బోధకులెక్కడ?
బోధకులెక్కడ?
Published Fri, Sep 2 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ట్రిపుల్ ఐటీలను పీడిస్తున్న బోధన సిబ్బంది కొరత
తాత్కాలిక మెంటార్లు, లెక్చరర్లే గతి
ఉద్యోగ భద్రత లేక వారూ వెళ్లిపోతున్నారు
విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి
పట్టించుకోని ఆర్జీయూకేటీ పాలకులు
మహానేత వైఎస్సార్ ఆశయాలకు తూట్లు!
నూజివీడు:
పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలను బోధన సిబ్బంది కొరత పీడిస్తోంది. ఏర్పాటు చేసి ఎనిమిదేళ్ళైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు బోధన సిబ్బంది పోస్టుల భర్తీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో ఏర్పాటు చేసిన నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలలో పనిచేస్తున్న మెంటార్ల, లెక్చరర్ల కొరతతో పాటు, వారికున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
ముఖం చాటేస్తున్న మెంటార్లు
ఇక్కడ విద్యార్థులకు బోధించే ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో భాగంగా మొదటి రెండేళ్ళు పియూసీ కోర్సులను, తరువాత నాలుగేళ్ళు ఇంజినీరింగ్ కోర్సుల్లో నిపుణులుగా తయారుచేస్తారు. పీయూసీ విద్యార్థుల కోసం 230 మంది మెంటార్లను నియమించగా, వీరిలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం రెండు క్యాంపస్‌లలో కలిపి 100 మంది మెంటార్లు, మాత్రమే ఉన్నారు. లెక్చరర్ల కొరత అయితే చెప్పనవసరమే లేదు. ఇంజినీరింగ్ కోర్సులకు ఉన్న కొరతను అధిగమించడానికి ట్రిపుల్‌ఐటీలోనే కోర్సు పూర్తిచేసిన విద్యార్థులను టీచింగ్ అసిస్టెంట్‌ల పేరుతో తాత్కాలిక పద్ధతిలో నియమించుకుంటున్నారు.
పరిష్కారం చూడరా?
ట్రిపుల్‌ఐటీలలో మెంటార్లు, లెక్చరర్లు అడుగడుగునా సమస్యలే. ఎనిమిదేళ్లు గడిచినా ఇంతవరకు ఉద్యోగభద్రత లేదు. వారిని పర్మినెంట్ చేయలేదు. దీంతో వారిలో ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం, ఆసక్తి రానురాను తగ్గిపోతోంది. బోధకుల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కడం లేదు. దీని పరిష్కరానికి ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని పలు బ్రాంచిలలో లెక్చరర్, విద్యార్థుల నిష్పత్తి 1:100గా ఉంటోంది. పియూసీలో కూడా లెక్చరర్, విద్యార్థుల నిష్పత్తి 1:80వరకు ఉంది. బోధన సిబ్బంది కొరత ఇలా ఉంటే బోధనాసిబ్బందికి తెలియకుండానే ఉన్నతాధికారులు ప్రతిఏటా కరిక్యులమ్ మారుస్తూ మరింత ఒత్తిడి గందరగోళం పెంచుతున్నారు.
అదనంగా శ్రీకాకుళం,ఒంగోలు ట్రిపుల్‌ఐటీల భారం
ఉన్నవాటినే సిబ్బంది కొరత వెంటాడుతుంటే ప్రభుత్వం శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలను ప్రారంభించి మెంటార్లు, లెక్చరర్లపై అదనపు భారం మోపింది. ఈ నేప«థ్యంలో ట్రిపుల్ ఐటీల్లో నాణ్యత ప్రమాదంలో పడిందనే ఆందోళనలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement