డెంగీ నిర్ధారణ ఇక చాలా సులువు
కేవలం రూ.700కే ఐపీఎఫ్ పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన ‘యశోద’
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యశోద ఆస్పత్రి వైద్యులు అతి తక్కువ ఖర్చుతో డెంగీ వ్యాధిని నిర్ధారించే అత్యాధునిక పరీక్షా పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. వ్యాధి ఏ దశలో ఉంది? ఏ చికిత్స అవసరం? అనే అంశాలు కేవలం రూ.700 లతో పరీక్ష చేయించుకుంటే తేలిపోతుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణకై అత్యాధునిక ఇమ్మెచ్యూర్ ప్లేట్‌లెట్ ఫ్రాక్షన్ (ఐపీఎఫ్) టెస్ట్‌ను వైద్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ఆస్పత్రుల్లో డెంగీ వ్యాధిని గుర్తించేందుకు సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఐపీఎఫ్ పరీక్ష ద్వారా బోన్‌మ్యారో పనితీరు అంచనా వేసే అవకాశంలో పాటు బోన్‌మ్యారోలో లోపం ఉంటే మెరుగైన చికిత్సలు అందించి పేషెంట్ ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. ప్రస్తుతం ఐపీఎఫ్ టెస్ట్‌తో పాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షను అందుబాటులోకి తెచ్చామన్నారు.