Malaria disease
-
మలేరియా వచ్చిందని నా దగ్గరకు ఎందుకొచ్చావయ్య! వెళ్లి మళ్లీ ఆ దోమలతోనే కుట్టించుకో పోతుంది!
-
ఇంజక్షన్ వికటించి వివాహిత మృతి
వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ స్రవంతి నర్సింగ్ హోమ్‌లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్ వచ్చాయి. అయితే ప్లేట్స్ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ ఇవ్వగా ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్‌ను నిలదీశారు. ఇంజక్షన్ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఒక్కొకసారి రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్ చేసి వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. -
ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..
ప్రస్తుత వర్షాలు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజల జీవితాలను మరింత అల్లకల్లోలం చేసే జ్వరమైన మలేరియాను మరింత పెంచవచ్చు. మిగతా తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించకపోయినా... అడవుల్లో, కొండకోనల్లో ఎప్పుడు ఎండెమిక్‌గా ఉండే మలేరియా... ఇప్పటి వర్షాలతో మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. అక్కడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఉంది. ఈ నేపథ్యంలో మలేరియాపై అవగాహన కోసం ఈ కథనం. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని అనాఫిలిస్ ఆడ దోమ వ్యాప్తి చేస్తుంది. ఈ పరాన్నజీవి నాలుగు ప్రధాన ప్రజాతులుగా... అంటే... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి ఉంది గానీ ఇది కొద్ది దేశాలకే పరిమితం. లక్షణాలు: దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. చలి, తలనొప్పి, ఒళ్లునొప్పులతో పాటు జ్వరం రావడం మలేరియా ప్రధాన లక్షణం. వ్యాధిని కలిగించే పరాన్న జీవిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో బాధితులు కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకం మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కామెర్లు, కిడ్నీలు విఫలం కావడం తోపాటు ఒక్కోసారి మృత్యువుకూ దారితీయవచ్చు. నిర్ధారణ: ∙డిప్–స్టిక్’ పద్ధతితో 15 నిమిషాల్లోనే ఫలితాలు చాలా కచ్చితంగా తెలుస్తాయి. రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్ష చేసి, ఒకసారి పరీక్షల్లో మలేరియా పరాన్నజీవి బయటపడకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు. నివారణ: దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. మన ఇంట్లోకి దోమలు రాకుండా రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా శరీరంపైన పూత మందులు వాడవచ్చు. హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులు వద్దు. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులను వాడాలి. ఇళ్ల పరిసరాల్లో మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ∙పాత టైర్లు, ఖాళీ కొబ్బరి ప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకూడదు. కొంతమంది వాటర్ కూలర్స్లో కొన్ని నీళ్లు ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలు పడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, వాటిని మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి. చికిత్స: గతంలో మలేరియాకు క్వినైన్, క్లోరోక్విన్ వంటి మందులతో చికిత్స చేసేవారు. అయితే పరాన్నజీవి ఆ మందులకు నిరోధక శక్తి పెంచుకోవడంతో వాటిపై నియంత్రణ విధించారు. లక్షణాల తీవ్రతను బట్టీ, అలాగే... తీవ్రత తక్కువగా ఉండే వైవాక్సా లేదా తీవ్రత ఎక్కవగా ఉండే పాల్సిఫేరవ అనే దాన్ని బట్టి వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత వల్ల ఇతర పరిణామాలు... అంటే...కిడ్నీల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస అందకపోతే వెంటిలేషన్ వంటివి అవసరమవుతాయి. మందులతో పాటు మంచి ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
World Malaria Day: ‘మలేరియా’తో జరపైలం.. నిర్లక్ష్యం చేస్తే
సాక్షి, మహబూబ్‌నగర్: జ్వరమే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది మలేరియా కావచ్చు. ప్రాణాంతకంగా మారొచ్చు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. కానీ వ్యాధి బారినపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు అత్యంత ముఖ్యం. సోమవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వ్యాధి ఇలా సోకుతుంది.. ఎనాఫిలిస్ అనే ఆడదోమ కుట్టినప్పుడు మనిషి శరీరంపై ప్లాస్మోడియం పొరసైట్ అనే పరాన్నజీవిని వదులుతుంది. దోమకాటు వల్ల ఏర్పడిన రంధ్రంలో నుంచి మనిషి రక్తంలోకి పరాన్నజీవి ప్రవేశించి విస్తరిస్తుంది. ఈ పరాన్నజీవి రక్తంలోని రోగనిరోధక వ్యవస్థగా ఉన్న ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. దీనిమూలంగా మనిషికి రోజువిడిచి రోజు జ్వరం సోకుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకొని పక్షంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని రోగికి ప్రాణాంతకమవుతుంది. సుమారు 20రకాల ఎనాఫిలిస్‌దోమలు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయి. మలేరియా వ్యాధికి ప్రపంచంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మాడియం ఓవేల్ అనే నాలుగు రకాల పరాన్నజీవులు వ్యాధి తీవ్రతకు కారణమవుతున్నాయి. మనదేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం, పాల్సిపేరం అనే రెండు రకాల పరాన్నజీవులు కారణమవుతున్నాయి. వీటిలో ప్లాస్మోడియం పాల్సిపేరు అనే పరాన్నజీవి మలేరియా వ్యాధి తీవ్రతను పెంచి ప్రాణాంతకంగా మారుతోంది. నిరు నిల్వ ఉండే సంపులు, ఇతర నీటి పాత్రలు మురుగునీటి నిల్వ ప్రదేశాలు వ్యాధికారక దోమలకు ప్రధాన కేంద్రాలుగా మారుతాయి. వీటిలో దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి పెరిగి వ్యాధికారకంగా మారతాయి. నివారణ మార్గాలివి.. మలేరియా వ్యాధి రాకుండా నివారించడానికి ఎటువంటి టీకా మందులు లేవు. కేవలం దోమ కాటు నుంచి రక్షించుకోవడమే ప్రధాన మార్గం. మురుగు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలిన ఇంజిన్‌ఆయిల్, కిరోసిన్, డీడీటీ పౌడర్‌ను పిచికారీ చేయాలి. 5మి.లీ టెమిపాస్ 50శాతం ఇసీ మందును 10లీటర్ల నీటిలో కలిపి మురుగు కాల్వలు, వర్షపు నీటి గుంతలు, బోర్లు, నల్లాల వద్ద ఏర్పడే నీటి గుంతల, ఖాళీ చేయలేని నీటినిల్వ సంపులు, డ్రమ్ములలో పంచాయతీ సిబ్బంది పిచికారీ చేయాలి. ఈ ద్రావణం తినుబండారాలపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కూలర్లు, పూలకుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్ ట్యాంకుల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని మారుస్తూ ఉండాలి. సంపులపై ట్యాంకులపై మూతలు పెట్టాలి. వారానికి ఒకసారైనా శుభ్రం చేయడం వల్ల లార్వా ఉంటే చనిపోతుంది. పాతటైర్లు, పాత్రలు, కొబ్బరి చిప్పలు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. పడుకునే సమయంలో దోమతెరలు వాడాలి. దోమలను తరిమి వేసే కాయిల్స్ వంటివి ఉపయోగించాలి. ఇంట్లో కర్టెన్లు తరచూ మారుస్తూ ఉండాలి కిటికీలకు జాలీలను అమర్చుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చాలావరకు నివారించవచ్చు. కలుషిత నీటి ముప్పును ఎదుర్కొనేందుకు కాచి వడబోసిన నీటిని తాగటం చాలా అవసరం. ఫిల్టర్లు వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కాచి చల్లార్చి వడబోసిన నీళ్లే ఎక్కువ సురక్షితం. -
మలేరియా కట్టడి చర్యలు భేష్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): మలేరియా పేరు చెబితేనే విశాఖ మన్యం గడగడలాడేది. వ్యాధులు సీజన్ ప్రారంభమైతే ఏజెన్సీలో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగంలో అలజడి రేపేది. అలాంటి మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫాలివ్వడంతో వ్యాధి తీవ్రతతోపాటు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య 56 శాతం తగ్గాయి. ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియాను అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలిసారిగా 2008లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారని జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. దీనికి సంబంధించి ఆమె అందించిన వివరాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి మలేరియా కేసులు నమోదు పూర్తిగా తగ్గి పోవాలని సంకల్పించింది. దీనిలో భాగంగా 2020 నుంచి 2024 వరకూ ఏడాదికి ఒక థీమ్‌తో చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది మలేరియా భారాన్ని తగ్గించడం, జీవితాలను రక్షించడం అనే థీమ్‌తో చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 2030 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యం. గణనీయంగా తగ్గిన కేసులు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండేళ్లుగా మలేరియా కేసులతోపాటు, మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసులు నమోదు 56 శాతానికి తగ్గింది. 2021 లో 239 కేసులు నమోదుకాగా, 2022 లో ఇప్పటి వరకూ 105 కేసులు నమోదయ్యాయి. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
2050 నాటికిమలేరియాకు చెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మరో 30 సంవత్సరాలు పడుతుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సగం దేశాలు మలేరియా నుంచి విముక్తి పొందాయని మిగిలిన దేశాల్లో 2050 నాటికి ఈ వ్యాధిని అరికట్టవచ్చునని ఆ నివేదిక తెలిపింది. 2017లో మలేరియా కేసుల్లో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌కు చెందినవే కావడం ఆందోళన పుట్టిస్తోంది. నివేదిక ఎలా ? ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్న నిపుణులు, బయోమెడికల్ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, ఆరోగ్య నిపుణులు మొత్తం 40 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు అమలు చేస్తున్న వ్యూహాలు, కేటాయిస్తున్న నిధులు వంటివి క్రోడీకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ఏం చెప్పిందంటే ► 2017లో ప్రపంచంలో 21.9 కోట్ల మలేరియా కేసులు వెలుగులోకి వస్తే, అందులో కోటి కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అందులోనూ 71 శాతం తమిళనాడులో నమోదయ్యాయి. ► భారత్‌కు చెందిన పట్టణాల్లో మలేరియా వ్యాధికారక దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ► భారత్‌లో పట్టణీకరణ కారణంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, చెరువులు, కాల్వలు వంటి చోట్ల దోమలు బాగా వృద్ధి చెంది మలేరియా వ్యాపిస్తోంది. ► భారత్‌లో ఆరోగ్యానికి ప్రజలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మొండి వ్యాధులు దూరం కావడం లేదు. ► 2000 సంవత్సరం తర్వాత మలేరియా వ్యాధి మరణాలు 60 నుంచి 36 శాతానికి తగ్గిపోయాయి. ► నిధుల కొరత కారణంగ్లా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాకు చెందిన 55 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. ► ఇప్పటికీ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ► 2017లో మొత్తం మరణాల్లో 85శాతం 25 దేశాల్లోనే నమోదయ్యాయి. ► పేదరికం కారణంగా మలేరియా నిర్మూలనకు నిధులు కేటాయించలేక ఆఫ్రికా దేశాల్లో ఇంకా మరణాలు సంభవిస్తున్నాయి. ► ప్రాంతాలవారీగా, దేశాల వారీగా, అంతర్జాతీయంగా పటిష్టమైన చర్యల్ని తీసుకుంటేనే ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించగలం ► ప్రపంచ దేశాలన్నీ ప్రతీ ఏడాది 200 కోట్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయిస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమవుతుంది. ► ప్రస్తుత ఆవిష్కరణలను బట్టి 2050 నాటికి ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనిపించదు. -
రాజధానిలోమలేరియా టెర్రర్!
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ఓ మురికివాడలో దోమలన్నీ వానాకాలం సమావేశాలు నిర్వహించాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని దోమలు ముక్కు కదిలించుకుంటూ తరలివచ్చాయి. సమావేశానికి డెంగీ లక్ష్మి అధ్యక్షత వహించగా.. ఈ ఏడాది ముఖ్యఅతిథిగా మలేరియా రాణిని ఆహ్వానించాయి. కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలోనూ మలేరియా దోమ గురించే ప్రత్యేక ప్రస్తావన రావడంతో తనకు ఈ గౌరవం కట్టబెట్టాయి. ఈ సందర్భంగా మలేరియా రాణి మాట్లాడుతూ ‘గత ఐదేళ్లలో ప్రభుత్వం, అధికారుల సహకారంతో వందల మందిని మంచాన పడేశాం. ప్రతి ఏటా ఈ లక్ష్యాన్ని పెంచుకుంటూపోతున్నాం. ఈ ఏడాది కొత్త ప్రభుత్వమొచ్చాక మనపై దృష్టి సారించింది. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయినా మనం వెనక్కి తగ్గకూడదు. మురుగు కాలువలను పట్టించుకోని అధికారులు ఉన్నంత కాలం మన లక్ష్యానికి ఢోకా లేదు. ఎంతైనా గత పాలనలో పరిశుభ్రతపై దృష్టి సారించని మున్సిపల్ అధికారులకు మనందరం సన్మానం చేయాలి. కొత్త ప్రభుత్వంలోనూ అలాంటి అధికారులుంటే వారినీ ఇదే విధంగా సత్కరించాలి. మరింత మంది రక్తాన్ని తాగి.. వారి ప్రాణాలు తీయాలి. ఈ ఏడాదికిగాను ఈ లక్ష్యాలను నేను ప్రతిపాదిస్తున్నాను’ అని మలేరియా రాణి ప్రసంగం ముగించింది. దీనికి గున్యా వాణి ఆమోదం తెలుపగా మిగిలిన దోమలన్నీ మద్దతు పలికాయి. చివరిగా మలేరియా రాణిని ఆదర్శంగా తీసుకుని ఇక ప్రజలను కుట్టేద్దాం కదలండంటూ సమావేశాన్ని ముగించాయి. మలేరియా జ్వరం.. ఈ పేరు చెబితేనే గ్రామాల్లో చాలా మంది వణికిపోతారు. నెలల తరబడి జ్వరం పీడిస్తూ ఉండటమే కారణం. వ్యాధి సోకిందంటే ఒక పట్టాన త్వరగా శరీరాన్ని వదిలిపోదు. మలేరియా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నారు. గతేడాది 420 మంది మలేరియా బారిన పడగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు 103 మంది మలేరియా బారిన పడ్డారు. మలేరియా వ్యాధి సోకకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అత్యధిక సంఖ్యలో తూర్పు గోదావరి జిల్లాలో మలేరియా కేసులు నమోదు అవ్వగా వైజాగ్ రెండో స్థానంలో, గుంటూరు జిల్లా మూడో స్థానంలో ఉంది. మలేరియా లక్షణాలు: మలేరియా వ్యాధి అనాఫిలిస్ అనే దోమకాటు వల్ల వస్తోంది. ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. చలి, వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, మూత్రం మందగించటం, లివర్, కడుపులో నొప్పి, జ్వరం మూడు రోజులకొకసారి లేదా రెండు రోజులకొక సారి లేదా రోజుమార్చి రోజు వస్తూ ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. నిర్ధారణ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ గంట వ్యవధిలోపు చేస్తారు. రక్తపు పూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ జరిగితే క్లోరోక్విన్, ప్రైమాక్సిన్ అనే మాత్రలను ఇస్తారు. ఇవి 14 రోజులు ఆపకుండా తప్పని సరిగా వాడాలి. ఈ మందులన్నీ కూడా ఉచితంగా అందిస్తారు. న్యూడ్రగ్పాలసీ 2012 ప్రకారం తప్పని సరిగా 14 రోజులు మందులు వాడాలి. జిల్లాలో నమోదైన కేసులు.. జిల్లాలో మలేరియా జ్వరం 2014లో 428 మందికి, 2015లో 413 మందికి, 2016లో 369 మందికి, 2017లో 962 మందికి వచ్చింది. 2018లో 420 మందికి మలేరియా వచ్చింది. 2019లో జనవరిలో 47 మంది, ఫిబ్రవరిలో నలుగురు, మార్చిలో ఒకరు, ఏప్రిల్‌లో ఐదుగురు, జూన్‌లో 21 మంది, జూలైలో 25 మంది మొత్తం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 103 మలేరియా వ్యాధి బారిన పడ్డారు. మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలు.. గుంటూరు నగరంలోని ఆర్టీసీ కాలనీ, బాలాజీనగర్, ఆలీనగర్, అంబేడ్కర్‌నగర్, పాతగుంటూరు, లాలాపేట, నల్లచెరువు, ఏటి అగ్రహారం, ఆర్. అగ్రహారం. బ్రాడీపేట, శారదాకాలనీ, శ్రీనివాసరావుపేట, గుంటూరువారితోట, పొత్తూరివారితోట, తారకరామనగర్, శాంతినగర్, వాసవినగర్, సంగడిగుంట, కృష్ణబాబుకాలనీ, కంకరగుంట, అడవితెక్కళ్లపాడు, లింగాయపాలెం, మోపిరివారిపాలెం, నరసరావుపేట, బొల్లాపలి, వినుకొండలో మలేరియా కేసులనమోదు అయ్యాయి. కచ్చితమైన నిర్ధారణ చేయాలి సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయని పక్షంలో నెలల తరబడి మలేరియా వ్యాధి పీడిస్తోంది. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయక ఏళ్ల తరబడి ఎందరో అవస్థలు పడిన సంఘటనలు ఉన్నాయి. కొందరిలో సెరిబ్రల్ మలేరియా, వైవ్యాక్స్ మలేరియాలు కూడా వస్తాయి. ఈ వ్యాధులు సోకిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, కామెర్లు పెరిగిపోవటం, నిమోనియా, ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవటం, స్ప్రుహకోల్పోవటం జరుగుతుంది. ఈ వ్యాధి మలేరియా ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించటం ద్వారా, మలేరియా వ్యాధి ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మనల్ని కుట్టటం ద్వారా సోకుతోంది. –డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్ నివారణ చర్యలు తీసుకుంటున్నాం మలేరియా నివారణ కోసం మే నెల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్‌లో మలేరియా నివారణ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా కేసులు నమోదైన గ్రామాల్లో మలాథిన్ఫాగింగ్ , పైరిత్రమ్ స్ప్రే, యాంటీలార్వా చర్యలు తీసుకున్నాం. మలేరియాను నోటిఫైడ్ డిసీజ్‌గా నిర్ధారణ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులంతా తమ వద్దకు వచ్చిన వారికి మలేరియా వ్యాధి నిర్ధారణ చేసిన వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. మలేరియాను 2027 కల్లా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి. –డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
పంజా విసురుతోన్న డెంగీ
సాక్షి, హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిలోఫర్‌లోనే ప్రతీ రోజూ రెండు మూడు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ, మలేరియా బాధితులు వస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనైతే మలేరియా వ్యాప్తి పెరిగింది. ఎన్నికల కోడ్‌తో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోగా, దీన్నే సాకుగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు... మూడు నాలుగేళ్ల క్రితం వరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు కొడుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండేళ్ల డెంగీ కేసులను పరిశీలిస్తే సగం వరకు అన్సీజన్లోనే నమోదయ్యాయి. గతేడాది జనవరి–ఏప్రిల్‌ల్లో 237 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 457 కేసులు నమోదయ్యాయి. 2018లో అదే 4 నెలల కాలంలో 289 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 437 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి చికున్ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చింద ని డాక్టర్ కమల్‌నాథ్ అంటున్నారు. డెంగీ కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ: గత అంచనాల ప్రకారం మలేరియా పీడిత గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు 1,414గా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. మన దేశంలో గతేడాది జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం గమనార్హం. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణమే ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పేరు తో వేల వేలకు గుంజుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ‘ప్రైవేట్’ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు పడిపోయిన తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. -
డెంగీ పంజా !
భద్రాచలం/ ఖమ్మం వైరారోడ్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంపై డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులను సైతం ఈ వ్యాధి పొట్టన బెట్టుకుంటోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట డెంగీ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శత విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ, పారిశుధ్య లోపంతో దోమలు వ్యాప్తి చెందటంతో విషజ్వరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్యకేంధ్రాలు ఉండగా, వీటిలో 50 ఏజెన్సీలోనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ‘గ్రామ సందర్శన’ పేరుతో క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పటకీ, వ్యాధులు అదుపులోకి రావటం లేదు. గత నివేదికల ఆధారంగా ఏజెన్సీలో ఉన్న 46 పీహెచ్‌సీలను మలేరియా పీడిత ప్రాంతాలుగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు గుర్తించారు. వీటి పరిధిలో ఉన్న 1116 గ్రామాలల్లో దోమల నివారణ కోసం స్ప్రేయింగ్ చేశారు. గతంలో దోమల మందు పిచికారీకి నిధుల కొరత ఉండేది. కానీ ఈ ఏడాది ఐటీడీఏ పీవో దివ్య ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా మలేరియా శాఖకు నిధుల సర్దుబాటు చేయటంతో దాదాపు అన్ని గ్రామాల్లో మొదటి దశ స్ప్రేయింగ్ పూర్తి చేశారు. అయినా పారిశుధ్య లోపంతో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు అదుపులోకి రావటం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నాలుగు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాటేస్తున్న కొత్తరకం వైరస్.. ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏడాది కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందింది. భద్రాచలం మండలం గుండాల కాలనీలో రెండు నెలల వ్యవధిలో వరుసుగా ఆరుగురు మృతి చెందారు. దీనిపై పరిశోధనలు చేసిన నిపుణుల బృందం ‘ఆర్బోవైరస్’ కారణమని తేల్చింది. కానీ దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలనే దానిపై ఇప్పటి వరకూ అధికారులు దృష్టి సారించలేదు. తాగునీరు కలుషితం వల్లే దోమలు వ్యాప్తి చెంది కొత్తరకం వైరస్ వచ్చిందని వైద్యాధికారులు చెపుతున్నారు. ఇక ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీరు అందక ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు. డేంజర్ జోన్‌గా ముంపు పీహెచ్‌సీలు... ఏజెన్సీలోని 50 పీహెచ్సీలలో 45 కేంద్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి ప్రతి ఏటా దోమల మందు పిచికారీ చేస్తున్నారు. మలేరియా వ్యాధిని అదుపు చేసేందుకు 33 పీహెచ్‌సీలకు ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయం కూడా అందజేస్తోంది. అయితే ఇందులో 15 పీహెచ్‌సీలు మరింత డేంజర్‌జోన్‌గా ఉన్నాయి. వీటిలో చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, వీఆర్‌పురం మండలం రేఖపల్లి, జీడిగుప్ప, కూనవరం మండలం కూటూరు, వేలేరుపాడు మండలం కొయిదా వంటి పీహెచ్‌సీల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతాయి. జిల్లా మొత్తం మీద ఇప్పటి వరకూ సుమారుగా 1300 మలేరియా కేసులు నమోదు కాగా, పైన పేర్కొన్న పీహెచ్సీలలో 300 వరకూ ఉంటాయి. రెండు నెలల్లో 20 మంది మృతి... జిల్లాలో గడచిన రెండు నెలల్లో 20 మంది వరకు విషజ్వరాల బారిన పడి మరణించినట్లు తేలింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బొబ్బళ్లపాటి రవి రత్నప్రసాద్ వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ సోమవారం మతిృచెందారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఈ యేడాది ఆగస్టు నెలాఖరు నాటికి జిల్లాలో 31 డెంగీ, 1091 మలేరియా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేల్చారు. చర్యలు నామమాత్రమే.. విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఎక్కడా విషజ్వరాల వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషజ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గుగించి అవగాహన కల్పించడం లేదు. పీఎచ్‌సీల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రైడే క్యాంపులు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. బారులు తీరుతున్న జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి అనే తేడాలేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడుతులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా కొందరు వైద్యులు అవసరం లేని పరీక్షలు సైతం చేస్తూ రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. వారి నుంచి డబ్బు లాగేందుకు ప్లేట్లెట్ టెస్టులు అవసరం లేకపోయినా రాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.