్లేస్మెంట్లు కల్పించేందుకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కెరీర్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రత్యేక కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్ట్‌లు, ఇంటర్వూ లు నిర్వహిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడి ప్లేస్మెంట్లు నిర్వహిస్తోంది. ఈ ఏడాది 61 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లేస్మెంట్లు నిర్వహించాయి. ఏడాదికి కనిష్టంగా రూ.3.60 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ప్యాకేజీతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. బెంగళూరుకు చెందిన జస్పే టెక్నాలజీస్ రూ.27 లక్షలు, డిమాండ్ వర్క్ టెక్నాలజీస్ రూ.24 లక్షలు, అన్‌లాగ్ డివైసెస్ రూ.20 లక్షలు, అమెజాన్ రూ.18 లక్షలు, ముంబైకి చెందిన గప్‌చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన థాట్ వర్క్స్ రూ.11.10 లక్షలు, శాన్ డిస్క్ రూ.9.10 లక్షల వేతనాలతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. అత్యధికంగా విప్రోకు 192 మంది, క్యాప్ జెమినీకి 109 మంది, ఇన్ఫోసిస్‌కు 78 మంది, టీసీఎస్‌కు 76 మంది, టెక్ మహీంద్రాకు 49 మంది ఎంపికయ్యారు. 243 మందికి ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్ 243 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్‌కు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఇంటర్న్‌షిప్‌లో స్టైఫండ్ రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు అందుకోనున్నారు. ఇంటర్న్‌షిప్ ముగియగానే అదే కంపెనీలో ఉద్యోగంలో చేరతారు. బ్రాంచిల ప్లేస్‌మెంట్స్ శాతాలు ఈసీఈలో 95.10 శాతం, సీఎస్ఈలో 90.7 శాతం, కెమికల్ ఇంజినీరింగ్‌లో 61 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 57.5 శాతం విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించారు. కెమికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కోర్ గ్రూపునకు సంబంధించి ఉన్నత చదువులు చదివేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఆ గ్రూపుల్లో ప్లేస్మెంట్లు తక్కువగా ఉన్నాయి. అమ్మ, నాన్న కష్టపడకుండా చూసుకుంటా మాది అమలాపురం. ఇద్దరు అక్కలున్నారు. నాన్న సాయి ప్రసాద్ షాపు షాపునకు తిరిగి అగర్బత్తీలు అమ్ముతారు. అమ్మ రామలక్ష్మి టైలరింగ్ చేస్తుంది. తొలి ప్రయత్నంలోనే ఏడాదికి రూ.27 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాన్న కష్టపడకుండా చూసుకుంటా. ట్రిపుల్ ఐటీ నాలాంటి వందలాది మంది జీవితంలో వెలుగులు నింపింది. – కూనపరెడ్డి అజయ్‌శంకర్, అమలాపురం, కోనసీమ జిల్లా అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాం ట్రిపుల్ ఐటీలో చేరే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న ల్యాబ్‌లు దేశంలో ఏ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలోనూ లేవు. ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహిస్తూ ప్లేస్మెంట్లకు సిద్ధం చేస్తాం. ప్రముఖ కంపెనీలన్నీ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేలా చూస్తున్నాం. – ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థి మండల రామూనాయుడు (16) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన రామానాయుడు పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తరగతులకు వెళ్లడంతో పాటు మధ్యాహ్నం మెస్‌కు వెళ్లి భోజనం చేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఈనెల 4న ట్రిపుల్ఐటీకి రానున్న ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మూడో ఫ్లోర్‌లోని గదుల్ని సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో వారు గదిలో ఉరికి వేలాడుతున్న రామూనాయుడిని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రామూనాయుడు మృతి చెందాడు. గతనెల 25నే ట్రిపుల్ ఐటీకి వచ్చిన అతడు ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి గతంలోనే మరణించగా తండ్రి, అక్క ఉన్నారు. వీరికి దూరంగా ఉండాల్సి వస్తోందనే వేదనతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ కారణంతోనే గతనెల 13నే కాలేజీకి రావాల్సిన అతడు 25న వచ్చినట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థికి లక్ష డాలర్ల వేతనం
