చీకటి కష్టాలు
Published Wed, Dec 11 2013 3:49 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఏజెన్సీప్రాంతంలోని పలు గ్రామాలకు నేటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో 40 గ్రామాల ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. ఆయా గ్రామాల్లో కొత్తగా విద్యుత్ లైన్‌ల ఏర్పాటుకు అధికారులు చొరవచూపకపోవటంతో సోలార్ లైట్ల వెలుగులతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. అటవీ ప్రాంతాలు, గుట్టలపై ఉన్న గ్రామాలకు విద్యుత్ లైన్‌లు వేయటం సాధ్యం కాదని చెబుతున్న అధికారులు కనీసం భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు శ్రద్ధ చూపకపోవటం వారి నిర్లక్ష్యాన్ని తెలియచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం మండల పరిధిలోని నెల్లిపాక గ్రామానికి సమీపంలో చింతూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చిన నల్లకుంట కాలనీని ‘న్యూస్‌లైన్’ సందర్శించగా వారి చీకటి కష్టాలను చెప్పుకున్నారు.
అటవీప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలకు నోచుకోని నల్లకుంట గ్రామం నుంచి 44 గిరిజన కుటుంబాలను ఐటీడీఏ అధికారులు 2009లో నెల్లిపాక సమీపానికి తరలించాలని నిర్ణయించారు. వారి కోసం పక్కా గృహాలను నిర్మించిన అధికారులు కాలనీలో మౌలిక వసతులను కల్పించటంలో నిర్లక్ష్యం వహించారు. కొన్ని ఇళ్లు కూడా అసంపూర్తిగానే వ దిలేయటంతో గిరిజనులు ఇక్కడకు వచ్చేందుకు వెనుకంజ వేశారు. ప్రస్తుతం 25 కుటుంబాల వారు కాలనీలో నివసిస్తున్నారు. ఈ కాలనీలో అంతర్గత రహదారులు లేకపోవటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలనీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. గతంలో నల్లకుంట గ్రామంలో ఉన్నప్పుడు వారికి విద్యుత్ కనెక్షన్‌లు ఉండేవి.
వాటిని కొత్తగా వచ్చిన చోటుకు మార్పుచేసుకుందామన్నా విద్యుత్ లైన్‌లు లేకపోవటంతో అవి వృధాగా మారాయి. మూడు నెలల క్రితం ఐటీడీఏ ద్వారా కాలనీలో 50 మందికి సోలార్ ల్యాంప్‌లు ఇచ్చిన అధికారులు వాటిని ఇటీవలనే అమర్చారు. అయితే ఈ లైట్లు కొద్ది మేరకే కాంతిని ఇస్తున్నాయని, రాత్రి వేళ ఇంటిని నుంచి బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని గిరిజనులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కాలనీ మధ్యలోంచే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లైన్ వెళ్తుంది. దీనికి అనుసంధానంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్ అమర్చి కాలనీలో కొన్ని విద్యుత్ స్తంభాలు వేస్తే ప్రతీ ఇంటికి కనెక్షన్ ఇవ్వొచ్చు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవటంపై గిరిజనులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సోలార్ ల్యాంప్‌లే దిక్కు : గుట్టలపై నివసిస్తున్న కొండరెడ్డి గ్రామాలకు ఇప్పట్లో విద్యుత్‌లైన్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేదని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. ఇలా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండలంలో 9, కూనవరంలో 11,వీఆర్‌పురంలో ఒకటి, పాల్వంచ డివిజన్‌లోని వేలేరుపాడు మండలంలో ఒక కొండరెడ్డి గ్రామానికి ప్రస్తుతం విద్యుత్ సరఫరా లేదు. అదే విధంగా భద్రాచలం డివిజన్‌లోని వీఆర్‌పురం మండలంలో 1, దుమ్ముగూడెంలో 1 , పాల్వంచ డివిజన్‌లోని ముల్కలపల్లి మండలంలో 5, పినపాకలో 3, మణుగూరులో 2, బూర్గంపాడులో 5, వేలేరుపాడు మండలంలో ఒకటి చొప్పున గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా లేదు. ఈ గ్రామాల్లో సోలార్ సిస్టమ్ ద్వారా లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండరెడ్డి గ్రామాల్లో ఇంటింటికీ సోలార్ లాంతర్లు ఇవ్వటంతో పాటు వీధి లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో 50 చొప్పున సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఎల్‌డబ్ల్యూఈఏ పథకం కింద ఈ పనులకు గాను రూ.5.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుతం పనులు చేపట్టినప్పటికీ వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
విద్యుత్ లైన్‌లపై దృష్టిసారించని అధికారులు : భద్రాచలం మండలం చిన నల్లకుంట వంటి గ్రామాలకు కొత్తగా విద్యుత్ లైన్‌లు వేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు దృష్టి సారించకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్‌కు అనేక మార్లు వచ్చి తమ సమస్యపై విన్నవించుకున్నప్పటకీ సమస్యల పరిష్కారం కావటం లేదని ఆ గ్రామానికి చెందిన గిరిజనులు చెబుతున్నారు. కొద్దిపాటి ఖర్చుతో కాలనీకి విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉందని, ఐటీడీఏ అధికారులు దీనిపై దృష్టి సారించి ట్రాన్స్‌కో అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లైతే సమస్య పరిష్కారం అవుతుందని వారు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాల్లో విద్యుత్ వెలుగులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
Advertisement