అక్కడ నివసించే జనాభా 65 లక్షల మంది
పరిస్థితిని సమీక్షించిన వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి
ఒక్క జూలై నెలలో 800 డెంగీ కేసుల వరకు నమోదైనట్టు నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.
42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది.
జూలై నెలలోనే 800 కేసులు
వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment