డెంగ్యూ కలవరం
ఒకే కుటుంబంలో ఇద్దరికి వ్యాధి, మరొకరికి లక్షణాలు
ఏటా వివిధ జ్వరాల దాడి ప్లేట్‌లెట్లకు కొరత
అల్లాడుతున్న సామాన్యులు
జ్వర బాధితులు
2012 87,932
2013 71,039
2014 56,084
(జులై వరకూ)
విశాఖపట్నం, మెడికల్: నగరంపై డెంగ్యూ వ్యాధి మళ్లీ పంజా విసిరింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులకు వ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. మాధవధార ప్రాంతానికి చెందిన బి.లక్ష్మణరావు (40), ఆయన పెద్ద కుమారుడు బి.అభినవ్ (9)లకు వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు జీవీఎంసీ వైద్యాధికారులు మంగళవారం వెల్లడించారు. చిన్న కుమారుడు అనిరుద్‌కు కూడా ఈ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. లక్ష్మణరావు, అభినవ్‌ల రక్తనమూనాలను పరీక్షలకు పంపగా డెంగ్యూగా నిర్థారణ అయింది. లక్ష్మణరావు, అభినవ్‌లను కేజీహెచ్‌కు తరలించారు. ఇప్పటి వరకూ నగర పరిధిలో 14 మందికి డెంగ్యూ వ్యాధి సోకగా, వీరి లో సీతమ్మధారకు చెందిన ఒకరు మృతి చెందినట్టు అధికారిక గణాంకాలువెల్లడిస్తున్నాయి.
కేజీహెచ్‌లో జనవరి నుంచి 23 డెంగూ కేసులు నమోదయ్యాయి. నగర వాసులపై జ్వరాలు దండెత్తుతున్నాయి. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆస్పత్రుల వద్ద రోగులు బారులుతీరుతున్నారు. వర్షాకాలం ప్రారంభమం కావడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో నగరం వణుకుతోంది. జ్వర తీవ్రతను తట్టుకోలేక అధిక సంఖ్యలో రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మురికివాడల్లో ఉన్నవారెక్కువగా వీటి బారిన పడుతున్నారు. 2012 సంవత్సరంలో నగర పరిధిలో 87,932 మంది వివిధ రకాల జ్వరాలభారిన పడ్డారు. వీరిలో మలేరియా భారిన 3,019 మంది, డెంగూ జ్వరంతో 42మంది బాధపడ్డారు. 2013లో 71,039 మంది అన్ని రకాల జ్వరాలతో బాధపడగా, అందులో 3046 మంది మలేరియాబారిన, డెంగూ 61 మందికి సోకింది. ఈ ఏడాది జూలై నాటికి 56,084 మంది జ్వరాలభారిన పడ్డారు. వీరిలో మలేరియా 1181 మందికి, డెంగూ భారిన 15 మంది పడగా ఒకరు మృతిచెందారు. మలేరియా వ్యాధి సోకేందుకు అవకాశాలున్న 34 మురికివాడలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా జీవీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు గుర్తించాయి. ఈ ప్రాంతాల్లో దోమల నిర్మూలన, పారిశుద్ధ్య కార్యక్రమాల మెరుగుదల విషయంలో మాత్రం ఈ శాఖలు ఉదాసీనత వహిస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో దోమల సంఖ్య పెరిగి నగరంపై దాడిచేస్తూ రోగాలభారిన పడేటట్లు చేస్తున్నాయి.
ప్లేట్‌లెట్ల కొరత : డెంగూ, వైరల్ జ్వరాల్లో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోవడంతో జ్వరపీడితులు ఎక్కువమంది ప్రాణాప్రాయ స్థితికి చేరుకుంటున్నారు. నగరంలో ప్లేట్‌లెట్లకు కొరత ఏర్పడింది. కొన్ని బ్లడ్‌బ్యాంకులు ప్లేట్‌లెట్ల కృత్రిమ కొరతను సృష్టించి రోగులను దోచుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ప్లేట్‌లెట్‌లు కొనలేనివారు మృత్యువాత పడుతున్నారు.