అడవిలో ప్రేమ జంట..ఆచూకీ లభ్యం
వేంపల్లె: పరారైన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అటవీప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుకునే సౌందర్య, నవీన్లు శేషాచలం అడవుల్లో తప్పిపోయిన విషయం తెలిసిందే. కళాశాలలో పీయూసీ రెండో సంవత్సరం చదువుకుంటున్న ఇద్దరు విద్యార్ధులు శనివారం నుంచి కనిపించకుండా పోయారు.
ప్రకాశం జిల్లాకు చెందిన సౌందర్య, చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్ సోమవారం కళాశాలకు రాకపోవడంతో వీరి అదృశ్యం విషయాన్ని ట్రిపుల్ ఐటీ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, శేషాచలం అడవుల్లో చిక్కుకున్నామని, దారి తెలియక ఇబ్బందులు పడుతున్నామంటూ వారు సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి సెల్ సిగ్నల్స్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.