- భద్రాచలం ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు
- ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి పొంగుతున్న వాగులూ వంకలు
- పలు జలశయాల్లోకి భారీగా వరదనీరు
- వెంకటాపురంలో అత్యధికంగా 124 మి.మీ వర్షం
- తాలిపేరు 18 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల
- జిల్లావ్యాప్తంగా 50వేల హెక్టార్లకు పెరగనున్న వరి సాగు
- ఆరుతడి పంటలకూ ఎంతో మేలు
ఖమ్మం వ్యవసాయం/ భద్రాచలం: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం జిల్లాలో ఎర్రుపాలెం, వేలేరుపాడు మండలాలు మినహా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. 21 మండలాల్లో 1 సెం.మీ, 17 మండలాల్లో 1 నుంచి 3 సెం.మీ, నాలుగు మండలాల్లో 3-6 సెం.మీ, అత్యధికంగా వెంకటాపురం మండలంలో 124 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆతర్వాత వాజేడులో 87.4 మి.మీ వర్షపాతం కురిసింది.
భద్రాచలం వద్ద గోదావరి నది ఒక్క సారిగా పెరిగింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు తాలిపేరు ప్రాజెక్టు నుంచి భారీగా వ రద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం రాత్రి 25 అడుగులకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 18 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న శబరి నది కూడా పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం నాటికి గోదావరి నీటిమట్టం 30 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా గోదావరి నీటి ప్రవాహం పెరగడంతో ఎగువన ఉన్న వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద గోదావరి రోడ్డెక్కింది. చీకుపల్లికి అవతల ఉన్న 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరుకు వె ళ్లాల్సిన వాహనాలను మండల కేంద్రం వాజేడు వరకు నడుపుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి నదుల నుంచి వరద నీరు కిందకు రావడంలేదు. కాబట్టి ఆదివారం సాయంత్రానికి పేరూరు వద్ద నీటిమట్టం కొంతతగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతుండటంతో ఆర్డీవో ఆర్. అంజయ్య పరీవాహక ప్రాంత అధికారులను అప్రమత్తం చేశారు.
రైతులకు కలిసొచ్చిన వాన..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆగస్టు 25వ తేదీ నుంచి జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇవే ఓ మోస్తరు వర్షాలు. ఆగస్టు మొదటి వారం తరువాత 20 రోజుల వరకు వర్షాలు కురవలేదు. 30 నుంచి 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదైంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, కంది, వరి తదితర పంటలు వాడిపోయే దశకు చేరాయి. వివిధ ప్రాంతాల్లో పోసిన వరినార్లు కూడా ఎండిపోయాయి. పైర్లపై ఆశలు వదులుకుంటున్న దశలో ఆగస్టు 25 నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానంగా సాగు చేస్తున్న పత్తి పలుచోట్ల పూత, కాత దశలో ఉంది.
ఈ ఏడాది పత్తి విస్తీర్ణం 1,63,717 హెక్టార్లకు చేరుకుంది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 14,305 హెక్టార్లు కాగా 11,697 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో ఈ పైరు కూడా వడబడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈ పైరుకు మేలు చేస్తున్నాయి. వరి పలు ప్రాంతాల్లో 20 రోజుల దశలో, పలు ప్రాంతాల్లో నాట్ల దశలో ఉంది. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో నాట్లు వేస్తున్నారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,32,727 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 50,470 హెక్టార్లలో సాగు చేస్తున్నారు.
ఈ పైర్లకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పైర్లపై ఆశలు పెంచుకున్న రైతులు అదను చూసి కాంప్లెక్స్, యూరియా వంటి ఎరువులు వేస్తున్నారు. ఎన్నెస్పీ రెండో జోన్‌కు శనివారం నీరు విడుదల చేశారు. దీనివల్ల వరి సాధారణ సాగు విస్తీర్ణస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఎన్నెస్పీ రెండో జోన్ కింది 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించనున్నామని ఎన్నెస్పీ ఎస్‌ఈ అప్పలనాయుడు ప్రకటించారు.
జిల్లాలో వివిధ పంటల పరిస్థితి
జిల్లాలో వివిధ పంటల పరిస్థితి ఇలా ఉంది. వరి 67,911 ఎకరాల్లో, మెట్ట పైర్లు 52,160 ఎకరాల్లో సాగవనున్నాయి. వరి సాగుకు ఇప్పటికే ఆలస్యం కావటంతో పలు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా కంది పంటను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. కంది సాధారణ విస్తీర్ణం 6,997 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 3,337 హెక్టార్లలో వేశారు. ఈ ఏడాది ఈ పంట విస్తీర్ణం ప్రస్తుత పరిస్థితిలో మరింతగా పెరిగే అవకాశం ఉంది. మిర్చి సాగు కూడా వేగం పంజుకుంది. జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 20, 135 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 1,976 హెక్టార్లలో సాగు చేస్తుంగా.. మిగిలిన విస్తీర్ణంలో కూడా ఈ పంటను వేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. మొత్తంగా జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 3,51,257 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2,41,818 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. ఈ విస్తీర్ణం మరో లక్ష హెక్టార్లకు పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాల్లోకి నీరు చేరుతోంది.
గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 132 మి.మీలు కాగా 2013-14 సంవత్సరంలో 178.8 మి.మీ గా నమోదయింది. జూలై సాధారణ వర్షపాతం 314 మి.మీలు కాగా 339 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు సాధారణ వర్షపాతం 280 మి.మీలు కాగా 218.6 మి.మీ నమోదైంది. ఈ ఏడాది జూన్ వర్షపాతం 29.7 మి.మీ, జూలై 241.6 మి.మీ, ఆగస్టు వర్షపాతం 171.4 మి.మీ నమోదైంది. మొత్తంగా సాధారణ వర్షపాతం కన్నా38.2 మి.మీ వర్షపాతం తక్కువగా నమోదైంది.