గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్‌ కొలువుల తివాచీ | Corporate opportunities for rural students | Sakshi
Sakshi News home page

గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్‌ కొలువుల తివాచీ

Jan 24 2025 6:09 AM | Updated on Jan 24 2025 6:09 AM

Corporate opportunities for rural students

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ప్రముఖ కంపెనీల నుంచి రూ.లక్షల్లో ప్యాకేజీల ఆఫర్‌

క్యాంపస్‌ సెలక్షన్లలో 2018–24 బ్యాచ్‌కు చెందిన 473 మంది ఎంపిక

ఆరుగురికి అత్యధికంగా  రూ.27.6 లక్షల వార్షిక వేతనం

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతున్నాయి. రూ.లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తూ.. తమ సంస్థల్లో ఉద్యోగాలిస్తున్నాయి. ఈసారి నూజివీడు ట్రిపుల్‌ ఐటీ నుంచి ఏకంగా 473 మంది విద్యార్థులను క్యాంపస్‌ సెలక్షన్లలో వివిధ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. కొందరు విద్యార్థులైతే రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి సైతం ఎంపికయ్యారు.  

సాకారమవుతున్న వైఎస్సార్‌ ఆశయం.. 
పేదల పిల్లలకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్‌ ఐటీల ఆశయం నెరవేరుతోంది. ట్రిపుల్‌ ఐటీల్లో చదివే వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, కూలీలు, చిరుద్యోగుల పిల్లలే. వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించి ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు దక్కించుకున్నారు. 

ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించి చదువు పూర్తికాకముందే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 11 బ్యాచ్‌లు చదువు పూర్తిచేసుకొని వెళ్లగా.. దాదాపు ఏడు వేల మందికి పైగా విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాగే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో, మరికొందరు విదేశాల్లో  స్థిరపడ్డారు. ఈసారి 2018–24 బ్యాచ్‌కు చెందిన 473 మంది విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.  

ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ..  
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని కెరీర్‌ డెవలప్‌మెంట్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఎంతో కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్‌ టెస్ట్‌లు, మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో క్యాంపస్‌ సెలెక్షన్లు నిర్వహింపజేస్తోంది. 

ఇన్ఫో­సిస్, విప్రో, టీసీఎస్, థాట్‌ వర్క్స్, ఎఫ్‌ట్రానిక్స్, అచల ఐటీ సొల్యూషన్స్, పర్పుల్‌ టాక్, పర్పుల్‌ డాట్‌కామ్, ఈజ్‌ సాఫ్ట్, ఎన్‌సీఆర్, ఏడీపీ, అన్‌లాగ్‌ డివైజస్, టెక్‌ మహీంద్రా తదితర ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ క్యాంపస్‌ సెలెక్షన్లు నిర్వహించేలా ప్రత్యేక కృషి చేస్తోంది. దీంతో గత విద్యా సంవత్సరంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 56 కంపెనీలు క్యాంపస్‌ సెలక్షన్లు నిర్వహించాయి.  

ఆరుగురికి అత్యధిక ప్యాకేజీ.. 
క్యాంపస్‌ సెలక్షన్లకు 746 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 473 మంది విద్యార్థులు రూ.4.5 లక్షల నుంచి రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన అన్‌లాగ్‌ డివైసెస్‌ కంపెనీ రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. వీరికి ఏడాది పాటు ఇచ్చే ట్రైనింగ్‌లో సైతం నెలకు రూ.40 వేల స్టైఫండ్‌ ఇవ్వనుంది. 

అలాగే సినాప్సిస్‌ కంపెనీ రూ.20 లక్షల వార్షిక వేతనంతో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మైక్రాన్‌ కంపెనీ రూ.16 లక్షల వార్షిక వేతనంతో ఇద్దరిని, బెంగళూరుకు చెందిన వేదాంతు కంపెనీ రూ.15 లక్షల వార్షిక వేతనంతో నలుగురిని, బెంగళూరుకు చెందిన బీఈఎల్‌ కంపెనీ రూ.12.45 లక్షల వార్షిక వేతనానికి నలుగురిని, హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఫౌండేషన్‌ రూ.11 లక్షల వార్షిక వేతనానికి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.

క్యాంపస్‌ సెలక్షన్స్‌పై ప్రత్యేక తర్ఫీదు 
విద్యార్థులకు ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం నుంచే క్యాంపస్‌ సెలక్షన్ల కోసం నిరంతరం శిక్షణ అందిస్తుంటాం. మాక్‌ టెస్ట్‌లు, మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దీంతో విద్యార్థులు ఎలాంటి భయం, బెరుకు లేకుండా క్యాంపస్‌ సెలెక్షన్లలో అన్ని దశలను ఎదుర్కొని.. సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.
– బి.లక్ష్మణరావు, ఏఓ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement