పంజా విసిరిన డెంగీ | People suffering with Toxic fevers | Sakshi
Sakshi News home page

పంజా విసిరిన డెంగీ

Published Thu, Sep 6 2018 3:57 AM | Last Updated on Thu, Sep 6 2018 3:57 AM

People suffering with Toxic fevers - Sakshi

విశాఖ కేజీహెచ్‌ చిన్నపిల్లల వార్డులో ఒకే మంచంపై నలుగురు డెంగీ బాధిత పిల్లలు చికిత్స పొందుతున్న దృశ్యం

రాష్ట్రంపై డెంగీ పంజా విసిరింది. విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు కాగిపోతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని జిల్లాలు మంచానపడ్డాయి. పలు ప్రాంతాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు.. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అనధికారికంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. వేలాది మంది రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పలు ఆస్పత్రుల్లో పడకలు సరిపోక నేలపైనే రోగులను పడుకోపెట్టి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో రోజురోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి, నెట్‌వర్క్‌: విషజ్వరాలతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో గత రెండు నెలల్లో డెంగీ, మలేరియా బారినపడి 23 మందికిపైగా మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వీటిని సహజ మరణాలుగానే రికార్డుల్లో నమోదు చేస్తూ.. తీవ్రతను కప్పిపుచ్చే చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 217 మంది మలేరియాతోనూ, 55 మంది డెంగీతోనూ బాధపడుతున్నారని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో అయితే విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది 87 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, ఇతర విషజ్వరాలతో ఇప్పటివరకు 70 మందికిపైగా ప్రాణాలొదిలారు.

ఒక్క డెంగీతోనే 30 మంది ప్రాణాలు విడిస్తే.. వైద్యాధికారులు మాత్రం ఇద్దరే చనిపోయారని చెబుతున్నారు. విజయనగరం అర్బన్, నెల్లిమర్ల, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, గుర్లలో డెంగీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా కేసులు, 1,100 టైఫాయిడ్‌ కేసులు, 21,800 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 1,660 డెంగీ కేసులు నిర్ధారణయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం డెంగీ మరణాల సంఖ్య వందకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా రోజుకు ఇద్దరు, ముగ్గురు డెంగీతో మృతి చెందుతున్నట్లు సమాచారం. డెంగీ బాధితుల కోసం కింగ్‌ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్‌)లో ప్రత్యేకంగా పది పడకలు ఏర్పాటు చేశారు. కానీ రోజుకు 20 మందికి పైగా రోగులు వస్తుండడంతో.. వారిని ఇతర వార్డుల్లో ఉంచి వైద్యమందిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 22 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు.  

గజగజలాడుతున్న గోదావరి జిల్లాలు..
డెంగీ ధాటికి గోదావరి జిల్లాలు కూడా గజగజలాడుతున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశముంది. కానీ డెంగీ మరణాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. శనివారం జగ్గంపేట మండల మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూక రత్నం(53) డెంగీతో కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందగా.. వైద్య సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. కాకినాడ రూరల్‌లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదవ్వగా.. కాకినాడ నగరంలో 65 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు డెంగీతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ జిల్లాలో గత 3 నెలల్లో అధికారికంగానే 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏలూరు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, రాఘవాపురం, పెనుగొండ, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, లంకలకోడేరు, పెనుమంట్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి బాధితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతమున్న వార్డు సరిపోక.. మరో వార్డును అదనంగా కేటాయించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 169 మలేరియా కేసులు నమోదయ్యాయి. 

రాజధానిలోనూ దయనీయమే..  
కృష్ణా జిల్లాలోని నందిగామ, ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు జ్వరపీడితులున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సాధారణంగా రోజుకు దాదాపు 200 మంది రోగులు వస్తుండేవారు. కానీ విషజ్వరాల దెబ్బకు రోజుకు 350 మందికి పైగా రోగులు వస్తుండటంతో పడకలు చాలక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేలపైనే పడుకోపెట్టి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 డెంగీ, 100 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నందిగామ పట్టణానికి చెందిన మారం జయశ్రీ(18) అనే విద్యార్థిని, వెల్లంకికి ముండ్లపాటి నారాయణ(56) డెంగీతో మృతిచెందారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం గ్రామస్తులు 15 రోజులుగా విషజ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 87 డెంగీ, 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, నూతక్కి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లితో పాటు గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారికంగా 17 డెంగీ, 44 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 132 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 56 డెంగీ, వందకుపైగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలో 24 మంది డెంగీతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

డెంగీ నిర్ధారణపై ఆంక్షలు!
డెంగీ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విశాఖ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరికరాలున్నప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల కేజీహెచ్‌లోని ల్యాబ్‌కు వెళ్లాలని చెబుతున్నారు. దీంతో అక్కడి ల్యాబ్‌ రోగులతో కిటకిటలాడుతోంది. తీరా వ్యాధి నిర్ధారణయ్యేసరికి చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేజీహెచ్‌లో 4,574 మందికి పరీక్షలు నిర్వహించగా 1,660 మందికి డెంగీగా నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి ముగ్గురు అనుమానితుల్లో ఒకరికి డెంగీ నిర్ధారణ అవుతోంది. 

పెళ్లయిన 13 రోజులకే ప్రాణం తీసిన విష జ్వరం 
మాయదారి విష జ్వరం ఓ నవ వరుడిని మింగేసింది. విజయనగరంలోని పూల్‌బాగ్‌ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు(24) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 24న అతనికి పూల్‌బాగ్‌ కాలనీకి చెందిన మౌనికతో వివాహమైంది. జ్వరం రావడంతో ఈశ్వరరావును ఈ నెల 4న నెల్లిమర్ల మిమ్స్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యులు బుధవారం అతన్ని కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అక్కడకు తీసుకెళ్లేసరికే ఈశ్వరావు మృతి చెందాడు. పెళ్లయిన 13 రోజులకే వరుడు చనిపోవడంతో అతని భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

అవసరమైతే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తాం: సీఎం
సాక్షి, అమరావతి: పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రాకపోతే రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డెంగీ విజృంభణ నేపథ్యంలో బుధవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ.. విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దోమల బెడదను నివారించాలని, రక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. 

సీమలోనూ విషజ్వరాల విజృంభణ.. 
రాయలసీమలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 66 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ నెల 1న నార్పల గ్రామానికి చెందిన అనుష్క(8) మృతి చెందింది. ఇప్పటివరకు 164 మలేరియా, 66 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అనంతపురం అర్బన్, బుక్కరాయసముద్రం, ఎద్దులపల్లి, కురుకుంట ప్రాంతాల్లోని 30 గ్రామాల్లో డెంగీ తీవ్రత అధికంగా ఉంది. వైఎస్సార్‌ జిల్లాలోనూ 45 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఏడింటిని నిర్ధారించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఐదుగురికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం, నందికుంటకు చెందిన లీలావతి, లక్ష్మీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా, కర్నూలు గణేష్‌నగర్‌కు చెందిన లక్ష్మయ్య(21) అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి, పనుల నిమిత్తం కర్నూలుకు వచ్చిన కమలాకర్, ప్రకాష్‌(ఒడిశా) డెంగీతో బాధపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement