సాక్షి, హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిలోఫర్‌లోనే ప్రతీ రోజూ రెండు మూడు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ, మలేరియా బాధితులు వస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనైతే మలేరియా వ్యాప్తి పెరిగింది. ఎన్నికల కోడ్‌తో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోగా, దీన్నే సాకుగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు...
మూడు నాలుగేళ్ల క్రితం వరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు కొడుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండేళ్ల డెంగీ కేసులను పరిశీలిస్తే సగం వరకు అన్‌సీజన్‌లోనే నమోదయ్యాయి. గతేడాది జనవరి–ఏప్రిల్‌ల్లో 237 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 457 కేసులు నమోదయ్యాయి. 2018లో అదే 4 నెలల కాలంలో 289 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 437 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి చికున్ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చింద ని డాక్టర్ కమల్‌నాథ్ అంటున్నారు. డెంగీ కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ: గత అంచనాల ప్రకారం మలేరియా పీడిత గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు 1,414గా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. మన దేశంలో గతేడాది జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం గమనార్హం. డెంగీ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య సాధారణమే ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పేరు తో వేల వేలకు గుంజుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ‘ప్రైవేట్’ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్లేట్‌లెట్లు పడిపోయిన తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
పంజా విసురుతోన్న డెంగీ
Published Tue, Apr 23 2019 3:17 AM | Last Updated on Tue, Apr 23 2019 3:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment