ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ముఖద్వారం
సాక్షి ప్రతినిధి కడప : ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆశలపై పిడుగుపడింది. అంచనాలు తలకిందులవుతున్నాయి. అధికారుల హఠాత్పరిణామానికి బిత్తరపోవాల్సిన దుస్థితి నెలకొంది. సమయం లేదు.. చెప్పినట్లు విని బ్రాంచ్ మారుతారా.. నూజివీడు వెళ్తారా...మీరే తేల్చుకోండని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు అల్టిమేటం జారీ చేశారు. రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ నిర్ణయంతో విద్యార్థులు మదనపడుతున్న వైనమిది. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విజయవంతంగా నడుస్తున్న కెమికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఉన్న ఫళంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆ బ్రాంచ్‌లోని విద్యార్థులను నూజివీడుకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడికి వెళ్లలేని పక్షంలో బ్రాంచ్ మారాలని సూచించారు. ఇదేమి విడ్డూరం..రెండేళ్ల పాటు ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరిన తమకు ఇప్పుడు అర్ధాంతర రద్దు ఏమిటని విద్యార్థులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నూజివీడులో విద్యను అభ్యసించేందుకు వెళ్లలేని వారు చదువు పూర్తయ్యాక విదేశాల్లో ఎలా ఉద్యోగాలు చేస్తారంటూ వ్యంగ్యం వ్యక్తం చేస్తున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు.
ఆర్టికల్ 371–డి ప్రకారం ఇక్కడే అర్హులు..
ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ కొనసాగుతోంది. ట్రిపుల్‌ఐటీ యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాయలసీమ విద్యార్థులు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. 10ఏళ్లుగా ఈ విభాగం ఆర్కే వ్యాలీలో విజయవంతంగా నడుస్తోంది. 2018–19 ఏడాదికి కూడా 15 మంది కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరిపోయారు. కాగా ఆర్కే వ్యాలీలో ఉన్న కెమికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని రద్దు చేస్తున్నాం, మీరు బ్రాంచ్ మారుతారా...లేదంటే నూజీవీడు వెళ్తారా... అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచారు.
ఇక్కడున్న ఈ విభాగాన్ని రద్దు చేస్తే జోనల్ వ్యవస్థ కారణంగా భవిష్యత్‌లో నూజీవీడులో సీటు లభించడం గగనం అవుతుందని పరిశీలకులు వాపోతున్నారు. పైగా ఆర్కే వ్యాలీ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి రూ.1.8కోట్ల తో 6 ల్యాబ్‌లు, రూ.50లక్షలతో డిపార్టుమెంటు బిల్డింగ్, రూ.30 లక్షలతో రీసెర్చి ల్యాబ్ ఉన్నాయి. ఇంతటి వసతులున్న ఈ ప్రాంతాన్ని వదిలేసి నూజీవీడు వెళ్లండనీ ఒత్తిడి పెంచడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.రాయలసీమలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అందుబాటులో లేకుండా చేయడంపై రాజ్యాంగ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
ఇవేవీ పట్టించుకోకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా రెండేళ్ల పాటు ఇంటర్ విద్యను పూర్తిచేసిన ఆర్కే వ్యాలీ విద్యార్థులను నూజీవీడు వెళ్లండనీ హుకుం ప్రదర్శించడం ఏమాత్రం సహేతుకం కాదని అంటున్నారు. ఇదే విషయమై వేంపల్లె ట్రీపుల్‌ఐటీ విద్యార్ధులు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆర్‌జీయూకెటీ నిర్ణయం కారణంగా తాము నష్టపోతున్నామని వాపోయారు. ఈవిషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆర్కే వ్యాలీ ట్రీపుల్‌ఐటీ అధికారులు అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment