సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ గద్వాల రూరల్/ ధరూర్/ దోమలపెంట: రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపినిచ్చినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు.
లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు.
శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు.
ఎగువ నుంచి తగ్గుతూ..
ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది.
శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు
కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది.
ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు.
ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment