గోదావరి నిలకడగా ఉన్నా... తొలగని ముప్పు
Published Sun, Aug 18 2013 3:20 AM | Last Updated on Wed, Apr 3 2019 9:29 PM
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం వద్ద గోదావరి శనివారం రాత్రి 42.3 అడుగుల నీటి మట్టంతో నిలకడగా నిలిచింది. స్నానఘట్టాల వద్దకు నీరు చేరుకుంది. ఎగువప్రాంతం నుంచి భారీగా వచ్చిన నీటితో శనివారం ఉదయానికి 42.6 అడుగులకు చేరిన నీటిమట్టం సాయంత్రానికి నాలుగు పాయింట్లు తగ్గింది. కాగా, ఎగువప్రాంతం నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘ అధికారులు తెలిపారు. అదేవిధంగా చర్ల వద్దవున్న తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 74వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. గోదావరి 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
దిగ్బంధంలోనే వాజేడు మండలం...
గోదావరి వరద పోటెత్తటంతో శుక్రవారం నాడే వాజేడు మండల కేంద్రానికి 32గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి 12.012మీటర్లుగా నమోదయిన నీటిమట్టం అర్ధరాత్రికి కొద్దిగా తగ్గి తిరిగి శనివారం సాయంత్రానికి 12.212 మీటర్లు నమోదయింది. దీంతో శని వారం కూడా వాజేడు మండలం జలదిగ్బంధంలోనే ఉంది. ప్రజలు నాటుపడవల ద్వారానే ప్ర యాణాలు సాగిస్తున్నారు. పేరూరు వద్ద ప్రస్తుతానికి గోదావరి నిలకడగా ఉన్నా, ఎగువన ఉన్న ప్రాణహిత, పెన్‌గంగా, ఇంద్రావతి నదుల నుంచి వచ్చే వరద నీటితో మరో అడుగువరకు పెరిగే అవకాశంఉందని అధికారులు తెలియచేస్తున్నారు.
భయం గుప్పెట్లో ఏజెన్సీ వాసులు...
ఇప్పటికే గోదావరి వరద భ ద్రాచలం డివిజన్‌ను మూడుసార్లు ముంచెత్తింది. దీంతో గోదావరి పెరుగుతుందనే మాట వింటేనే ఏజెన్సీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రెండు నెలలుగా గోదావరి వస్తూ...పోతూ....డివిజన్ ప్రజలను అతలాకుతలం చేసింది. గోదావరి ధాటికి డివిజన్‌లోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలోని అనేక వేల ఎకరాల పొలాలు నీటమునిగిపోయాయి. వరినారు, పత్తి, మిరపతో పాటు ఇతర పంటలు నీట మునిగడంతో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. మళ్లీ వరద పొలాలను ముంచెత్తితే ఈ ఏడాది వ్యవసాయాన్ని నిలిపివేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లిన ముంపు బాధితులు నష్టపోయిన తమ ఇళ్లను సరిచేసుకుంటున్నారు. ప్రస్తుతానికి గోదావరి నిలకడగా ఉన్నా ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు గోదావరిలో చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొనటంతో ఎప్పుడు ఏ ముంపు ముంచుకొస్తుందో అనే భయంతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
భద్రాచలంను వీడని స్లూయిస్‌ల భయం....
గోదావరి వరద పెరుగుతుండటంతో భద్రాచలంలోని పలు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా కరకట్టలు నిర్మించారు. మురుగునీరు గోదావరిలో కలిసేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేసిన స్లూయిస్‌లే పట్ణణ వాసుల పట్ల ప్రమాదకరంగా మారాయి. గోదావరి వరద భారీగా చేరినప్పుడు స్లూయిస్‌ల లీకేజిల వలన పట్టణంలోని అశోక్‌నగర్, కొత్తకాలనీ, కొత్తపేట, శిల్పినగర్‌లతో పాటు రామాలయంకు ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ పూర్తిగా వరదలో నీటిలో మునిగిపోతున్నాయి. దీంతో ప్రజలు, వ్యాపారస్తులు భారీగా నష్టపోతున్నారు.
ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు వాటిని సరిచేస్తున్నామని పేర్కొంటున్నా...గోదావరి పెరిగినప్పుడల్లా జరగాల్సిన ప్రమాదం జరిగిపోతూనే ఉంది. కాలనీ వాసులు, చిరువ్యాపారస్తులు కట్టుబట్టలతోనే బయటపడాల్సి వస్తోంది. విస్తా కాంప్లెక్స్ వ్యాపారస్తులు ఇప్పుడిప్పుడే తిరిగి దుకాణాలను తెరుస్తున్నారు. గత గోదావరి ముంపు తాలుకూ ఒండ్రు మట్టి ఇంకా పూర్తిగా పోకమునుపే గోదావరి పెరిగే అవకాశం ఉందని తెలవటంతో కాలనీవాసులు తమ సామాన్లను ముందుగానే సర్దుకొనేపనిలో పడ్డారు.
Advertisement