కోవిడ్ తర్వాత పెనుముప్పుగా పరిణామం
భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రధాన ప్రజారోగ్య సమస్యగా...
వాతావరణ మార్పులు, పట్టణీకరణ, వలసలు, మౌలిక వసతులలేమి కారణం
దేశంలో మళ్లీ కలరా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి
ప్రజారోగ్య ప్రమాదాలను ముందుగా గుర్తించడంలో ఇప్పటికీ మనం వైఫల్యం
నేటికీ భారత్ వంటి దేశాలను అప్రమత్తం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
త్వరలో డెంగీకి వ్యాక్సిన్ వస్తుందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది.
ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్‌లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.
ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి.
ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.
దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరం
భారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్‌లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి.
అలాగే థాయ్‌లాండ్‌లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు.
ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.
27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు
సోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా.
కాగా, ఇన్‌ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్‌లో 2023 ఆగస్టులో, థాయ్‌లాండ్‌లో అక్టోబర్‌లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్‌లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.
ఇంకా ఆ సంస్థపైనే ఆధారం..
ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు.
2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది.
అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.
ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్
ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్‌లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది.
వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment