సాక్షి, అనంతపురం : జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా తదితర జ్వరాలతో జనం విలవిలలాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. రోజుల తరబడి తగ్గకపోవడంతో చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థితి బాగోలేని వారు మాత్రం మంచాలపైనే మగ్గిపోతున్నారు. కొంత మందికి రక్త పరీక్షలు చేసినా ఏ జ్వరమో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో డెంగీ లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువవుతోంది. జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా డెంగీ లక్షణాలు కనిపించాయి.
అయితే అధికారుల లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పది కేసులు నమోదైనట్లు అనంతపురం వైద్య కళాశాల అధికారులు చెబుతుండగా, కాదు 15 కేసులు నమోద య్యాయంటూ డీఎంెహ చ్‌ఓ రామసుబ్బారావు సోమవారం ప్రకటించారు. ఈ లెక్కలు ఎలాగున్నా.. డెంగీ పేరు చెప్పగానే జిల్లా ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది కూడా విష జ్వరాల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. ప్రస్తుతం రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నాయి.
మలేరియా బాధితుల నుంచి రోజుకు రూ.1000 నుంచి రూ.1,500 వరకు గుంజుతున్నాయి. విష జ్వరాల బాధితులు రూ.2,500 వరకు, టైఫాయిడ్ రోగులు రూ.800 నుంచి రూ.1,100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు రక్త పరీక్షల కోసం మరో రూ.1000 వరకు అవుతోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. దాదాపు 18 పీహెచ్‌సీలలో వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది పీహెచ్‌సీలు ఉండగా, ఇందులో పెద్ద కౌకుంట్లతో పాటు వుూడు 24 గంటల పీహెచ్‌సీలకు రెగ్యులర్ వైద్యాధికారులు లేరు. పీహెచ్‌సీలలో పనిచేసే వైద్యులు ఎక్కువగా పట్టణాల్లో కాపురముంటున్నారు. ప్రైవేటు ప్రాక్టీసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలున్నాయి.
కానరాని ముందస్తు చర్యలు
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రతియేటా ప్రకటిస్తూనే ఉన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం వ్యాధుల వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో లక్షన్నరకు పైగా జ్వరాల కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో మలేరియా కేసులు 300 వరకు ఉన్నాయి. గోరంట్ల మండలం మిషన్‌తండా, గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాంలో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంది.
పక్కదారి పడుతున్న పారిశుద్ధ్య నిధులు
గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్లే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం నిధులిస్తున్నా.. వాటిని వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో ఓ ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయన మరో రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో అందిన కాడికి దోచుకుని.. సొంత నర్సింగ్‌హోంను మరింత అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
జిల్లాలోని 80 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీల (కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు) పరిధిలో 568 ఉప కేంద్రాలు ఉన్నాయి. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో సబ్ సెంటర్‌కు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను ఎక్కడా సద్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఎక్కువ శాతం నిధులను ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి భోంచేయగా, మిగిలినవి సిబ్బంది స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ లక్షణాలుంటే వైద్యున్ని సంప్రదించాలి
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విపరీతమైన జ్వరానికి లోనుకావడం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పి ఉంటే డెంగీ లక్షణాలుగా అనుమానించాలి. పారాసిటమాల్ తప్ప మరే మందులూ వినియోగించకూడదు. రెండో రోజూ జ్వరం తీవ్రత అలాగే ఉంటే.. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. సర్పజన ఆస్పత్రితో పాటు ప్రైవేటు ల్యాబులలో ఈ సౌకర్యం ఉంది. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో డీ హైడ్రేషన్ (నీటిని కోల్పోవడం) వల్ల మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల్లో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి సంఖ్య ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
మంచం పట్టిన అనంత జనం
Published Tue, Jul 22 2014 4:17 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement