ఒకేసారి 4 వేరియంట్ల దాడి | World Health Organization warning | Sakshi
Sakshi News home page

ఒకేసారి 4 వేరియంట్ల దాడి

Published Mon, Jun 24 2024 5:58 AM | Last Updated on Mon, Jun 24 2024 5:58 AM

World Health Organization warning

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు

ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక 

పట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణ 

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

ఈ సీజన్‌లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.

డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం.   – సాక్షి, హైదరాబాద్‌

వైద్య పరీక్షలే కీలకం 
డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. 
విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. 
ప్లేట్‌లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. 
డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. 

ఎలక్ట్రాల్‌ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. 
 వైరల్‌ ఫీవర్‌ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. 

దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. 
స్కూల్‌ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. 
కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్‌ ఫీవర్‌ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్‌లెట్లు పడిపోకుండా  ఉంటుంది.

డెంగీ లక్షణాలు
డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.
కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. 
చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు,  కీళ్ల నొప్పులు ఉంటాయి. 
అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.

ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదు
ఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్‌ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్‌ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...
ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్‌లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. 

కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్‌లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్‌లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement