మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
పోటెత్తి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, వాగులు
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక.. కూనవరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
పోలవరం ప్రాజెక్టు నుంచి11.87 లక్షల క్యూసెక్కులు దిగువకు
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. బ్యారేజ్ నుంచి 13.20 లక్షల క్యూసెక్కులు కడలిలోకి..
వరద గుప్పెట్లో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు
ఉప్పొంగిన కృష్ణా, తుంగభద్ర
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చిం ది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 14,36,573 క్యూసెక్కుల వరద ప్రవాహంతో నీటి మట్టం 53.2 అడుగులకు చేరుకుంది. దాంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. (గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న భద్రాచలం వద్దకు గరిష్టంగా 27.02 లక్షల క్యూసెక్కుల వరద వచి్చనప్పుడు నీటి మట్టం 75.6 అడుగులుగా నమోదైంది). కూనవరం వద్ద శబరి ఉధృతి మరింత పెరిగింది. నీటి మట్టం 41.35 మీటర్ల (సముద్ర మట్టానికి)కు చేరుకోవడంతో కూనవరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
పోలవరం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 11,87,497 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో పోలవరం స్పిల్ వే ఎగువన నీటి మట్టం 33.5 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,29,774 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 13,20,274 క్యూసెక్కులను 175 గేట్లు పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్య గోదావరి బేసిన్‌లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది.
నీట మునిగిన రహదారులు
» గోదావరికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతర్గత రహదారులు నీట మునిగాయి.
» ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి బూర్గంపాడుకు వెళ్లే రహదారులు పలు చోట్ల వరద నీట మునిగి రాకపోకలు స్థంభించాయి. వెంకటాపురం నుంచి తిమ్మంపేట వెళ్లే రహదారి వరద నీటితో నిండిపోయింది. వరద పెరిగితే కుక్కునూరు నుంచి అశ్వారావుపేట వెళ్లే రహదారి సైతం నీట మునిగే అవకాశం ఉంది. పలు గ్రామాల్లో పంట చేలను ముంచెత్తింది. పలు గ్రామాల్లో ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
» తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి, పెరవలి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో పంటలు నీట మునిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పనపల్లి, ఎదురుబిడెం, కనకాయలంక కాజ్‌వేలపై వరద నీరు ప్రవహిస్తోంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
» పలు డ్రెయిన్ల నుంచి ముంపు నీరు అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల ద్వారా గౌతమి, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల ద్వారా దిగాల్సి ఉంది. అయితే గోదావరి వరదతో స్లూయిజ్‌ల గేట్లు మూసుకుపోయాయి. దీంతో డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 4,151 ఎకరాల్లో వరి పంట దెబ్బ తింది. ఈ నష్టం మరింత పెరగనుందని రైతులు వాపోతున్నారు.
వరద నష్టం లేనిచోట మంత్రుల పర్యటన
వేలేరుపాడు/తణుకు టౌన్: పెద్దవాగు ప్రవాహం వల్ల తమ ఇళ్లు కొట్టుకుపోయి సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల గ్రామాల్లో పర్యటించాల్సిన నలుగురు రాష్ట్ర మంత్రులు ఏ నష్టం జరగని ప్రాంతాల్లో శనివారం పర్యటించడం పట్ల జనం విస్తుపోతున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని మేడేపల్లి, కమ్మరిగూడెం, అల్లూరినగర్, ఒంటిబండ, కోయమాధారం, రాళ్లపూడి, రామవరం, ఉదయ్‌నగర్, ఊటగుంపు, యిప్పలగుంపు, సొందే గొల్లగూడెం, వసంతవాడ, మద్దిగట్ల, పాత పూచిరాల తదితర గ్రామాల్లో ఈ నెల 18న పెద్దవాగు ఆనకట్ట తెగిపోవడంతో 12 గ్రామాల్లో 513 ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
ఆయా గ్రామాల బాధితులు సర్వస్వం కోల్పోయారు. ఈ గ్రామాల్లో పర్యటించకుండా ఏ సమస్యలూ లేని కన్నాయిగుట్టను సందర్శించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి శనివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. జల దిగ్బంధంలో ఉన్న తిర్లాపురం గ్రామానికి వెళ్లకుండానే కన్నాయిగుట్ట వద్ద గోదావరిని పరిశీలించి వెనుదిరిగారు. ఆ తర్వాత శివకాశీపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం చేసి, వరదపై తూతూమంత్రంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తణుకు మండలం దువ్వలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment