వ్యాధుల విజృంభణ | Heavy Rains Effect by Dengue, malaria, swine flu cases in Hospitals Full Rush | Sakshi
Sakshi News home page

వ్యాధుల విజృంభణ

Published Tue, Sep 27 2016 3:47 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

వ్యాధుల విజృంభణ

వ్యాధుల విజృంభణ

* పెరుగుతున్న డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసులు
* ఇప్పటివరకు 1,073 డెంగీ కేసులు నమోదు... ఇద్దరు మృతి
* బెంబేలెత్తుతున్న జనం... ఆస్పత్రులు కిటకిట

సాక్షి, హైదరాబాద్: వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పారిశుద్ధ్యం లోపించింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో  సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ కేసులూ నమోదవుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదని, పూర్తిస్థాయిలో మందులులేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల  హెదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలుడు, అంబర్‌పేటకు చెందిన 22 ఏళ్ల యువతి డెంగీతో చనిపోయారు. సర్కారు లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 1,073 డెంగీ కేసులు, 2,435 మలేరియా కేసులు, 31 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. సాధారణ విషజ్వరాలు దాదాపు 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రంలో 45 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు నిలువుదోపిడీకి తెగబడ్డాయి. 20 వేల నుంచి 50 వేలలోపున్న ప్లేట్‌లెట్లు ఉన్నవారికి కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నాయి.
 
మందులకు నిధుల కొరత
రాష్ట్రంలో 750 పీహెచ్‌సీలు, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 30 ఏరియా ఆస్పత్రులు, 7 జిల్లా ఆస్పత్రులున్నాయి. వాటికి రోజువారీగా  దాదాపు 330 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. దీనికోసం సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో మందులను తీసుకెళ్లాలి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో అవసరమైన స్థాయిలో మందులు లేవని అంటున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులందరికీ మందులిచ్చే పరి స్థితి లేకపోవడంతో బయట కొనుక్కోవాల్సి వస్తోంది. రెండో త్రైమాసికం పూర్తి కావస్తున్నా నిధులు విడుదల చేయలేదు.
 
అయితే అన్ని మందులను అందుబాటులో ఉంచామని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు తెలిపారు. ‘ఆన్‌లైన్‌లో ఏమేమి ఉన్నాయో ఆ ప్రకారం పీహెచ్‌సీలు ఇండెంట్ పెట్టుకొని తీసుకెళ్లవచ్చు. తీసుకెళ్లలేదంటే అది వాళ్ల సమస్యే. దానికి మేం బాధ్యులం కాదు. డిమాండ్‌ను బట్టి రోగులందరికీ మందులు ఇవ్వడం సాధ్యంకాదు. మా బడ్జెట్ ప్రకారమే మందులు కొనుగోలు చేస్తాం. అయినా మందులు లేవంటూ మాకు ఫిర్యాదులు రాలేదు’ అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement