సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగు వన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది.
మేడిగడ్డ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీనితో అధికారులు గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్క గురువారం రాత్రి 8 గంటల సమయానికి 9,79,347 క్యూసెక్కుల ప్రవాహంతో వరద నీరు 44.1 అడుగులకు చేరింది.
శుక్రవారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. ఇక ఎగువ గోదావరిలోనూ వరద పెరిగింది. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని పరీ వాహక ప్రాంతంలో వానలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి 59,165 క్యూసెక్కుల వరద చేరుతోంది.
వచ్చిన వరద వచ్చినట్టుగానే..
ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతున్న 5,37,140 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు దిగువన ఇంద్రావతి జలాలు తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 8,76,940 క్యూసెక్కుల వరద వస్తోంది.
ఈ మొత్తాన్నీ విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు దాదాపు గరిష్ట మట్టానికి చేరగా.. తాలిపేరు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటితోపాటు శబరి జలాలు కూడా కలసి గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది.
భద్రాచలం వద్ద వరద నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. దీనితో కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం భద్రాచలం రానున్నారు. వరద మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
పోలవరానికి పెరిగిన వరద
భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 5,99,490 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 48 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
నీటి మట్టం స్పిల్‌వే ఎగువన 31.88 మీటర్లు, దిగువన 23.3 మీటర్లుగా.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.55 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 22.73 మీటర్లుగా నమోదైంది. పోలవరం నుంచి నీరంతా ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత
గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరితోపాటు ఉప నదులు, వాగుల ప్రవాహాలతో ప్రభావం పడేచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కృష్ణా ఉప నదులకూజలకళ
మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నది ఉప నదుల్లోనూ వరద ప్రారంభమైంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి 32,146 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి నిల్వ 32.24 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 97 టీఎంసీలు అవసరం. దీని దిగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్‌లోకి ఇంకా వరద మొదలవలేదు.
ఇక కృష్ణా ఉపనది మలప్రభ నుంచి మలప్రభ ప్రాజెక్టులోకి 10,437 క్యూసెక్కులు, ఘటప్రభ ఉప నది నుంచి ఘటప్రభ ప్రాజెక్టులోకి 20,813 క్యూసెక్కులు వరద వస్తోంది. భద్ర నది నుంచి భద్ర రిజర్వాయర్‌లోకి 4,227 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్‌లోకి 9,536 క్యూసెక్కులు ప్రవాహాలు ఉన్నాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 12,925 క్యూసెక్కులు చేరుతున్నాయి.
ఈ ప్రాజెక్టులన్నీ నిండితే ప్రధాన కృష్ణా నదిలోకి వరద మొదలుకానుంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. నెలాఖరు నాటికి ప్రధాన నదిలో ప్రవాహాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వానలతో కృష్ణా ఉప నది అయిన మూసీలో వరద ఉధృతి పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 2,125 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment