సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం/అమలాపురం: గోదావరి నదిలో వరద ప్రవాహం దోబూచులాడుతోంది. దిగువన వరద తగ్గుతుండగా.. ఎగువన పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు బుధవారం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం అధికారులను హెచ్చరించింది.
కూనవరం వద్ద శబరి వరద ఉధృతి అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించింది. ప్రాణహితలో వరద పెరగడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అదేస్థాయిలో బ్యారేజీ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బ్యారేజీలోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.
సీతమ్మసాగర్లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి మంగళవారం మరింత తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 175 గేట్లను ఎత్తి బ్యారేజీ నుంచి 11,30,731 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. దిగువన వరద తగ్గడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో ముంపు వీడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment