agency peoples
-
ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..
ప్రస్తుత వర్షాలు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజల జీవితాలను మరింత అల్లకల్లోలం చేసే జ్వరమైన మలేరియాను మరింత పెంచవచ్చు. మిగతా తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించకపోయినా... అడవుల్లో, కొండకోనల్లో ఎప్పుడు ఎండెమిక్‌గా ఉండే మలేరియా... ఇప్పటి వర్షాలతో మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. అక్కడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఉంది. ఈ నేపథ్యంలో మలేరియాపై అవగాహన కోసం ఈ కథనం. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని అనాఫిలిస్ ఆడ దోమ వ్యాప్తి చేస్తుంది. ఈ పరాన్నజీవి నాలుగు ప్రధాన ప్రజాతులుగా... అంటే... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి ఉంది గానీ ఇది కొద్ది దేశాలకే పరిమితం. లక్షణాలు: దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. చలి, తలనొప్పి, ఒళ్లునొప్పులతో పాటు జ్వరం రావడం మలేరియా ప్రధాన లక్షణం. వ్యాధిని కలిగించే పరాన్న జీవిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో బాధితులు కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకం మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కామెర్లు, కిడ్నీలు విఫలం కావడం తోపాటు ఒక్కోసారి మృత్యువుకూ దారితీయవచ్చు. నిర్ధారణ: ∙డిప్–స్టిక్’ పద్ధతితో 15 నిమిషాల్లోనే ఫలితాలు చాలా కచ్చితంగా తెలుస్తాయి. రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్ష చేసి, ఒకసారి పరీక్షల్లో మలేరియా పరాన్నజీవి బయటపడకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు. నివారణ: దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. మన ఇంట్లోకి దోమలు రాకుండా రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా శరీరంపైన పూత మందులు వాడవచ్చు. హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులు వద్దు. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులను వాడాలి. ఇళ్ల పరిసరాల్లో మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ∙పాత టైర్లు, ఖాళీ కొబ్బరి ప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకూడదు. కొంతమంది వాటర్ కూలర్స్లో కొన్ని నీళ్లు ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలు పడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, వాటిని మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి. చికిత్స: గతంలో మలేరియాకు క్వినైన్, క్లోరోక్విన్ వంటి మందులతో చికిత్స చేసేవారు. అయితే పరాన్నజీవి ఆ మందులకు నిరోధక శక్తి పెంచుకోవడంతో వాటిపై నియంత్రణ విధించారు. లక్షణాల తీవ్రతను బట్టీ, అలాగే... తీవ్రత తక్కువగా ఉండే వైవాక్సా లేదా తీవ్రత ఎక్కవగా ఉండే పాల్సిఫేరవ అనే దాన్ని బట్టి వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత వల్ల ఇతర పరిణామాలు... అంటే...కిడ్నీల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస అందకపోతే వెంటిలేషన్ వంటివి అవసరమవుతాయి. మందులతో పాటు మంచి ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
పోలవరం నిర్వాసితులు అండగా ఉంటాం
వారికి అండగా వైఎస్సార్ సీపీ పోరాడుతుంది ఎమ్మెల్సీ బోస్, జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కూనవరం: పోలవరం నిర్వాసితులు నీటి దాతలని వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్ సీపీ æ పోరాడుతుందని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. మండలంలోని నర్సింగపేట, పెద నర్సింగపేట, కూళపాడు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీవర్షానికి సర్వం తుడిచి పెట్టుకుపోయి ఇసుక మేటలు వేసిన పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్(బాబు)తో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. 300పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, చేలల్లో ఇసుక మేటలు వేసిందని వారు తెలిపారు. పంటనష్టం సర్వేకి వచ్చిన రెవెన్యూ అధికారులు పోలవరం పరిహారం తీసుకున్న భూములకు నష్టపరిహారం రాదని సర్వేకూడా చేయమని చెప్పారని రైతు కొర్సా రవికుమార్ తెలిపారు. బోస్, కన్నబాబు మాట్లాడుతూ ఐటీడీఏ సప్లాన్ నిధుల నుంచి తక్షణమే ఇసుక మేటలు తొలగించాలని డిమాండ్ చేశారు. పంటనష్టం క్రింద ఎకరానికి రూ.2 లక్షలు అందజేయాలని కోరారు. అనంతరం కాచవరంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏచట్ట ప్రకారం పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం ఇచ్చారో అదే చట్టం ప్రకారం పోలవరం ముంపు బాధితులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు పాతబస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల కన్వీనర్ ఆలూరి కోటయ్య, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి కొవ్వూరి శివయాదవ్, వైస్ ఎంపీపీ గుజ్జాబాబు, జిల్లానాయకులు పూసం ప్రసాద్, భరతమూర్తి, కొమ్మాని మోహన్‌రావు, పాపారావు, ఎంపీటీసీలు కరక లక్ష్మి, సరియం మహాలక్ష్మి, సర్పంచ్ కారం పార్వతి, సాయిబాబు, సీతారామారావు, ఎస్కే కిస్మత్, కొండల రావు, దివాకర్, సాయిల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్‌పురం మండలంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి వీఆర్‌పురం: వీఆర్‌పురం మండలంలో హెల్త్ ఎమర్జెన్సీని వెంటనే ప్రకటించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి నలుగురు మృతి చెందడంతో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆరా తీసి తన తరఫున మృతుల కుటుంబాలను పరామర్శించాల్సిందిగా సూచించడంతో శనివారం కన్నబాబు, బోస్, ఎమ్మెల్యే రాజేశ్వరి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ వారిని పరామర్శించారు. లక్ష్మీనగరంలో ఈ వ్యాధితో మృతి చెందిన సరియం బాబూరావు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. బాబూరావు తండ్రి బొజ్జి, తమ్ముడు ముత్తయ్యలు కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అన్నవరం గ్రామంలో ఈ వ్యాధితో మృతి చెందిన పూసం మంగవేణి , బురకా ఎర్రయ్య, గొడ్ల కన్నయ్య కుటుంబ సభ్యులను కూడా వారు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఈ మరణాలకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడి నెల పైగా కావస్తున్నా ఇప్పటి వరకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబును మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించమని అడిగితే ముఖ్యమంత్రి పేరు చెప్పి తప్పిచుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. తమ పార్టీ తరఫున కూడా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.