
ప్రస్తుతం నెట్‌వర్క్‌లో 409 ప్రైవేటు ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులు ఉండగా, అందులో 409 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తంగా వెయ్యి ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 3 వేలకుపైగా ఆస్పత్రులు సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పొందేందుకు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పరిధిలోకి కనీసం వెయ్యి ఆస్పత్రులను తీసుకురావాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.
రెట్టింపైన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచింది. అలాగే కొత్తగా 163 వ్యాధులను జతచేసి ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1,835 వ్యాధులను చేర్చింది. 1,375 ప్రొసీజర్లకు సంబంధించి హాస్పిటళ్లకు చెల్లిస్తున్న ధరలను 20 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 3,53,474 మంది చికిత్స చేయించుకున్నారు. కాగా, హాస్పిటళ్లకు సగటున ఏటా రూ.684 కోట్ల చొప్పున (నెలకు రూ.57 కోట్లు) బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చెల్లిస్తే, కాంగ్రెస్ హయాంలో రూ.966.54 కోట్లు చెల్లించారు. అంటే నెలకు రూ.87 కోట్లు చెల్లించారు.