సాక్షి, హైదరాబాద్: ‘డెంగీ విజృంభణకు నిర్లక్ష్యం కారణమని తేలితే క్రిమినల్ చర్యగా పరిగణించాలా? నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణమైతే ఎవరిది బాధ్యత? మృతుల కుటుంబా లకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని భావిస్తారేమో.. ఐఏఎస్ అధికారుల జేబుల నుంచే ఇవ్వాల్సి వస్తుంది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలివ్వగలం. ఐఏఎస్‌లకు శిక్షణ ప్రజల డబ్బుతోనే ఇస్తారు. వారు రోగాలతో బాధలు పడుతుంటే పట్టించుకోకపోతే ఎలా.. ఒక్కసారి మూసీ నది ఒడ్డుకు మీరు వెళితే ఎంత దారుణమైన పరిస్థితుల నడుమ జనం ఉన్నారో కనబడుతుంది.’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి, ఇతర ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా, వంటి విషజ్వరాలతో బాధపడేవాళ్లకు సర్కార్ వైద్యం అందేలా ఆదేశాలివ్వాలని వైద్యురాలు ఎం.కరుణ, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సీఎస్‌తోపాటు ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ స్వయంగా హాజరయ్యారు. హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి సీఎస్ నేతృత్వం వహించాలని, ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో, నివారణ చర్యలు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.
కోర్టు మెట్లు ఎక్కేవారు కాదు
‘ఉన్నతాధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే కోర్టు మెట్లు ఎక్కరు. ఇక్కడున్న సీనియర్ ఐఏఎస్‌లు మూసీ నదికి వెళ్లి చూస్తే అది ఎంత పెద్ద దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిందో చూడొచ్చు. హైకోర్టు పక్కనే ఉన్న మూసీ కలుషితం కావడం వల్ల దోమలు కోర్టులోని వాళ్లను కుడుతున్నాయి. రోజూ పత్రికల్లో ప్రతి పేజీలోనూ ప్రజల సమస్యలు, జనం రోగాల గురించి కథనాలు వస్తున్నాయి. మీరు పత్రికలు చడవడం లేదా లేక చదివినా స్పందించడం లేదా.. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలను ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టింది. సగటు జీవి సణుగుడు అర్థం చేసుకోండి’అని ఘాటుగా కోర్టు వ్యాఖ్యానించింది.
వర్షాలు మొదలయ్యాక చర్యలా?
కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ ప్రారంభమైన వెంటనే సీఎస్ జోషి.. హైకోర్టు సూచనల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, 30 రోజులకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 12,751 గ్రామాల్లో నిరంతరం వాటన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. గడిచిన నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఎప్పట్నుంచి అమలు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే.. సెప్టెంబర్ నెల మధ్యలో అమలు మొదలైందని సీఎస్ చెప్పారు. జూన్‌లో వర్షాలు మొదలైతే సెప్టెంబర్ నెల సగం అయ్యే వరకూ ఎందుకు ఆగుతున్నారని అడిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని సీఎస్ చెప్పిన జవాబు పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి
ప్రజారోగ్యానికి ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటని, రాజ్యాంగంలో ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి అని చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి జిల్లాల్లో భూకంపం వంటి విపత్తు సంభవిస్తే ఇలాగే చెబుతారా అని నిలదీసింది. చిన్న దేశం శ్రీలంకలో డెంగీ, మలేరియాలను పూర్తిగా నిర్మూలించాలని 2016లో లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని, మనం కనీసం హైదరాబాద్ జంట నగరాల్లో ఆవిధంగా చెయ్యలేమా అని ప్రశ్నించింది. భోపాల్, ఉదయ్‌పూర్ వంటి నగరాలు పరిశుభ్రతకు చిరునామాగా ఉన్నాయని, ఉదయపూర్‌లో 8 సరస్సులున్నాయని, అక్కడ డెంగీ వంటి మాటే వినపడదని పేర్కొంది. చివరకు డెంగీతో ఒక జడ్జి కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరి
విచారణ మధ్యలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని ఫాగింగ్ మెషీన్లు రెట్టింపు చేశామని, అత్యవసర ప్రదేశాల్లో 70 మెషీన్లతో పాటు వాహనాల ద్వారా కూడా ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. మీరు చెబుతున్న ఫాగింగ్ మెషీన్ల సంఖ్యలోనే తేడాలున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరిపోతుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్ పరిసరాల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలు 427 ఉన్నాయని, బ్రీడింగ్ సెంటర్ 401 ఉన్నవాటిని 235కు తగ్గించామని ఏజీ చెప్పబోతుంటే వర్షాకాలం ప్రారంభంలో దోమల నివారణ చర్యలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, లార్వా దశలోనే నాశనం చేసేలా ప్రణాళికలుండాలని సూచించింది.
అయినా కేసులు పెరిగాయి..
రూరల్ ఏరియాలో 1,09,780 ప్రాంతాల నుంచి వ్యర్థాలను తొలగించారని, 2.79 లక్షల ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలను తొలగించారని, నిరుపయోగంగా ఉన్న 16,380 బావుల్ని తొలగించామని సీఎస్ జోషి చెప్పగానే.. సీజే కల్పించుకుని చాలా సంతోషమని, అయినా డెంగీ కేసులు పెరిగినట్లుగా ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ వివరాల్ని సరిగ్గా తయారు చేయలేదని సీఎస్ చెప్పగానే, జనవరిలో వంద కేసులుంటే ఇప్పుడు 2 వేల కేసులకు పెరిగాయని ధర్మాసనం గుర్తు చేసింది. మరో ఐఏఎస్ అధికారి అరవింద్.. మంత్రి తలసాని నేతృత్వంలో ఒక సబ్ కమిటీ రెండు సార్లు సమావేశమైందని చెప్పారు.
కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వాహనాల ద్వారా ఎన్ని టన్నుల చెత్త తొలగింపు చేస్తున్నది.. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ వివరించారు. గల్లీల్లో తిరిగేందుకు వీలుగా కొత్తగా 1,400 ఆటోల్ని కొనుగోలు చేశామని, చెత్తను క్రషింగ్ చేస్తున్నామని వివరించారు. ఇది హర్షించదగ్గ విషయమేనని, అయితే వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రణాళికలుండాలన్న కీలక విషయాన్ని మరిచిపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వెయ్యి పవర్ స్ప్రేయర్లు, 800 సాధారణ స్ప్రేయర్లు, ఫాగింగ్ వాహనాలు 60 ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తమ ఉత్తర్వుల్ని ఖాతరు చేయపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. మలేరియా, పోలియో వంటి వాటిని దాదాపు నివారించామని, డెంగీ విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment