సాక్షి, అమరావతి: ఈ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంతో అండగా నిలిచింది. అవసరమున్న ప్రతి చోటా పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. పని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి సొంత ఊళ్లలోనే పనులు కల్పించింది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబరు 4వ తేదీ మధ్య కేవలం ఐదు నెలల్లోనే 19.93 కోట్ల పనిదినాలు కల్పించింది. వ్యవసాయ పనులే దొరకని ఈ ఐదు నెలల్లో 43.48 లక్షల కుటుంబాలు సొంత గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసుకొని రూ. 4,660.53 కోట్ల మేర లబ్ధి పొందాయి.
ఈ పథకం కింద కూలీలకు రోజుకు సరాసరిన రూ. 247.46 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో పేదలకు పనుల కల్పనలో గత నాలుగేళ్లుగా మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా మండు వేసవి కారణంగా సాధారణంగా గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయ పనులే ఉండని మే నెలలో ప్రభుత్వం రోజుకు సరాసరిన 28.73 లక్షల మంది పేదలకు పనులు కల్పించింది. సాధారణంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు మొదలయ్యాక ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఉపాధి హామీ పనులకు పెద్దగా డిమాండ్ ఉండదు.
అయితే, ఈ ఏడాది నాగార్జున సాగర్ పరిధిలో ఇంకా నీటి విడుదల చేయకపోవడం, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండటంతో ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యేకంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. గ్రామాల్లో పనులు చేసుకొనేందుకు ముందుకొచ్చినా ప్రతి ఒక్కరికీ లేదు అనకుండా జూలై, ఆగస్టు నెలల్లోనూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. జూలై నెలలో సరాసరిన రోజుకు 8.57 లక్షల మంది, ఆగస్టులో రోజుకు సరాసరిన 2.23 లక్షల మంది ఉపాధి హామీ పథకం పనులకు హాజరైనట్టు అధికారులు చెప్పారు.
పని కావాలని అడిగిన వారికి సొంత గ్రామాల్లోనే పనులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే 12.49 లక్షల పనులు గుర్తించి, సిద్ధం చేసి ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకొన్నాయి. అందువల్ల పది రోజులుగా ఉపాధి హామీ పనులకు డిమాండ్ తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ మధ్య ఆదివారం పోను మిగతా మూడు రోజుల్లో 10,376 మంది మాత్రమే ‘ఉపాధి’ పనులకు వచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment