క్రమంగా తగ్గుతున్న వరద ప్రవాహం
భద్రాచలం వద్ద ఇంకా ప్రమాదకర స్థాయిలోనే..
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణలో వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కి శనివారం సాయంత్రం 6 గంటలకు 5,39,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా ఆదివారం అదే సమయానికి 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. సమ్మక్క బరాజ్ (తుపాలకుగూడెం)కి వరద 9,75,910 క్యూసెక్కుల నుంచి 8,45,560 క్యూసెక్కులకు తగ్గింది. సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) బరాజ్‌కి సైతం వరద 13,95,637 క్యూసెక్కుల నుంచి 11,65,362 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ మూడు బరాజ్‌లకు వచి్చన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద ఉదయం నుంచి తగ్గుముఖం
శనివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 53.60 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద, ఆదివారం ఉదయం 6 – 7 గంటల మధ్య 53 అడుగుల దిగువకు రాత్రి 11గంటల కల్లా 47.20 అడుగులకు తగ్గింది. దీంతో తొలుత అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం సైతం 14,36,573 క్యూసెక్కుల నుంచి 11,08,154 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కు లు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.
వరద కాల్వకు జలకళ
బోయినపల్లి (చొప్పదండి): మెట్టప్రాంత రైతుల వరప్రదాయని వరద కాల్వ ఆరు నెలల తర్వాత జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ మీదుగా రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మ«ధ్య మానేరుకు చేరుకుంటున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వరద కాల్వలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి.
భద్రాచలంలో ఇళ్లల్లోకి నీళ్లు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పట్టణంలోని ఏఎంసీ కాలనీకి ఎగువ భాగాన ఉన్న కరకట్ట స్లూయిజ్ నుంచి ఆదివారం సైతం వరద నీరు లీక్ కావడంతో అశోక్‌నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు గ్రామాల నడుమ ఇంకా రాకపోకలు సాగడం లేదు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment