భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు.
చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్‌పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో ఆధార్‌కార్డు అప్‌డేట్‌కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు.
ఆ సెంటర్‌లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment