ప్రస్తుత వర్షాలు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజల జీవితాలను మరింత అల్లకల్లోలం చేసే జ్వరమైన మలేరియాను మరింత పెంచవచ్చు. మిగతా తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించకపోయినా... అడవుల్లో, కొండకోనల్లో ఎప్పుడు ఎండెమిక్‌గా ఉండే మలేరియా... ఇప్పటి వర్షాలతో మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. అక్కడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఉంది.
ఈ నేపథ్యంలో మలేరియాపై అవగాహన కోసం ఈ కథనం. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని అనాఫిలిస్ ఆడ దోమ వ్యాప్తి చేస్తుంది. ఈ పరాన్నజీవి నాలుగు ప్రధాన ప్రజాతులుగా... అంటే... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి ఉంది గానీ ఇది కొద్ది దేశాలకే పరిమితం.
లక్షణాలు: దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. చలి, తలనొప్పి, ఒళ్లునొప్పులతో పాటు జ్వరం రావడం మలేరియా ప్రధాన లక్షణం. వ్యాధిని కలిగించే పరాన్న జీవిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత ఎక్కువ.
ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో బాధితులు కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకం మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కామెర్లు, కిడ్నీలు విఫలం కావడం తోపాటు ఒక్కోసారి మృత్యువుకూ దారితీయవచ్చు.
నిర్ధారణ: ∙డిప్–స్టిక్’ పద్ధతితో 15 నిమిషాల్లోనే ఫలితాలు చాలా కచ్చితంగా తెలుస్తాయి.
రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్ష చేసి, ఒకసారి పరీక్షల్లో మలేరియా పరాన్నజీవి బయటపడకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు.
నివారణ:
- దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం.
- మన ఇంట్లోకి దోమలు రాకుండా రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు.
- దోమలు కుట్టకుండా శరీరంపైన పూత మందులు వాడవచ్చు.
- హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులు వద్దు. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులను వాడాలి.
- ఇళ్ల పరిసరాల్లో మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ∙పాత టైర్లు, ఖాళీ కొబ్బరి ప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకూడదు.
- కొంతమంది వాటర్ కూలర్స్‌లో కొన్ని నీళ్లు ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలు పడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, వాటిని మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి.
చికిత్స: గతంలో మలేరియాకు క్వినైన్, క్లోరోక్విన్ వంటి మందులతో చికిత్స చేసేవారు. అయితే పరాన్నజీవి ఆ మందులకు నిరోధక శక్తి పెంచుకోవడంతో వాటిపై నియంత్రణ విధించారు. లక్షణాల తీవ్రతను బట్టీ, అలాగే... తీవ్రత తక్కువగా ఉండే వైవాక్సా లేదా తీవ్రత ఎక్కవగా ఉండే పాల్సిఫేరవ అనే దాన్ని బట్టి వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత వల్ల ఇతర పరిణామాలు... అంటే...కిడ్నీల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస అందకపోతే వెంటిలేషన్ వంటివి అవసరమవుతాయి. మందులతో పాటు మంచి ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment