ప్రణాళిక లోపం.. విద్యార్థులకు శాపం | Srikakulam IIIT Has Facility Problems | Sakshi
Sakshi News home page

ప్రణాళిక లోపం.. విద్యార్థులకు శాపం

Published Mon, Jun 17 2019 10:43 AM | Last Updated on Mon, Jun 17 2019 10:47 AM

Srikakulam IIIT Has Facility Problems - Sakshi

నిర్మాణంలో అకడమిక్‌ బ్లాక్‌

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌: ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ప్రారంభించాలంటే అందుకు ప్రణాళిక ఎంతో కీలకం. బోధన సిబ్బంది నుంచి మౌలిక వసతుల వరకు అన్నింటా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించాలి. అలా చేయకపోతే శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలాగానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీకాకుళంలో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రధాన సమస్య వసతి. వాస్తవంగా ఎస్‌ఎంపురంలో అప్పటికే 500 మంది విద్యార్థులు వసతి, తరగతి నిర్వహణ సామర్థ్యం ఉన్న భవనాల్లో ప్రారంభించారు.

లేదంటే ఇప్పటికీ ఇక్కడ తరగతులు నిర్వహన సాధ్యం అయ్యేది కాదు. 2016 అక్టోబర్‌ 10న శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపప చేశారు. 200 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. కనీసం 1000 మంది సామర్థ్యం గల భవనాలను మాత్రం నిర్మించలేకపోయారు. వాస్తవానికి ట్రిపుల్‌ ఐటీ ప్రారంభం నుంచి పక్కాగా బడ్జెట్‌ కేటాయింపులు, సామర్థ్యం ఉన్న సంస్థలకు టెండర్ల అప్పగింత, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపులు చెయ్యలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రణాళిక లోపమే ఇప్పుడు విద్యార్థులకు శాపమవుతోంది.

నాలుగో బ్యాచ్‌కు నొటిఫికేషన్‌
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో నాలుగో బ్యాచ్‌కు నొటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ మేరకు ఆగస్టు 9న తరగతులు ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1000 మంది సామర్థ్యం గల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ భవనాలు నిర్మాణం పూర్తయితేనే ఇక్కడ తరగతుల నిర్వహణ సాధ్యమవుతుంది. రూ.33 కోట్లు భవనాలకు అంతర్గత పనులు నిర్వహిస్తున్నారు. 45 రోజుల్లో ఈ భవనాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్‌ సామర్థ్యం, అధికారుల పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం.

మరో పక్క శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ పారిపాలన, రెండు బ్యాచ్‌లకు తరగతులు నూజివీడులోనే సాగుతున్నాయి. విద్యార్థులు, బోధన సిబ్బంది శ్రీకాకుళం రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ సౌకర్యాలు, తాగునీటి, రన్నింగ్‌ నీటి సౌకర్యం సైతం ప్రధాన సమస్యగా ఉన్నాయి. మరో పక్క ఇక్కడి బోధన సిబ్బందిని అక్కడికి బదిలీ చేసినా వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు. అధికారులు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అధికారులు, విద్యార్థులు, బోధన సిబ్బంది అందరూ ఒక్కచోట ఉంటేనే ట్రిపుల్‌ ఐటీలో విద్యా ప్రమాణాల ప్రగతి సాధ్యమవుతుంది.  శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన అన్ని బ్యాచ్‌ల నిర్వహణ ఎప్పటికి సాధ్యమవుతుందో నిరీక్షించాల్సిందే.

మూడు బ్యాచ్‌ల్లో ప్రవేశాలు.. ఒక బ్యాచ్‌కు నొటిఫికేషన్‌
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి ఇప్పటికి మూ డు బ్యాచ్‌లకు ప్రవేశాలు కల్పించారు. ఈ ఏడాది ప్రవేశాలకు నొటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్టు 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
మొదటి బ్యాచ్‌ 2016–17 
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి మొదటి బ్యాచ్‌ 1000 మందికి 2016–17లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశాలు కల్పించిన నాటి నుంచి నూజివీడులో తరగతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంజినీరింగ్‌ రెండో ఏడాదికి చేరుకున్నారు. పేరుకు శ్రీకాకుళం విద్యార్థులు అయినా శ్రీకాకుళం క్యాంపస్‌ సైతం వీరికి తెలీదు.
రెండో బ్యాచ్‌ 2017–18
ఈ బ్యాచ్‌లో 1000 మందికి ప్రవేశాలు కల్పించారు. ప్రారంభంలో నూజివీడులో తరగతులు ప్రారంభించారు. ఏడాది పాటు అక్కడ తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం 2018 జనవరిలో ఇక్కడికి షిప్టు చేశారు. ఎప్‌ఎం పురం గురుకులంలో 500 మంది బాలికలకు, చినరావుపల్లిలో అద్దెకు తీసుకున్న మిత్రా ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లో బాలురు 500 మందికి తరగతులు నిర్వహిస్తుంచారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంజినీరింగ్‌ మొదటి ఏడాదికి చేరుకున్నారు. ఈ ఒక్క బ్యాచ్‌ మాత్రమే శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో సాగుతోంది. ఇంజినీరింగ్‌ ప్రవేశాలు పొందిన ఈ విద్యార్థులకు ప్రస్తుతం ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.
మూడో బ్యాచ్‌ 2018–19
గత ఏడాది ఆగస్టులో 1000 మందితో ఈ బ్యాచ్‌ ప్రారంభించారు. మొదటి సంవత్సరం పీయూసీ నుంచి రెండో ఏడాదికి విద్యార్థులు చేరుకున్నారు. శ్రీకాకుళంలో అద్దె భవనాలు తీసుకోని ఇక్కడికి విద్యార్థులను తరలించాలని ప్రయత్నించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ శివానీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ భవనాలు అద్దెకు తీసుకున్నారు. అయితే తరలింపు మాత్రం సాధ్యం కాలేదు. ఎప్పటికి తరలిస్తారో తెలీని పరిస్థితి కొనసాగుతోంది. ఈ కళాశాలలో ప్రస్తుతం ఎన్నికల సామగ్రి ఉంది.

ప్రయత్నిస్తున్నాం
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన అన్ని బ్యాచ్‌లకు తరగతులు ఇక్కడ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. భూ సేకరణలో సమస్యల వల్ల భవనాల నిర్మాణం అనుకున్నంత వేగంగా ముం దుకు సాగలేదు. ప్రస్తుతం 200 ఎకరాలు ప్రభుత్వ అప్పగించింది. మూడు బ్యాచ్‌ల్లో ఇక్కడ ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది తరగతులు జరుగుతున్నాయి. పీయూసీ రెండో ఏడాది బ్యాచ్‌ శివానీకి షిఫ్ట్‌ చేస్తాం. ప్రస్తుతం ఆగస్టు 9 నుంచి తరగతులు ప్రారంభించే బ్యాచ్‌ ఇక్కడే ప్రారంభిస్తాం. ఇంజినీరింగ్‌ రెండో ఏడాది బ్యాచ్‌ కోసం తాత్కాలిక భవనాలు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాదిలో నాలుగు బ్యాచ్‌లు ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం.
- ప్రొఫెసర్‌ ఎస్‌.హరశ్రీరాములు, డైరెక్టర్, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

నిర్మాణంలో వసతి గృహ సముదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement