తగ్గుతున్న వరద | The flow in Godavari and Krishna is decreasing | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న వరద

Published Sun, Jul 30 2023 4:18 AM | Last Updated on Sun, Jul 30 2023 9:12 AM

The flow in Godavari and Krishna is decreasing - Sakshi

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలోని గోదావరి నదిపై ఉన్నశ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను మూసేశారు. గోదావరి వరద ప్రవాహం ఎల్లంపల్లి, కాళేశ్వరం వద్ద తగ్గింది.

ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో.. ఆదివారం రాత్రి నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు 15,69,011 క్యూసెక్కులు వస్తుండటంతో అక్కడ నీటి మట్టం 55.6 అడుగులకు చేరుకుంది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తు­న్నారు.

భద్రాచలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వ­రం బ్యారేజ్‌లోకి 14,80,862 క్యూసె­క్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7,100 క్యూసెక్కులను వదులుతూ మిగులు జలాలను 175 గేట్ల ద్వారా అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లో నీటి మట్టం 15 అడుగుల వద్ద స్థిరంగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.  

శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.51 లక్షల క్యూసెక్కులు 
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, తుంగభద్రలలో వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి వరద ప్రవాహం తగ్గింది. ఇక తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ 69.23 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్‌ నిండుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.

శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,48,875, సుంకేశుల నుంచి 2,181 వెరసి 1,51,056 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో నీటి నిల్వ 837.9 అడుగుల్లో 58.81 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 157 టీఎంసీలు అవసరం. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద ప్రవాహం తగ్గింది.

పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 15 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. మున్నేరు, కట్టలేరు, బుడమేరులలో వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,06,370 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను 60 గేట్లు రెండు అడుగులు, పది గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.

సంగమేశ్వరుడిని చుట్టేస్తున్న కృష్ణమ్మ
కొత్తపల్లి (నంద్యాల):  శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవా­హం పెరగడంతో కొత్తపల్లి మండలంలోని సప్త­నదీ సంగమేశ్వరాలయాన్ని కృష్ణాజలాలు చుట్టేస్తు­న్నాయి. ఆలయం జలాధివాసానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ దంపతులు శనివారం ఆలయంలోని వేప­దారు శివలింగానికి కుంకుమార్చన, పుష్పార్చన, నదిజలాలతో అభిషేకం, మంగళహారతి వంటి విశేషపూజలు చేశారు. గంటగంటకు నీరు పెరుగుతుండటంతో శనివారం రాత్రి 9 గంటల సమయానికి గర్భాలయంలోకి నీరుచేరుతుందని పురోహితులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement