ప్లేస్‌మెంట్లు పొందిన విద్యార్థులతో డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు
నూజివీడు: పల్లెటూరి పేద పిల్లలు.. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వారికి తీసిపోని రీతిలో ప్రతిభ కనబరుస్తున్నారు. బడా కంపెనీలకు ఎంపికవుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ ఇది. పల్లెటూళ్లలో పేద కుటుంబాల్లో పుట్టిన వీరంతా పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. సన్నకారు రైతులు, కూలీలు, గుమాస్తాలు వంటి చిరుద్యోగుల పిల్లలైన వీరు పదో తరగతిలో ప్రతిభ కనబరిచి, ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. తామేమిటో నిరూపించుకుని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2016–22 బ్యాచ్ విద్యార్థులు 699 మంది ఇలా పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు ఎంపికయ్యారు. గ్రామీణ పేద వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల ఆశయాన్ని నెరవేర్చారు.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో క్యాంపస్ సెలక్షన్స్
విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు కల్పించేందుకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కెరీర్ డెవలప్‌మెంట్, ప్లేస్‌మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రత్యేక కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్ట్‌లు, ఇంటర్వూ లు నిర్వహిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతోంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో మాట్లాడి ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తోంది. ఈ ఏడాది 61 ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్లేస్‌మెంట్లు నిర్వహించాయి.
ఏడాదికి కనిష్టంగా రూ.3.60 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ప్యాకేజీతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. బెంగళూరుకు చెందిన జస్‌పే టెక్నాలజీస్ రూ.27 లక్షలు, డిమాండ్ వర్క్ టెక్నాలజీస్ రూ.24 లక్షలు, అన్‌లాగ్ డివైసెస్ రూ.20 లక్షలు, అమెజాన్ రూ.18 లక్షలు, ముంబైకి చెందిన గప్‌చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన థాట్ వర్క్స్ రూ.11.10 లక్షలు, శాన్ డిస్క్ రూ.9.10 లక్షల వేతనాలతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. అత్యధికంగా విప్రోకు 192 మంది, క్యాప్ జెమినీకి 109 మంది, ఇన్ఫోసిస్‌కు 78 మంది, టీసీఎస్‌కు 76 మంది, టెక్ మహీంద్రాకు 49 మంది ఎంపికయ్యారు.
243 మందికి ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్
243 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్‌కు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఇంటర్న్‌షిప్‌లో స్టైఫండ్ రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు అందుకోనున్నారు. ఇంటర్న్‌షిప్ ముగియగానే అదే కంపెనీలో ఉద్యోగంలో చేరతారు.
బ్రాంచిల ప్లేస్‌మెంట్స్ శాతాలు
ఈసీఈలో 95.10 శాతం, సీఎస్‌ఈలో 90.7 శాతం, కెమికల్ ఇంజినీరింగ్‌లో 61 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 57.5 శాతం విద్యార్థులు ప్లేస్‌మెంట్లు సాధించారు. కెమికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కోర్ గ్రూపునకు సంబంధించి ఉన్నత చదువులు చదివేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఆ గ్రూపుల్లో ప్లేస్‌మెంట్లు తక్కువగా ఉన్నాయి.
అమ్మ, నాన్న కష్టపడకుండా చూసుకుంటా
మాది అమలాపురం. ఇద్దరు అక్కలున్నారు. నాన్న సాయి ప్రసాద్ షాపు షాపునకు తిరిగి అగర్‌బత్తీలు అమ్ముతారు. అమ్మ రామలక్ష్మి టైలరింగ్ చేస్తుంది. తొలి ప్రయత్నంలోనే ఏడాదికి రూ.27 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాన్న కష్టపడకుండా చూసుకుంటా. ట్రిపుల్ ఐటీ నాలాంటి వందలాది మంది జీవితంలో వెలుగులు నింపింది.
– కూనపరెడ్డి అజయ్‌శంకర్, అమలాపురం, కోనసీమ జిల్లా
అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాం
ట్రిపుల్ ఐటీలో చేరే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న ల్యాబ్‌లు దేశంలో ఏ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలోనూ లేవు. ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహిస్తూ ప్లేస్‌మెంట్లకు సిద్ధం చేస్తాం. ప్రముఖ కంపెనీలన్నీ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేలా చూస్తున్నాం.
– ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, నూజివీడు ట్రిపుల్ ఐటీ
Comments
Please login to add a commentAdd a comment