సాక్షి, హన్మకొండ : విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, వైరల్ ఫీవర్లతో పల్లెలు మంచం పట్టాయి. వైద్యం కోసం వస్తున్న వారితో ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల కారణంగా మరణాలు సైతం చోటు చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో మంచాలు సరిపోక రోగులను నేలపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా అన్ని పీహెచ్‌సీల్లో ఓపీ పేషెంట్ల సంఖ్య పెరిగింది. అయితే విజృంభిస్తున్న జ్వరాలకు అనుగుణంగా వైద్య శిబిరాల సంఖ్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పెంచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విషజ్వరాలకు తోడు.. చికున్‌గున్యా
ఏటూరునాగారం మండలం రొయ్యూరు, గంగారం, బుట్టాయిగూడెం గ్రామాలతో పాటు నర్సంపేట మండలం రాజుపల్లి, నెక్కొండ మండలం ఫణికర, నర్మెట మండలం ఆగాపేట ఎస్సీ కాలనీ, రఘునాథపల్లి మండలం ఖిలేషాపురం గ్రామ శివారు దుబ్బతండాలతో పాటు జనగామ మండలం మరిగేడు పంచాయతీ పరిధిలోని తండాల్లో సగానికి పైగా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. విషజ్వరాలకు తోడు చికున్‌గున్యా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. వర్థన్నపేట మండలం కట్య్రాల గ్రామ పరధిలోని కుమ్మరి గూడెంలో చికెన్‌గున్యా లక్షణాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన పదిహేను రోజులుగా ఈ గ్రామంలో జ్వరంతో పాటు కీళ్లు, ఒంటి నొప్పులతో బాధ పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే వైద్యాధికారులు ఈ విషయంపై శ్రద్ధ చూపించకపోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మొక్కుబడిగా ఆరోగ్య శిబిరాలు
ఓ వైపు గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో తక్షణం స్పందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ.. మొక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నది. నెల్లికుదరు మండలం నైనాల, నర్సింహులుపేట మండలం మచ్చర్ల గ్రామాల్లో ఇంటికి ఒక్కరిద్దరు వంతున వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది కేవలం ఒకే ఒక్క రోజే హెల్త్‌క్యాంప్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు.
అరకొర సౌకర్యాలు
ఏరియా ఆస్పత్రిల్లో మౌలిక సదుపాయల కొరత రోగులను ఇబ్బంది పెడుతున్నది. రోగులకు సరిపడా మంచాలు లేకపోవడంతో నర్సంపేట సివిల్ ఆస్పత్రిలో ఒకే మంచంలో ఇద్దరిని ఉంచి వైద్య సేవలు అందిస్తుండగా ఎంజీఎం ఆస్పత్రిలో ఏకంగా కిందనే బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక పరకాల, డోర్నకల్ ఆస్పత్రులో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ ఆస్పత్రులో ఉంటే తాము రోగాల బారిన పడతామోమనని రోగుల బంధువులు భయపడుతున్నారు. పట్నాల్లో ఏరియా ఆస్పత్రులు ఇలా ఉంటే వీటికి తక్కువ కాదు అన్నట్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దర్శనం ఇస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ గుంతలమయమైన రోడ్లపై నుంచి ప్రయాణిస్తూ ఆస్పత్రులకు రోగులు చేరుకుంటున్నా వారికి పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందని ద్రాక్షలానే మారుతోంది.
జిల్లాలో ఉన్న చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బుధవారం ‘న్యూస్‌లైన్’ విజిట్ చేసినప్పుడు లింగాలఘన్‌పూర్, ఆత్మకూరులతో పాటు కురవి మండలం బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రాలేదు. అక్కడున్న ఏఎన్‌ఎంలు రోగులను పరిశీలించి మందులు ఇస్తున్నారు.