నూజివీడు : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యనందించాలన్న ఆశయంతో దివంగత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీల లక్ష్యం నెరవేరుతోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14లో చదివిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా ఏడాదికి లక్ష డాలర్ల వేతనంతో ఉద్యోగాన్ని సాధించాడు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆయన సతీమణి ప్రోత్సాహంతో చదువులో రాణిస్తూవచ్చాడు. అదే గ్రామంలోని లకిరెడ్డి పాపులమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో 2008లో పదో తరగతిలో 600 మార్కులకు 564 సాధించి.. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు దక్కించుకున్నాడు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ బీటెక్‌లో ఈసీఈ బ్రాంచి తీసుకుని 9.27 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. ట్రిపుల్‌ఐటీలో చదువుకునేటప్పుడే అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ముబారక్ షా పరిశోధనాపత్రాలను చదివేవాడు. దీంతో కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్‌లను ఉపయోగించి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనే అంశంపై పరిశోధనలు చేయడంతో పాటు.. ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ సైంటిఫిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్‌లో పరిశోధనా పత్రాన్ని సైతం ప్రచురించాడు. బీటెక్ చివరిలో క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించి హైదరాబాద్‌లో రెండున్నరేళ్లు పనిచేశాడు. టీసీఎస్‌కు అమెరికాలోని కార్నెగీ మెలాన్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం ఉండటంతో కంపూటర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అందులో సీటు సంపాదించి.. 2019లో పూర్తిచేశాడు. ప్రస్తుతం శివరామకృష్ణ లక్ష డాలర్ల వార్షిక వేతనంతో గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గూగుల్ ‘మౌంటెన్ వ్యూఫర్ వరల్డ్ ఐపీ టీమ్’లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదవడం వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నానని, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని శివరామకృష్ణ ఉద్వేగంతో చెప్పాడు. -
ఆయుష్ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు
సాక్షి, విజయవాడ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణమండపంలో ఆయుష్ ఆధ్వర్యంలో యగా డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆయుష్ కమీషనర్ పీఏ శోభ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. నూజీవీడు ట్రీపుల్ ఐటీ విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య డి.సూర్యచంద్రరావు నిర్వహించారు. ఈ ఈవెంట్లో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రణాళిక లోపం.. విద్యార్థులకు శాపం
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ప్రారంభించాలంటే అందుకు ప్రణాళిక ఎంతో కీలకం. బోధన సిబ్బంది నుంచి మౌలిక వసతుల వరకు అన్నింటా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించాలి. అలా చేయకపోతే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలాగానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీకాకుళంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రధాన సమస్య వసతి. వాస్తవంగా ఎస్ఎంపురంలో అప్పటికే 500 మంది విద్యార్థులు వసతి, తరగతి నిర్వహణ సామర్థ్యం ఉన్న భవనాల్లో ప్రారంభించారు. లేదంటే ఇప్పటికీ ఇక్కడ తరగతులు నిర్వహన సాధ్యం అయ్యేది కాదు. 2016 అక్టోబర్ 10న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపప చేశారు. 200 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. కనీసం 1000 మంది సామర్థ్యం గల భవనాలను మాత్రం నిర్మించలేకపోయారు. వాస్తవానికి ట్రిపుల్ ఐటీ ప్రారంభం నుంచి పక్కాగా బడ్జెట్ కేటాయింపులు, సామర్థ్యం ఉన్న సంస్థలకు టెండర్ల అప్పగింత, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపులు చెయ్యలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రణాళిక లోపమే ఇప్పుడు విద్యార్థులకు శాపమవుతోంది. నాలుగో బ్యాచ్‌కు నొటిఫికేషన్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో నాలుగో బ్యాచ్‌కు నొటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మేరకు ఆగస్టు 9న తరగతులు ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1000 మంది సామర్థ్యం గల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ భవనాలు నిర్మాణం పూర్తయితేనే ఇక్కడ తరగతుల నిర్వహణ సాధ్యమవుతుంది. రూ.33 కోట్లు భవనాలకు అంతర్గత పనులు నిర్వహిస్తున్నారు. 45 రోజుల్లో ఈ భవనాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ సామర్థ్యం, అధికారుల పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం. మరో పక్క శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పారిపాలన, రెండు బ్యాచ్‌లకు తరగతులు నూజివీడులోనే సాగుతున్నాయి. విద్యార్థులు, బోధన సిబ్బంది శ్రీకాకుళం రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ సౌకర్యాలు, తాగునీటి, రన్నింగ్ నీటి సౌకర్యం సైతం ప్రధాన సమస్యగా ఉన్నాయి. మరో పక్క ఇక్కడి బోధన సిబ్బందిని అక్కడికి బదిలీ చేసినా వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు. అధికారులు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అధికారులు, విద్యార్థులు, బోధన సిబ్బంది అందరూ ఒక్కచోట ఉంటేనే ట్రిపుల్ ఐటీలో విద్యా ప్రమాణాల ప్రగతి సాధ్యమవుతుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన అన్ని బ్యాచ్‌ల నిర్వహణ ఎప్పటికి సాధ్యమవుతుందో నిరీక్షించాల్సిందే. మూడు బ్యాచ్‌ల్లో ప్రవేశాలు.. ఒక బ్యాచ్‌కు నొటిఫికేషన్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇప్పటికి మూ డు బ్యాచ్‌లకు ప్రవేశాలు కల్పించారు. ఈ ఏడాది ప్రవేశాలకు నొటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి బ్యాచ్ 2016–17 శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి మొదటి బ్యాచ్ 1000 మందికి 2016–17లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశాలు కల్పించిన నాటి నుంచి నూజివీడులో తరగతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో ఏడాదికి చేరుకున్నారు. పేరుకు శ్రీకాకుళం విద్యార్థులు అయినా శ్రీకాకుళం క్యాంపస్ సైతం వీరికి తెలీదు. రెండో బ్యాచ్ 2017–18 ఈ బ్యాచ్‌లో 1000 మందికి ప్రవేశాలు కల్పించారు. ప్రారంభంలో నూజివీడులో తరగతులు ప్రారంభించారు. ఏడాది పాటు అక్కడ తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం 2018 జనవరిలో ఇక్కడికి షిప్టు చేశారు. ఎప్ఎం పురం గురుకులంలో 500 మంది బాలికలకు, చినరావుపల్లిలో అద్దెకు తీసుకున్న మిత్రా ఇంజినీరింగ్ క్యాంపస్‌లో బాలురు 500 మందికి తరగతులు నిర్వహిస్తుంచారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంజినీరింగ్ మొదటి ఏడాదికి చేరుకున్నారు. ఈ ఒక్క బ్యాచ్ మాత్రమే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సాగుతోంది. ఇంజినీరింగ్ ప్రవేశాలు పొందిన ఈ విద్యార్థులకు ప్రస్తుతం ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. మూడో బ్యాచ్ 2018–19 గత ఏడాది ఆగస్టులో 1000 మందితో ఈ బ్యాచ్ ప్రారంభించారు. మొదటి సంవత్సరం పీయూసీ నుంచి రెండో ఏడాదికి విద్యార్థులు చేరుకున్నారు. శ్రీకాకుళంలో అద్దె భవనాలు తీసుకోని ఇక్కడికి విద్యార్థులను తరలించాలని ప్రయత్నించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ శివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భవనాలు అద్దెకు తీసుకున్నారు. అయితే తరలింపు మాత్రం సాధ్యం కాలేదు. ఎప్పటికి తరలిస్తారో తెలీని పరిస్థితి కొనసాగుతోంది. ఈ కళాశాలలో ప్రస్తుతం ఎన్నికల సామగ్రి ఉంది. ప్రయత్నిస్తున్నాం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన అన్ని బ్యాచ్‌లకు తరగతులు ఇక్కడ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. భూ సేకరణలో సమస్యల వల్ల భవనాల నిర్మాణం అనుకున్నంత వేగంగా ముం దుకు సాగలేదు. ప్రస్తుతం 200 ఎకరాలు ప్రభుత్వ అప్పగించింది. మూడు బ్యాచ్‌ల్లో ఇక్కడ ఇంజినీరింగ్ మొదటి ఏడాది తరగతులు జరుగుతున్నాయి. పీయూసీ రెండో ఏడాది బ్యాచ్ శివానీకి షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతం ఆగస్టు 9 నుంచి తరగతులు ప్రారంభించే బ్యాచ్ ఇక్కడే ప్రారంభిస్తాం. ఇంజినీరింగ్ రెండో ఏడాది బ్యాచ్ కోసం తాత్కాలిక భవనాలు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాదిలో నాలుగు బ్యాచ్‌లు ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. - ప్రొఫెసర్ ఎస్.హరశ్రీరాములు, డైరెక్టర్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ -
శిలాఫలకాలకి మూడున్నరేళ్లు!!
సాక్షి, నూజివీడు: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శాఖా (డిపార్ట్మెంటల్) భవనాల నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అంతుబట్టడం లేదు. 2015 డిసెంబరు 23న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శం కుస్థాపన చేసి మూడున్నరేళ్లు గడిచినా ఇంత వరకు భవనాల పనులే ప్రారంభంకాని దారుణ పరిస్థితి ఇది. ఆర్జీయూకేటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో శంకుస్థాపన శిలాఫలకాలు వచ్చే పోయే వారికి స్వాగతం పలుకుతున్నట్లుగా ప్రధాన గేటు పక్కన దర్శనమిస్తున్నాయి. డిపార్ట్మెంట్ల వారీగా వసతులను కల్పించాల్సిన అవసరం ఉన్నందున డిపార్ట్మెంట్ భవనానికి శ్రీకారం చుట్టడం మంచిదే కాని, జాప్యం జరగడంపైనే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.60 కోట్ల అం చనాలతో నిర్మించాల్సి ఉన్న ఈ భవనం మొత్తం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో ఒక్క మెకానికల్ బ్రాం చికి మాత్రమే పూర్తిస్థాయిలో ల్యాబ్ సదుపాయం ఉంది. మిగిలిన ఐదు బ్రాంచిలకు సంబంధించి పూర్తిస్థాయిలో ల్యాబ్‌ల సదుపాయం లేదు. అలాగే హెచ్వోడీలకు సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. ఉన్న వాటిల్లోనే ప్రస్తు తం సర్దుకుంటున్నారు. ఎంతో ముఖ్య మైన ఇలాంటి భవన నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందో అంతుబట్టడం లేదు. నూజివీడు ట్రిపుల్ఐటీ పది డిపార్ట్మెంట్లకు కలిపి ఒకే భవనం ట్రిపుల్‌ఐటీలను స్థాపించి 10ఏళ్లు గడిచినా విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్, మెస్, గ్రంథాలయం తదితర వసతులు మాత్రమే పూర్తిస్థాయిలో అం దుబాటులోకి రాగా, సబ్జెక్టుల వారీగా అవసరమైన వసతులు బోధనా సిబ్బం దికి అందుబాటులోకి రాలేదు. దీంతో పీయూసీకి సంబంధించి గణితం, భౌతి కశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లీషుతో పాటు ఇంజినీరింగ్‌కు సంబంధించి మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, కెమికల్, మెటలర్జీ బ్రాంచిలకు సం బం ధించి డిపార్ట్మెంటుల వారీగా వసతులు లేవు. దీంతో హెచ్వోడీలు అకడమిక్ భవనాలలో, పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులతో సర్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పది శాఖలకు సంబంధించి వసతులుండటంతో పాటు హెచ్వోడీలకు, స్టాఫ్‌కు, విద్యార్థులతో, స్టాఫ్ తో సమావేశాలు పెట్టుకోవడానికి అవసరమైన గదులు ఇలా అన్ని రకాల వసతులు ఉండేలా నిర్మించాల్సి ఉంది. దీంతో అప్పట్లో ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేయిం చారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో నాపరాళ్లపై పేర్లు వేసుకోవడానికి శంకుస్థాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని
కృష్ణా : హాస్టల్భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నూజివీడులోని ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థిని బోడు సుష్మా పావని గురువారం ఉదయం హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సుష్మా.. వరంగల్‌జిల్లాలోని గుండెగ గ్రామానికి చెందినట్లు సమాచారం. -
చెప్పినట్టు వింటారా.. నూజివీడు వెళ్తారా...
సాక్షి ప్రతినిధి కడప : ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆశలపై పిడుగుపడింది. అంచనాలు తలకిందులవుతున్నాయి. అధికారుల హఠాత్పరిణామానికి బిత్తరపోవాల్సిన దుస్థితి నెలకొంది. సమయం లేదు.. చెప్పినట్లు విని బ్రాంచ్ మారుతారా.. నూజివీడు వెళ్తారా...మీరే తేల్చుకోండని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు అల్టిమేటం జారీ చేశారు. రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ నిర్ణయంతో విద్యార్థులు మదనపడుతున్న వైనమిది. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విజయవంతంగా నడుస్తున్న కెమికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఉన్న ఫళంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రాంచ్‌లోని విద్యార్థులను నూజివీడుకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడికి వెళ్లలేని పక్షంలో బ్రాంచ్ మారాలని సూచించారు. ఇదేమి విడ్డూరం..రెండేళ్ల పాటు ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరిన తమకు ఇప్పుడు అర్ధాంతర రద్దు ఏమిటని విద్యార్థులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నూజివీడులో విద్యను అభ్యసించేందుకు వెళ్లలేని వారు చదువు పూర్తయ్యాక విదేశాల్లో ఎలా ఉద్యోగాలు చేస్తారంటూ వ్యంగ్యం వ్యక్తం చేస్తున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఆర్టికల్ 371–డి ప్రకారం ఇక్కడే అర్హులు.. ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ కొనసాగుతోంది. ట్రిపుల్ఐటీ యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాయలసీమ విద్యార్థులు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. 10ఏళ్లుగా ఈ విభాగం ఆర్కే వ్యాలీలో విజయవంతంగా నడుస్తోంది. 2018–19 ఏడాదికి కూడా 15 మంది కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరిపోయారు. కాగా ఆర్కే వ్యాలీలో ఉన్న కెమికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని రద్దు చేస్తున్నాం, మీరు బ్రాంచ్ మారుతారా...లేదంటే నూజీవీడు వెళ్తారా... అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచారు. ఇక్కడున్న ఈ విభాగాన్ని రద్దు చేస్తే జోనల్ వ్యవస్థ కారణంగా భవిష్యత్‌లో నూజీవీడులో సీటు లభించడం గగనం అవుతుందని పరిశీలకులు వాపోతున్నారు. పైగా ఆర్కే వ్యాలీ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి రూ.1.8కోట్ల తో 6 ల్యాబ్‌లు, రూ.50లక్షలతో డిపార్టుమెంటు బిల్డింగ్, రూ.30 లక్షలతో రీసెర్చి ల్యాబ్ ఉన్నాయి. ఇంతటి వసతులున్న ఈ ప్రాంతాన్ని వదిలేసి నూజీవీడు వెళ్లండనీ ఒత్తిడి పెంచడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.రాయలసీమలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అందుబాటులో లేకుండా చేయడంపై రాజ్యాంగ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇవేవీ పట్టించుకోకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా రెండేళ్ల పాటు ఇంటర్ విద్యను పూర్తిచేసిన ఆర్కే వ్యాలీ విద్యార్థులను నూజీవీడు వెళ్లండనీ హుకుం ప్రదర్శించడం ఏమాత్రం సహేతుకం కాదని అంటున్నారు. ఇదే విషయమై వేంపల్లె ట్రీపుల్‌ఐటీ విద్యార్ధులు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆర్జీయూకెటీ నిర్ణయం కారణంగా తాము నష్టపోతున్నామని వాపోయారు. ఈవిషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆర్కే వ్యాలీ ట్రీపుల్‌ఐటీ అధికారులు అందుబాటులో లేరు. -
భోజనానికి వెళ్లి వచ్చేలోపే ఆత్మహత్య
సాక్షి, నూజివీడు: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాగిరెడ్డి పూర్ణలక్ష్మీనరసింహమూర్తి (16) బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన మూర్తి కృష్ణా జిల్లా నూజివీడులోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతూ.. ఐ–3 హాస్టల్ రెండో అంతస్తు రూమ్ నంబరు ఎస్–69లో ఉంటున్నాడు. ఇతనితో పాటు మరో నలుగురు కూడా ఉంటున్నారు. ఇతర విద్యార్థులు భోజనానికి వెళ్లిన సమయంలో మూర్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భోజనం ముగించుకుని వచ్చిన విద్యార్థులు ఫ్యాన్‌కు వేలాడుతున్న అతన్ని కిటికీలో నుంచి చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ సిబ్బంది గది తలుపులు తెరిచి వెంటనే అంబులెన్సులో పట్టణంలోని అమెరికన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మూర్తిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ ఎం రామ్‌కుమార్ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ట్రిపుల్ ఐటీకి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మూర్తి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందీ తెలియరాలేదు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరగతులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
బోధకులెక్కడ?
ట్రిపుల్ ఐటీలను పీడిస్తున్న బోధన సిబ్బంది కొరత తాత్కాలిక మెంటార్లు, లెక్చరర్లే గతి ఉద్యోగ భద్రత లేక వారూ వెళ్లిపోతున్నారు విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పట్టించుకోని ఆర్జీయూకేటీ పాలకులు మహానేత వైఎస్సార్ ఆశయాలకు తూట్లు! నూజివీడు: పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలను బోధన సిబ్బంది కొరత పీడిస్తోంది. ఏర్పాటు చేసి ఎనిమిదేళ్ళైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు బోధన సిబ్బంది పోస్టుల భర్తీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో ఏర్పాటు చేసిన నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలలో పనిచేస్తున్న మెంటార్ల, లెక్చరర్ల కొరతతో పాటు, వారికున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ముఖం చాటేస్తున్న మెంటార్లు ఇక్కడ విద్యార్థులకు బోధించే ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో భాగంగా మొదటి రెండేళ్ళు పియూసీ కోర్సులను, తరువాత నాలుగేళ్ళు ఇంజినీరింగ్ కోర్సుల్లో నిపుణులుగా తయారుచేస్తారు. పీయూసీ విద్యార్థుల కోసం 230 మంది మెంటార్లను నియమించగా, వీరిలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం రెండు క్యాంపస్‌లలో కలిపి 100 మంది మెంటార్లు, మాత్రమే ఉన్నారు. లెక్చరర్ల కొరత అయితే చెప్పనవసరమే లేదు. ఇంజినీరింగ్ కోర్సులకు ఉన్న కొరతను అధిగమించడానికి ట్రిపుల్‌ఐటీలోనే కోర్సు పూర్తిచేసిన విద్యార్థులను టీచింగ్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక పద్ధతిలో నియమించుకుంటున్నారు. పరిష్కారం చూడరా? ట్రిపుల్ఐటీలలో మెంటార్లు, లెక్చరర్లు అడుగడుగునా సమస్యలే. ఎనిమిదేళ్లు గడిచినా ఇంతవరకు ఉద్యోగభద్రత లేదు. వారిని పర్మినెంట్ చేయలేదు. దీంతో వారిలో ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం, ఆసక్తి రానురాను తగ్గిపోతోంది. బోధకుల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కడం లేదు. దీని పరిష్కరానికి ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నూజివీడు ట్రిపుల్ఐటీలోని పలు బ్రాంచిలలో లెక్చరర్, విద్యార్థుల నిష్పత్తి 1:100గా ఉంటోంది. పియూసీలో కూడా లెక్చరర్, విద్యార్థుల నిష్పత్తి 1:80వరకు ఉంది. బోధన సిబ్బంది కొరత ఇలా ఉంటే బోధనాసిబ్బందికి తెలియకుండానే ఉన్నతాధికారులు ప్రతిఏటా కరిక్యులమ్ మారుస్తూ మరింత ఒత్తిడి గందరగోళం పెంచుతున్నారు. అదనంగా శ్రీకాకుళం,ఒంగోలు ట్రిపుల్‌ఐటీల భారం ఉన్నవాటినే సిబ్బంది కొరత వెంటాడుతుంటే ప్రభుత్వం శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలను ప్రారంభించి మెంటార్లు, లెక్చరర్లపై అదనపు భారం మోపింది. ఈ నేప«థ్యంలో ట్రిపుల్ ఐటీల్లో నాణ్యత ప్రమాదంలో పడిందనే ఆందోళనలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి. -
భోజనం కోసం ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆందోళన
కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి మార్వెల్‌మెస్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు...హాస్టల్ లో ఆహారం సమయానికి పెట్టడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా హాస్టల్ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అనంతరం నూజివీడు ఎమ్మార్వో ఇంతియాజ్ విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అంతేకాకుండా విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. (నూజివీడు) -
ఝాన్సీకి నాసా అంతర్జాతీయ అవార్డు
పెనుమాక(తాడేపల్లిరూరల్), న్యూస్‌లైన్: గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని కొక్కిలగడ్డ ఝాన్సీకి అంతర్జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన పోటీల్లో వ్యక్తిగత స్థాయి ప్రథమ స్థానం లభించింది. విద్యార్థులకు ఏటా నాసా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తుంది. నూజివీడు ఐఐఐటీలో ఝాన్సీ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. 2013-14 పోటీల్లో ‘ది వండర్ ఓయాసిస్’ పేరుతో ఓ పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించింది. ప్రపంచ వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరిశోధన పత్రాలు పంపారు. ఝాన్సీకి గ్రేడ్ 12 కేటగిరీలో మొదటి బహుమతి వచ్చింది. ఝాన్సీ తండ్రి వెంకటేశ్వరరావు పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి ఆంధ్ర లక్ష్మి గృహిణి. సోదరి రాధ నూజివీడు ఐఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతుంది. తనకు సైన్స్ ఇష్టమని, పెద్దయ్యాక సైంటిస్ట్ కావాలనుకుంటున్నానని ఝాన్సీ న్యూస్‌లైన్‌కు తెలిపింది.