డెంగీ పంజా ! | heavily spread dengue disease in agency areas | Sakshi
Sakshi News home page

డెంగీ పంజా !

Published Wed, Sep 17 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

heavily spread dengue disease in agency areas

భద్రాచలం/ ఖమ్మం వైరారోడ్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంపై డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులను సైతం ఈ వ్యాధి పొట్టన బెట్టుకుంటోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట డెంగీ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శత విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ, పారిశుధ్య లోపంతో దోమలు వ్యాప్తి చెందటంతో విషజ్వరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్యకేంధ్రాలు ఉండగా, వీటిలో 50 ఏజెన్సీలోనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ‘గ్రామ సందర్శన’ పేరుతో క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పటకీ, వ్యాధులు అదుపులోకి రావటం లేదు. గత నివేదికల ఆధారంగా ఏజెన్సీలో ఉన్న 46 పీహెచ్‌సీలను మలేరియా పీడిత ప్రాంతాలుగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు గుర్తించారు.

వీటి పరిధిలో ఉన్న 1116 గ్రామాలల్లో దోమల నివారణ కోసం స్ప్రేయింగ్ చేశారు. గతంలో దోమల మందు పిచికారీకి నిధుల కొరత ఉండేది. కానీ ఈ ఏడాది ఐటీడీఏ పీవో దివ్య ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా మలేరియా శాఖకు నిధుల సర్దుబాటు చేయటంతో దాదాపు అన్ని గ్రామాల్లో మొదటి  దశ స్ప్రేయింగ్ పూర్తి చేశారు. అయినా పారిశుధ్య లోపంతో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు అదుపులోకి రావటం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నాలుగు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

 కాటేస్తున్న కొత్తరకం వైరస్..
  ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏడాది కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందింది. భద్రాచలం మండలం గుండాల కాలనీలో రెండు నెలల వ్యవధిలో వరుసుగా ఆరుగురు మృతి చెందారు. దీనిపై పరిశోధనలు చేసిన నిపుణుల బృందం ‘ఆర్బోవైరస్’ కారణమని తేల్చింది. కానీ దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలనే దానిపై ఇప్పటి వరకూ అధికారులు దృష్టి సారించలేదు. తాగునీరు కలుషితం వల్లే దోమలు వ్యాప్తి చెంది కొత్తరకం వైరస్ వచ్చిందని వైద్యాధికారులు చెపుతున్నారు. ఇక ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీరు అందక ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు.  
 
డేంజర్ జోన్‌గా ముంపు పీహెచ్‌సీలు...
 ఏజెన్సీలోని 50 పీహెచ్‌సీలలో 45 కేంద్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి ప్రతి ఏటా దోమల మందు పిచికారీ చేస్తున్నారు. మలేరియా వ్యాధిని అదుపు చేసేందుకు 33 పీహెచ్‌సీలకు ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయం కూడా అందజేస్తోంది. అయితే ఇందులో 15 పీహెచ్‌సీలు మరింత డేంజర్‌జోన్‌గా ఉన్నాయి. వీటిలో చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, వీఆర్‌పురం మండలం రేఖపల్లి, జీడిగుప్ప, కూనవరం మండలం కూటూరు, వేలేరుపాడు మండలం కొయిదా వంటి పీహెచ్‌సీల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతాయి. జిల్లా మొత్తం మీద ఇప్పటి వరకూ సుమారుగా 1300 మలేరియా కేసులు నమోదు కాగా, పైన పేర్కొన్న పీహెచ్‌సీలలో 300 వరకూ ఉంటాయి.

 రెండు నెలల్లో 20 మంది మృతి...
 జిల్లాలో గడచిన రెండు నెలల్లో 20 మంది వరకు విషజ్వరాల బారిన పడి మరణించినట్లు తేలింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బొబ్బళ్లపాటి రవి రత్నప్రసాద్ వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ సోమవారం మతిృచెందారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఈ యేడాది ఆగస్టు నెలాఖరు నాటికి జిల్లాలో 31 డెంగీ, 1091 మలేరియా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేల్చారు.  

  చర్యలు నామమాత్రమే..
  విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఎక్కడా విషజ్వరాల వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషజ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గుగించి అవగాహన కల్పించడం లేదు. పీఎచ్‌సీల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రైడే క్యాంపులు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

 బారులు తీరుతున్న  జ్వర పీడితులు
 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి అనే తేడాలేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడుతులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా కొందరు వైద్యులు అవసరం లేని పరీక్షలు సైతం చేస్తూ రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. వారి నుంచి డబ్బు లాగేందుకు ప్లేట్‌లెట్ టెస్టులు అవసరం లేకపోయినా రాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement