మంకీపాక్స్‌పై సర్కారు అలర్ట్‌ | Govt alert on monkeypox | Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌పై సర్కారు అలర్ట్‌

Published Wed, Aug 28 2024 5:03 AM | Last Updated on Wed, Aug 28 2024 5:34 AM

Govt alert on monkeypox

అనుమానిత కేసులుంటే వివరాలివ్వాలని ఆదేశం 

వ్యాధి సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచాలని స్పష్టీకరణ 

ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రులు 

మరోవైపు రాష్ట్రాన్ని వణికిస్తున్న డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు 

ఈ ఏడాది ఇప్పటివరకు 5,372 డెంగీ కేసులు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: మంకీపాక్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకాన్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి, అలసట, చర్మంపై పాపుల్స్‌గా మారే మాక్యులోపాపులర్‌ దద్దుర్లు వంటివి ఉంటే అనుమానిత కేసులుగా పరిగణిస్తారు. 

మంకీపాక్స్‌ సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల వరకు ఉండే వ్యాధి. పిల్లలలో ఎక్కువగా సంభవిస్తాయి. మంకీపాక్స్‌ కేసు మరణాలు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. గత 21 రోజులలో మంకీపాక్స్‌ ప్రభావిత దేశాల నుంచి వచి్చన ఏ వ్యక్తి అయినా తీవ్రమైన దద్దుర్లతో బాధపడుతుంటే అనుమానించాలని పేర్కొంది. వారితో కలిసివున్న వారిని కూడా గుర్తించాలి. మంకీ పాక్స్‌ అనేది మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలతో ఉంటుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తద్వారా మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవగాహన, వేగంగా కేసులను గుర్తించడం, ఇన్ఫెక్షన్‌ నియంత్రణ చర్యలు అవసరమని పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

అనుమానిత కేసులు గుర్తిస్తే గాం«దీకి పంపాలి 
మంకీ పాక్స్‌ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. మెడికల్‌ కాలేజీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్‌కు సంబంధించిన రోగుల కోసం ఐసోలేషన్‌ బెడ్‌లను కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటికే గాం«దీ, ఫీవర్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను కేటాయించిన సంగతి తెలిసిందే. అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. 

అనుమానిత కేసులు ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలి. అలాగే హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా వచ్చే అంతర్జాతీయ అనుమానిత ప్రయాణీకులుంటే వారిని రంగారెడ్డి డీఎంహెచ్‌వోతో సమన్వయం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. కాగా 1970లో డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో మంకీపాక్స్‌ మొదటి మానవ కేసు నమోదైంది. 

వణికిస్తున్న డెంగీ 
రాష్ట్రంలో డెంగీ విస్తరిస్తోంది. గతేడాది కంటే ఇప్పుడు అధికంగా సీజనల్‌ వ్యాధులు సంభవిస్తున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ రవీంద్రనాయక్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 1.42 కోట్ల ఇళ్లను వైద్య బృందాలు సందర్శించాయి. 4.40 కోట్ల మందిని స్క్రీనింగ్‌ చేశారని ఆయన తెలిపారు.

అందులో 2.65 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు రవీంద్ర నాయక్‌ వెల్లడించారు. వర్షాల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దోమల సంతానోత్పత్తి పెరిగి డెంగీ విజృంభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మొత్తం 81,932 మంది రక్త నమూనాలను పరీక్షించగా, అందులో 5,372 మంది డెంగీ సోకినట్లు వెల్లడించారు. పాజిటివిటీ 6.5 శాతంగా ఉందని వెల్లడించారు. 

డెంగీ హైరిస్క్‌ జిల్లాల్లో హైదరాబాద్‌ 1,872 కేసులతో మొదటిస్థానంలో ఉంది. సూర్యాపేట 471, మేడ్చల్‌ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్లగొండ 315, నిజామాబాద్‌ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్‌ జిల్లాల్లో 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ పది జిల్లాలను రాష్ట్రంలో హైరిస్క్‌ జిల్లాలుగా ప్రకటించారు. 

చికున్‌గున్యా కేసుల్లోనూ హైదరాబాద్‌ టాప్‌ 
మరోవైపు చికున్‌గున్యా కేసులు కూడా నమోదవు తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,673 మంది రక్తనమూనాలను పరీక్షించగా, 152 మందికి చికున్‌గున్యా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివిటీ రే టు 5 శా తంగా ఉండటం గమనార్హం. చికున్‌గున్యా హైరిస్క్‌ జిల్లాలుగా హైదరాబాద్‌ 61 కేసులతో మొ దటిస్థానంలో ఉంది. వనపర్తి 17, మహబూబ్‌నగర్‌ జిల్లా లో 19 నమోదయ్యాయి. 

ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా కోసం 23.19 లక్షల మంది నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా, అందులో 191 మలేరియా కేసులు నమోదయ్యాయి. పాజిటి విటీ రేటు 0.008 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో టీ æ– హబ్‌ ల్యాబ్స్‌ పనిచేస్తున్నాయి. వాటిల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 53 బ్లడ్‌బ్యాంకులు అవసరమైన బ్లడ్‌ యూనిట్లతో సిద్ధంగా ఉన్నాయని డీహెచ్‌ రవీంద్రనాయక్‌ తెలిపారు. మొత్తం 33 జి ల్లాల్లో 108 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులన్నీ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు. 

కట్టడిలో వైఫల్యం... 
సీజనల్‌ వ్యాధులను కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దోమల నియంత్రణకు ఇతర శాఖలను సమన్వయం చేయటంలో వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో దోమలు పెరిగాయని చెప్తున్నారు. 

వానాకాలం మొదలయ్యే సమయానికి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. కానీ అవేవీ చేయలేదు. పైగా కీలకమైన సమయంలో బదిలీలు జరగడం, అవి కూడా సక్రమంగా నిర్వహించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలు చేయాల్సి రావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్‌ వ్యాధులపై దృష్టిసారించలేకపోయారు. మరో వైపు పారిశుధ్యం లోపించిందని అంటున్నారు. 

సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయలేదని, నివారణ చర్యల పట్ల ప్రచారం చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మందుల కొరత నెలకొందనీ, సాధారణంగా సీ జనల్‌ వ్యాధులకు ముందే అన్ని ఆసుపత్రుల్లో బఫర్‌ స్టాక్‌ ఉంచుకో వా లని సూచిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్‌ కూడా పూర్తిస్థాయిలో జరగడంలేదనీ, నిల్వ నీటిల్లో స్ప్రేయింగ్‌ చేయడంలేదని వైద్యనిపుణులు ఆరోపిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement