మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణతో పాటు గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
పరవళ్లు తొక్కుతున్న శబరి, తాలిపేరు, ఇంద్రావతి, ప్రాణహిత
దీంతో గోదావరిలో గంటగంటకూ పెరుగుతున్న వరద ప్రవాహం
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
పోలవరం ప్రాజెక్టులోకి 8.60 లక్షల క్యూసెక్కులు.. 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల
నేడు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుందని సీడబ్ల్యూసీ అంచనా
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులు శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని కూడా పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి పోటెత్తుతోంది. గోదావరికి ఎగువున ప్రాణహిత తోడవ్వడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లోకి ఆదివారం సా.6 గంటలకు 5,52,600 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లు ఎత్తేసి, వచి్చంది వచి్చనట్లుగా దిగువకు వదిలేస్తున్నారు.
ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద జత కలిసింది. దీంతో తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి 8,23,450 క్యూసెక్కులు చేరుతుండడంతో అంతేస్థాయిలో గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) బ్యారేజ్‌లోకి 9,01,989 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడా వ చి్చంది వచి్చనట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహం కలుస్తోంది. ఫలితంగా.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది.
ఆదివారం సా.6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసి.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక.. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. ఇక ఈ వరదలు విలీన మండలాల వాసుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
కూనవరం వద్ద శబరి దూకుడు..
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో శనివారం భారీ వర్షాలు కురవడంతో శబరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి దూకుడుతో కూనవరం వద్ద నీటి మట్టం 36.74 మీటర్లకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసిన అధికారులు.. పరివాహక ప్రాంతంలో పల్లపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే ఎగువన నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తేసి.. మొత్తం 8.60లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ?
ఇక ఆదివారం సా.6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,74,171 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 7,72,371 క్యూసెక్కులను 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 149.03 టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. గతేడాది ఇదే సమయానికి 77.79 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఆదివారం కూడా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం.. ఇప్పటికే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో సోమవారం పేరూరు–ధవళేశ్వరం మధ్య గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. దీంతో సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి చేరే వరద పది లక్షల క్యూసెక్కులను దాటే అవకాశముందని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే.. సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.
ఇళ్లలోకి వరదనీరు..
మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని టోల్‌గేట్ సెంటర్‌తో పాటు సంతపాకలు, శబరిఒడ్డు ప్రాంతాల్లోని ఇళ్లలోకి క్రమక్రమంగా వరదనీరు ప్రవేశిస్తోంది. చింతూరు మెయిన్‌రోడ్ సెంటర్ నుండి శబరి ఒడ్డుకు వెళ్లే రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడున్న వివిధ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య.. చింతూరు మండలంలోని సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వంతెన వద్ద ఆదివారం రాత్రికి శబరినది నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది.
కుయిగూరు వాగు ఉధృతితో కల్లేరు వద్ద రహదారి కోతకు గురైంది. దీంతో ఏపీ నుండి ఒడిశాకు రాకపోకలు రెండోరోజూ కూడా కొనసాగలేదు. అలాగే, చింతూరు మండలం చట్టి వద్ద వరదనీరు విజయవాడ, జగదల్‌పూర్ జాతీయ రహదారి–30 పైకి చేరడంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది వాహనాలు సైతం నిలిచిపోయాయి. ఇక వీఆర్ మండలంలోని గోదవరి, శబరి ఉభయ నదుల పరివాహక గ్రామాల ప్రజలు వరదతో భయాందోళనకు గురవుతున్నారు. వడ్డిగూడెంతోపాటు మరికొన్ని చోట్ల కూడా గ్రామస్తులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు.
జలదిగ్బంధంలో ‘వేలేరుపాడు’
30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్..
మూడ్రోజులుగా అంధకారంలో పల్లెలు
పొంగిపొర్లుతున్న వాగులు.. ఉగ్రరూపం దాలి్చన గోదావరి, శబరి నదులతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. వేలేరుపాడు మండలానికి దిగువనున్న మేళ్ల వాగు, ఎద్దుల వాగు, టేకూరు వాగుల వంతెనలు నీట మునగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నార్లవరం, కన్నాయగుట్ట, జీలుగు చెరువు వద్ద రహదారంతా కూడా నీట మునిగింది.
ఇక వేలేరుపాడు నుంచి రుద్రమకోట, తాట్కూర్ గొమ్ము, రేపాక గొమ్ము వెళ్లే రహదారులూ నీట మునిగాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భారీ వర్షాలతో 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడ్రోజులుగా విద్యుత్ సరఫరాలేక ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment